AIA: వైభవంగా జరిగిన ఎఐఎ స్వదేశ్ వేడుకలు

అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA), బాలీ 92.3 ఆధ్వర్యంలో ‘‘స్వదేశ్’’ (Swades) పేరుతో భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కాలిఫోర్నియాలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డౌన్‌టౌన్ శాన్ జోస్ వీధుల్లో 75కి పైగా శకటాలతో చారిత్రక భారతదేశ పరేడ్ జరిగింది. బే ఏరియాలోని 50కి పైగా భారతీయ సంఘాలు, సంస్థలు ఈ వేడుకలకు మద్దతుగా పరేడ్ లో పాల్గొన్నాయి. ఈ పరేడ్ 25,000 మందికి పైగా హాజరయ్యారు. ఉత్సాహంగా, ఆకర్షణీయమైన కార్యక్రమాలతో వచ్చినవారంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు. రంగులమయమైన శాన్ జోస్ డౌన్‌టౌన్‌ని చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు.
భారతీయ సంస్కృతి, కళారూపాలను ప్రదర్శించడం, వాటిని ప్రోత్సహించడమే స్వదేశ్ ముఖ్య ఉద్దేశ్యాల్లో ఒకటి. ఈ వేడుకల్లో భాగంగా వంద మందికి పైగా పిల్లలు శాస్త్రీయ, సినిమా నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. అలాగే క్యారమ్స్, చెస్, ఇతర క్రీడలను కూడా నిర్వహించారు.
ప్రముఖుల సమక్షంలో పతాకావిష్కరణ
ఈ కార్యక్రమానికి ప్రముఖ భారతీయ నటి అమీషా పటేల్ గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించారు. శ్రీకాంత్ బోల్లా (ఎర్త్ క్లెన్స్ వ్యవస్థాపకుడు) గౌరవ అతిథిగా వచ్చారు. భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్ (శాన్ ఫ్రాన్సిస్కో) రాకేష్ అద్లఖా వంటి ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వీరంతా కలిసి గ్రాండ్ పరేడ్‌ను ప్రారంభించి, భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం చూసి తాము చాలా సంతోషిస్తున్నామని, మన వారసత్వం, సంస్కృతిని కాపాడుతున్న ఎఐఎ కు అభినందనలు తెలిపారు.
శాన్ జోస్ మేయర్ మాట్ మహన్ ఈ సందర్భంగా అమెరికా జెండాను ఆవిష్కరించారు. ఈ పరేడ్ రాబోయే సంవత్సరాల్లో మరింత పెద్దదవుతుందని, ఎఐఎ యొక్క స్వదేశ్ వేడుకలు శాన్ జోస్‌లో ఒక పెద్ద ఆకర్షణగా మారుతాయన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సిలికాన్ వ్యాలీలోని 50 మందికి పైగా ఎన్నికైన అధికారులు (మేయర్లు, సిటీ కౌన్సిల్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు, ఇతర ప్రముఖులు) హాజరయ్యారు. అష్ కల్రా (అసెంబ్లీ సభ్యుడు, 25వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్), రాజ్ సల్వాన్ (ఫ్రీమాంట్ మేయర్), కార్మెన్ మోంటానో (మిల్పిటాస్ మేయర్), లియాంగ్ చావో (కుపర్టినో మేయర్), లారీ క్లీన్ (సన్నీవేల్ మేయర్), లిల్లీ మే (ఫ్రీమాంట్ మేయర్ ఎమెరిటస్), బీన్ డోన్ (శాన్ జోస్ సిటీ, జిల్లా 7 కౌన్సిల్ సభ్యుడు), పాల్ జోసెఫ్ (శాన్ జోస్ చీఫ్), రాజ్ చాహల్ (శాంతా క్లారా కౌన్సిల్ సభ్యుడు), నైసా ఫ్లిగర్ (లాస్ ఆల్టోస్ వైస్ మేయర్), టామ్ పైక్ (కాంగ్రెస్‌మెన్ రో ఖన్నా ఆఫీస్), అజయ్ భూటోరియా (బే ఏరియాలోని భారతీయ సమాజం), టీనా వాలియా (సారటోగా కౌన్సిల్ సభ్యుడు), రూబెన్ అబ్రికా (ఈస్ట్ పాలో ఆల్టో కౌన్సిల్ సభ్యుడు), జార్జ్ కేసీ (శాన్ జోస్ సిటీ, జిల్లా 10 కౌన్సిల్ సభ్యుడు), హరీష్ ఖర్బందా (భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం), సుధాంశు ‘‘సుడ్స్’’ జైన్ (శాంతా క్లారా కౌన్సిల్ సభ్యుడు), కెవిన్ పార్క్ (శాంతా క్లారా సిటీ, జిల్లా 4 కౌన్సిల్ సభ్యుడు), వివేక్ ప్రసాద్ (ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్), అనూ నక్కా (మిల్పిటాస్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్), ఆష్లే డార్గెర్ట్ (సూపర్‌వైజర్ ఒట్టో లీ ఆఫీస్), అనురాగ్ పాల్ (అసెంబ్లీ సభ్యుడు అలెక్స్ లీ ఆఫీస్), జస్టిన్ జియోంగ్ (కాంగ్రెస్‌మెన్ సామ్ లికార్డో ఆఫీస్), యాన్ ఝావో (సారటోగా కౌన్సిల్ సభ్యుడు), డేవిడ్ కోహెన్ (శాన్ జోస్ కౌన్సిల్ సభ్యుడు) తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి
ఈ వేడుకలకు పురస్కరించుకుని నిర్వహించిన పరేడ్ లోభారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, వారసత్వానికి సంబంధించిన అనేక శకటాలు పాల్గొన్నాయి. పరేడ్‌లో పాల్గొన్నవారు సంగీతం, నృత్యాలతో ఉత్సాహంగా సాగిపోయారు. డౌన్‌టౌన్ మొత్తం దేశభక్తి గీతాలతో మారుమోగింది. ఈ వేడుకలు రాత్రి 10:30 వరకు కొనసాగాయి.
రాష్ట్ర నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, బాణసంచా, ఝామ్ ప్రొడక్షన్స్ లైవ్ సింగింగ్ కచేరీ,బాటా, ఎఐఐకు చెందిన గాయనీ గాయకులు, డిజె సంగీతంతో విజయ్ భారత్ కార్యక్రమం అద్భుతంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎఐఎ బృందం స్పాన్సర్లు, వాలంటీర్లందరికీ ధన్యవాదాలు తెలిపింది. సంజీవ్ గుప్తా సిపిఎ గ్రాండ్ స్పాన్సర్‌గా, లావణ్య దువ్వీ (రియల్టర్) ప్లాటినం స్పాన్సర్‌గా, ట్రావెలోపాడ్ (ట్రావెల్ పార్టనర్), రియల్టర్ నాగరాజ్ అన్నయ్య ఆధ్వర్యంలో, జడ్5 (స్ట్రీమింగ్ పార్టనర్), ఎర్త్ క్లెన్స్ (ఎకో ఫ్రెండ్లీ పార్టనర్), వీ ఇండియన్!, ఇన్‌స్టా సర్వీస్, ఆజాద్ ఫైనాన్షియల్స్, వాచీ సిల్క్స్, మైపర్సు, ఐసిఐసిఐ బ్యాంక్ సిల్వర్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. మీడియా పార్టనర్‌లకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఎఐఎ తదుపరి కార్యక్రమమైన దసరా దీపావళి ధమాకాలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
‘స్వదేశ్’ విజయాన్ని జరుపుకుంటున్న ఎఐఎ బృందం ఇప్పటికే రాబోయే ‘‘దసరా దీపావళి ధమాకా’’ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఈ వార్షిక ప్రధాన కార్యక్రమంలో మహామంగళ హారతి, రథయాత్ర, బాణసంచా, 35 అడుగుల రావణ దహనం వంటి ప్రత్యేక ఉత్సవాలు ఉంటాయి. ఈ కార్యక్రమం ఏటా పెరుగుతూ వస్తోంది, గత సంవత్సరం 50,000 మందికి పైగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ అక్టోబర్ 11వ తేదీ (శనివారం) ప్లెసంటన్ లోని అల్మెడా కౌంటీ ఫెయిర్‌గ్రౌండ్స్‌లో జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం aiaevents.org ను సందర్శించండి.