అమెరికాలో మరో 5 వర్సిటీల మూసివేత?
అమెరికాలో మరో ఐదు నకిలీ విశ్వవిద్యాలయాల మూసివేతకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా చోటు చేసుకున్న ఫర్మింగ్టన్ విశ్వవిద్యాలయం తరహాలోనే వివిధ రాష్ట్రాల్లో ఉన్న మరో ఐదు ప్రైవేటు వర్సిటీలలో చోటు చేసుకున్న కార్యకలాపాల నేపథ్యంలో వాటిని మూసివేయించాలన్న నిర్ణయానికి అమెరికా ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఐదు వర్సిటీలలో వివిధ కోర్సులనభ్యసిస్తున్న 80 వేల మంది విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారనుంది. ఇందులో 50వేల మంది భారత విద్యార్థులుండటం గమనార్హం.
ఇప్పటికే నకిలీ వర్సిటీ ఫర్మింగ్టన్లో ప్రవేశం పొందిన 130 మంది తెలుగు విద్యార్థులపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేసి జైళ్ళో పెట్టిన సంగతి విదితమే. ఈ ఐదు విశ్వవిద్యాలయాలు మూతబడితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు, ప్రవాసలు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో ఉంటున్న వలసదారులు ఈ నెల 5వ తేదీలోపు దేశం విడిచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం హుకం జారీ చేయడంతో అక్కడ ఆక్రమంగా ఉంటున్న విద్యార్థులు, నిరుద్యోగులలో ఆందోళన మొదలైంది.













