TANA: ఐశ్వర్య రాజేష్, నిఖిల్, నోరి దత్తాత్రేయకు తానా సన్మానం
డెట్రాయిట్ వేదికగా జరుగుతున్న తానా 24వ కాన్ఫరెన్స్ (TANA 24th Conference) రెండో రోజు కూడా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యా రాజేష్‌ను కూడా తానా సత్కరించింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన ఆమె.. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన తానాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో సినిమాలోని ‘రాజు, మీన, భాగ్యం’ పేర్లతో ఉన్న ప్రేక్షకులను వేదిక మీదకు ఆహ్వానించి అందరితో కాసేపు సరదాగా సినిమా డైలాగులు చెప్పించారు. చివరగా అందరితో కలిసి సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేశారు. అనంతరం తానా కోర్ కమిటీ టీం ఆమెకు ఫ్లవర్ బొకేలు అందించి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ను కూడా తానా సత్కరించింది. హ్యాపీడేస్ చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన నిఖిల్.. సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడకు పోతావు చిన్నవాడా, కార్తికేయ, స్వామి రారా, కార్తికేయ వంటి చిత్రాలతో అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తనను ఇలా తానా 24వ కాన్ఫరెన్స్‌కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. యూత్ కాన్ఫరెన్స్ అద్భుతంగా జరిగిందని చెప్పారు. నిఖిల్ కూడా కొందరు ప్రేక్షకులను వేదికపైకి పిలిచి, ‘హ్యాపీడేస్’లోని ‘ఓ మై ఫ్రెండ్..’ పాట పాడించి అందర్నీ అలరించారు. అనంతరం తానా ఈసీ కమిటీ, కాన్ఫరెన్స్ కమిటీ సభ్యుల కుటుంబాలు నిఖిల్‌ను సత్కరించారు.
అనంతరం ప్రముఖ వైద్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత నోరి దత్తాత్రేయను కూడా తానా సభ్యులు సత్కరించారు. కేన్సర్ చికిత్సలో ప్రఖ్యాతిగాంచిన నిపుణులు దత్తాత్రేయ గారు. అమెరికాలో పలు వైద్యసంస్థల్లో కీలక పదవుల్లో సేవలందించారు. వైద్యరంగంలో ఆయన చేసిన సేవలకుగానూ యూఎస్ఏలో ఎన్నో అరుదైన అవార్డులు అందుకున్నారు. ప్రజలకు అందుబాటులో కేన్సర్ వైద్యం ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నోరి దత్తాత్రేయ కృషిచేస్తున్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ దంపతులను తానా 24వ కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఉదయకుమార్, చైర్మన్ గంగాధర్ నాదెండ్ల సత్కరించారు. కాన్ఫరెన్స్‌కు విచ్చేసిన వారంతా నిలబడి ఆయనకు కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేశారు.







