TANA: తానా మహాసభలకు అంతా సిద్ధం
అమెరికాలో అతి పెద్ద తెలుగుపండుగకు అంతా సిద్ధం అయింది. డిట్రాయిట్ (Detroit) లోని సబర్బన్ కలెక్షన్ షో ప్లేస్‌లో జూలై 3,4,5 తేదీల్లో జరిగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మహాపండుగకు అంతా సిద్ధం అయింది. ప్రతి రెండేళ్ళకోమారు తానా మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ఈసారి కూడా తానా 24వ ద్వైవార్షిక మహాసభలను కూడా మరింత వైభవంగా నిర్వహించేందుకు కాన్ఫరెన్స్ నాయకులు సిద్ధమయ్యారు. ఈ మహాసభలకు కో ఆర్డినేటర్‌గా ఉదయ్‌కుమార్ చాపలమడుగు వ్యవహరిస్తున్నారు. కాన్ఫరెన్స్ చైర్మన్‌గా గంగాధర్ నాదెళ్ల ఉన్నారు. శ్రీనివాస్ కోనేరు (కో కోఆర్డినేటర్), సునీల్ పంట్ర (డైరెక్టర్), కిరణ్ దుగ్గిరాల (సెక్రటరీ), జోగేశ్వరరావు పెద్దిబోయిన (ట్రెజరర్), నీలిమ మన్నె(తానా నార్త్ రీజినల్ రిప్రజెంటేటివ్) కాన్ఫరెన్స్ టీమ్‌లో ఉన్నారు. వీరంతా కలిసి ఈ మహాసభల విజయవంతానికి ముమ్మరంగా కృషి చేస్తున్నారు.
మహాసభల నిర్వహణకోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. దాదాపు 54 కమిటీలను ఏర్పాటు చేశాము. ఈ కమిటీల్లో దాదాపు 300 మంది అహోరాత్రులు కాన్ఫరెన్స్ విజయంకోసం పనిచేస్తున్నారు. కాన్ఫరెన్స్ లీడర్ షిప్ వాళ్ళు ఈ కమిటీలతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ అవసరమైన సూచనలను సలహాలను అందిస్తూ, అవసరమైన మార్పులు చేర్పులు చేయిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలకు తుదిరూపు ఇచ్చారు.
ఈ మహాసభలకు రావాల్సిందిగా రాజకీయ నాయకులను, సినిమా కళాకారులను, బిజినెస్ ప్రముఖులను, సాహితీవేత్తలను, ఇతర కళాకారులను తానా నాయకులు ఆహ్వానించారు. కాన్ఫరెన్స్ నాయకులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయడు, రేవంత్ రెడ్డిలతోపాటు ఇతర కేంద్రమంత్రులను, రాష్ట్ర మంత్రులను స్వయంగా కలుసుకుని మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే ఎంపిలు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ మహాసభలకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. వారిలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, తుమ్మలనాగేశ్వరరావు, నాదెండ్ల మనోహర్, దామోదర్ రాజనర్సింహ, కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్‌తోపాటు ఎంపి భరత్, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, అరిమిల్లి రాధాకృష్ణ, తంగిరాల సౌమ్య, రాము వెనిగండ్ల, సురేష్ కాకర్ల, బూర్ల రామాంజనేయులు, టిడిపి నాయకులు టిడి జనార్ధన్, బిజెపి నాయకులు పాతూరి నాగభూషణం, కెడిసిసి చైర్మన్ నెట్టెం రఘురామ్, మాజీ డిజిపి ఎబి వెంకటేశ్వరరావు, అమరావతి బహుజన్ జెఎసి పోతుల బాలకోటయ్య, రాజకీయ విశ్లేషకులు ముప్పా అంకమ్మ చౌదరి, రాజేశ్ అప్పసాని తదితరులు వస్తున్నారు.
ఈ మహాసభలకు టాలీవుడ్ నుంచి పలువురు వస్తున్నారు. హీరోలు, హీరోయిన్‌లు, సంగీత దర్శకులు, నిర్మాతలు, దర్శకులు, ఇతర కళాకారులు ఈ మహాసభల్లో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. ఈ మహాసభల్లో సినిమా కళాకారులతో పలు కార్యక్రమాలను నిర్వాహకులు రూపొందించారు.
