అంతర్జాతీయ కోర్టులో అమరావతి
రాజధాని అమరావతి వివాదం అంతర్జాతీయ నేర న్యాయస్థానాన్ని (ఐసీసీ) చేరింది. రాజధానిని తరలిస్తూ రైతులకు చేస్తున్న అన్యాయం, నిర్బంధం, ఆంక్షలపై నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న ఐసీసీలో ప్రవాసాంధ్రులు పిటిషన్ దాఖలు చేశారు. రైతులు, మహిళలపై దమనకాండ జరుగుతోందని తెలిపారు. అమెరికాకు చెందిన శ్రీనివాస్ కావేటి అనే ప్రవాసాంధ్రుడు ఈ ఫిర్యాదు చేశారు. హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ వీడియో ఆధారాలు కూడా సమర్పించారు. ఈ ఫిర్యాదును అంతర్జాతీయ న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. అయితే ఫిర్యాదును స్వీకరించినంత మాత్రాన విచారణ ప్రారంభించినట్లు కాదని, దానిపై అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ అంశం ఐసీసీ పరిధిలోకి రాదని కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే, ఏపీకి సంబంధించిన వివాదం మరోసారి అంతర్జాతీయ వేదికను చేరడం చర్చనీయాంశమైంది.













