మేయో క్లినిక్‌తో ఏఐజీ ఒప్పందం
అంతర్జాతీయ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ధరలో భారతీయులకు అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికాలోని మేయో క్లినిక్‌తో ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ(ఏఐజీ) ఒప్పందం కుదుర్చుకుంది. మేయో క్లినిక్ కేర్ నెట్‌వర్క్‌లో భాగమైన తొలి భారతీయ ఆస్పత్రి ఏఐజీనే అని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజా ఒప్పందంతో సంక్లిష్టమైన కేసులకు సంబంధించి రెండో అభిప్రాయం తీసుకోవడం మొదలుకుని.. పలు అంశాల్లో మేయో క్లినిక్ పరిశోధనల వివరాలు ఏఐజీకి అందుబాటులోకి వస్తాయని అన్నారు. సుమారు 155 ఏళ్లుగా వైద్య రంగంలో లాభాపేక్ష లేకుండా సేవలందిస్తున్న మేయో క్లినిక్‌లో 5 వేల మంది నిపుణులైన వైద్యులు ఉన్నారని చెప్పారు. వైద్యంతోపాటు పరిశోధన రంగంలోనూ ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయని తెలిపారు.
కాలేయ మూలకణ పరిశోధనల్లో ఏఐజీకి ఎంతో ప్రావీణ్యముంటే.. గుండె మూలకణాలపై మేయో క్లినిక్ ఎన్నో పరిశోధనలు చేపట్టిందని వివరించారు. మేయో క్లినిక్ నెట్వర్క్ డైరెక్టర్, ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ హేస్ మాట్లాడుతూ అందరికీ మెరుగైన వైద్యం అందించే ఏకైక లక్ష్యంతో ఈ నెట్వర్క్ పనిచేస్తుందని సృష్టం చేశారు.