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్, ప్రముఖ గాయని చిత్ర ఈ మహాసభల్లో సంగీత విభావరి ద్వారా అందరినీ ఆకట్టుకోనున్నారు. సూపర్ హిట్ పాటలతో ఈ కార్యక్రమాలు వచ్చినవారిని రంజింపజేసేలా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే సినీ నేపథ్య గాయకురాలు సునీత, గాయకుడు ఎస్.పిబి. చరణ్‌తో కూడా లైవ్ మ్యూజిక్ కార్యక్రమం మరో ఆకర్షణగా ఉంటుంది. వీరితోపాటు నేపథ్య గాయనీగాయకులు కూడా ఈ మహాసభల్లో తమ పాటలతో ఆనందపరచనున్నారు. ప్రముఖ హీరోయిన్ సమంత ఈ మహాసభలకు వస్తున్నారు. తెలుగు కమ్యూనిటీ మహాసభలకు ఆమె రావడం ఇదే మొదటిసారి. అలాగే మరో హీరోయిన్ ఐశ్వర్యరాజేష్ కూడా హాజరవుతున్నారు. టాలీవుడ్‌లో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్‌తో పాటు హీరో నిఖిల్, యాంకర్ సుమ, దర్శకులు కె. రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, జబర్దస్త్ హీరోయిన్ సత్యశ్రీ తదితరులు ఈ వేడుకలకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాత హరనాథ్ పులిచెర్ల, మైత్రీ ప్రొడక్షన్స్‌కు చెందిన నవీన్ ఎర్నేని, మరో నిర్మాత సాహుగారపాటి తదితరులు కూడా మహాసభలకు హాజరుకానున్నారు. సెలబ్రిటీలతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అన్నమాచార్య స్వరార్చన పేరుతో శ్రీమతి శోభారాజు కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు.
ప్రముఖ నాట్యకళాకారులు శ్రీ కే.వి. సత్యనారాయణ ఈ మహాసభలకోసం అమెరికాకు వచ్చి ప్రదర్శన ఇవ్వనున్నారు. అమెరికాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన 70 మంది కళాకారులతో , క్లాసికల్, ఫోక్, టాలీవుడ్ నృత్య శైలులు కలగలిసిన ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని ఆయన నేతృత్వంలో ప్రదర్శించనున్నారు.
ఈ మహాసభలకు పలువురు సాహితీవేత్తలు కూడా హాజరవుతున్నారు. వాసిరెడ్డి నవీన్, రెంటాల జయదేవ, అన్వర్, గారపాటి ఉమామహేశ్వరరావు, ఈమని శివనాగిరెడ్డి, కందిమళ్ళ సాంబశివరావు, ఇంద్రగంటి మోహనకృష్ణ, సుమన పల్లె, కిరణ్ ప్రభ, రామారావు కన్నెగంటి, అట్లూరి అనిల్, మద్దుకూరి విజయ్ చంద్రహాస్, కె. గీతామాధవి తదితరులు హాజరవుతున్నారు. లిటరరీ యూత్ యాంకర్లుగా బెజవాడ విశాల్, నిమ్మగడ్డ శివాని వ్యవహరిస్తున్నారు.
ఈ మహాసభలకు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చేందుకు, సంకీర్తనాగానం చేసేందుకు పలువురు వస్తున్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, గాయకుడు, ప్రవచనకారులు, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ బ్రహ్మశ్రీ డా. ఎల్.వి. గంగాధర శాస్త్రి భగవద్గీతపై ఉపన్యసించనున్నారు. జూలై 5వ తేదీ ఉదయం 10 గంటలకు నిత్య జీవితానికి గీత, ఘంటసాల పాటలు, అన్నమాచార్య కీర్తనలు, విశ్వరూప సందర్శనయోగ వంటి అంశాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మహాసభలకు వచ్చే అతిధులకోసం ప్రారంభించిన రిజిస్రేషన్ కార్యక్రమాలకు మంచి స్పందనే వచ్చింది. సాధారణ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు జూలై 4, 5వ తేదీ వరకు జరుగుతుంటాయని నిర్వాహకులు చెప్పారు. వచ్చిన అతిధులకోసం అక్కడికి సమీపంలో ఉన్న హోటళ్ళలో రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించారు. కాన్ఫరెన్స్‌కు వచ్చే అతిధులు, ఇతరులకోసం ఆతిధ్య ఏర్పాట్లను అందరికీ సరిపోయే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ విషయంలో ఆయా కమిటీలు ఏర్పాట్లను చేస్తున్నాయి.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ ద్వై వార్షిక మహాసభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో జరగనున్నది. ఈ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవంను వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే శతమానం భవతి పేరుతో తల్లితండ్రుల షష్ట్యబ్దపూర్తి వేడుకలను నిర్వహించే అవకాశాన్ని కలిగించారు. ఈ సందర్భంగా వివిధ హోమాలను నిర్వహిస్తున్నారు. ఉగ్రరథశాంతి సంకల్పం, మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం (ఏకాంతం), ఉగ్రరథమంటపారాధన ఆయుష్యహోమం (ఏకాంతం), మాలికొద్వర్తనం, మహదాశీర్వచనం, లక్ష్మీనారాయణ స్వరూప దంపతీపూజ వంటివి ఈ శతమానంభవతి కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.







