అమరావతి రైతుల పోరుకు అమెరికా ఎన్నారైల మద్దతు
సంఘీభావంగా నగరాల్లో జూలై 4న కొవ్వొత్తుల ప్రదర్శనలు
వన్ స్టేట్…వన్ క్యాపిటల్ పేరుతో ఆంధప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా అమెరికాలో ఉంటున్న విదేశాంధ్రులు వారికి మద్దతుగా జూలై 4వ తేదీన వెలుగుపూల సంఘీభావం ప్రదర్శించనున్నారు. అమెరికాలోని వివిధ నగరాల్లో ఉంటున్న తెలుగువారు, పార్టీలకు, సంఘాలకు అతీతంగా రైతులకు మద్దతుగా పోరాట సంఘీభావాన్ని ప్రదర్శించనున్నారని అమెరికాలోని తెలుగు ప్రముఖులు జయరామ్ కోమటి తెలిపారు. దాదాపు 200కుపైగా నగరాల్లో జూలై 3వ తేదీ రాత్రి 9 గంటలకు అంటే భారత కాలమానం ప్రకారం జూలై 4వ తేదీ ఉదయం కొవ్వొత్తుల ప్రదర్శన చేయనున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అమెరికాలోని విదేశాంధ్రులే కాకుండా, వివిధ దేశాల్లో ఉన్న తెలుగువాళ్ళు కూడా ఈ సంఘీభావ ప్రదర్శనల్లో పాలుపంచుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో విదేశాంధ్రులు ప్రచారాన్ని చేపట్టారు.
రైతులే దేశానికి వెన్నెముక అని అంటూ, అదే రైతు తమ ప్రాణంతో సమానమైన భూములను 6కోట్లకుపైగా ఉన్న ఆంధ్రుల భవిష్యత్తుకోసం అమరావతి రాజధాని నిర్మాణానికి ఇచ్చి రోడ్డున పడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం అమరావతి రాజధాని కొనసాగింపుపై క్లారిటీని ఇవ్వకపోవడంతో రాజధాని రైతులు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధానికోసం తమ భూములను ఇచ్చిన రైతుల త్యాగం వృధాపోరాదానే ఉద్దేశ్యంతో వారికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని ఎన్నారైలు ఎన్నారైస్ ఫర్ అమరావతి…వన్ స్టేట్ వన్ క్యాపిటల్ పేరుతో చేస్తున్నారు.













