కోవిడ్ దవాఖానాల ఏర్పాటులో అమెరికన్ తెలంగాణ సొసైటీ (ఎటిఎస్)

కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎదురవుతున్న చికిత్స సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ఇన్‍ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా)తో కలిసి అమెరికన్ తెలంగాణ సొసైటీ (ఏటీఎస్) సంయుక్తంగా కీలక కార్యాచరణను ప్రకటించింది. ఏటీఎస్ సహకారంతో క్షేత్రస్థాయిలోనే కోవిడ్ దవాఖానలు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా నారాయణపేట జిల్లా మాగనూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను ప్రత్యేక చికిత్స కేంద్రంగా మార్పు చేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆన్‍లైన్ ద్వారా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల చొరవతో ప్రారంభమైన ఈ కోవిడ్ దవాఖానను జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ప్రశంసించారు. ప్రారంభోత్సవంలో భాగంగా 9 సబ్ సెంటర్లలో స్థానికులు పాల్గొని ఆన్‍లైన్ విధానంలో వైద్యులచే కొవిడ్ సంబంధమైన సలహాలు పొందారు.
కొవిడ్ దవాఖాన పనితీరు ఇలా..
సంప్రదాయ వైద్య సహాయం రూపంలోనే ఆన్‍లైన్‍లో కొవిడ్ కన్సల్టేషన్ జరుగుతుంది. పీహెచ్‍సీలో కొవిడ్ నిర్దారణ అయిన వారికి ఇక్కడ వైద్య సహాయం వీడియో కన్సల్టింగ్ రూపంలో సాగుతుంది. ఇందుకోసం టి.కన్సల్ట్ టెక్నాలజీ సహాయం వినియోగించుకోనున్నారు. ఆన్‍లైన్ కొవిడ్ కన్సల్టేషన్‍కు సంబంధించిన ఆర్థిక, వైద్య సంబంధమైన సహాయం అమెరికన్ తెలంగాణ సొసైటీ అందిస్తోంది. ఇద్దరు వైద్యులు ఈ సెంటర్‍కు వచ్చే రోగులకు సహాయంగా ఆన్‍లైన్‍లో అందుబాటులో ఉండనున్నారు. మరో ఇద్దరు హెల్త్ వాలంటీర్లు ఈ కేంద్రంలో ఉండి సేవలు అందించనున్నారు. టీటా తన టి.కన్సల్ట్ టెక్నాలజీని క్షేత్రస్థాయిలో నిర్వహణ సహా ఇతర సహాయ సంబంధమైన అంశాల బాధ్యత తీసుకుంది. మాగనూరులో ఈ మోడల్ విజయవంతం అయిన తదుపరి తెలంగాణ రాష్ట్రమంతటా సేవలు అందించనుంది.
అమెరికన్ తెలంగాణ సొసైటీ తరఫున చైర్మన్ కరుణాకర్ మాధవరం, ప్రెసిడెంట్ నరేందర్ చీమెర్ల, కొవిడ్ దవాఖాన పోగ్రాం అడ్వైజర్ డాక్టర్ దిలీప్ బీరెల్లి, తాజా మాజీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి కందిమల్ల జనరల్ సెక్రటరీ వెంకట్ మంతెన, ఇతర కార్యవర్గ సభ్యులు బాధ్యతలు ముందుండి నిర్వహిస్తున్నారు.