TANA: తానా మహాసభల వేదికపై అద్వైత్ బొందుగుల విజయవిహారం….
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో మిషిగన్ రాష్ట్రం డెట్రాయిట్/నోవీలో జూలై 3 నుండి 5 వరకు జరిగిన 24వ ద్వైవార్షిక తానా మహాసభల్లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘ధీమ్ తానా’ (DhimTana) జాతీయ పోటీల్లో సీనియర్స్ విభాగంలో ఫిలడెల్ఫియాకు చెందిన 15 ఏళ్ల బహుముఖ ప్రతిభాశాలి అద్వైత్ బొందుగుల (Advait Bandugula) ప్రథమ బహుమతి సాధించి తన ప్రతిభను మరోమారు చాటారు. భారతీయ శాస్త్రీయ (కర్ణాటిక్) సంగీతం, ఫిల్మీ సింగింగ్ విభాగాల్లో అద్వైత్ బొందుగుల విజేతగా నిలవడం విశేషం. 2023 సంవత్సరంలో ఫిలడెల్ఫియాలో జరిగిన 23వ తానా సదస్సులో కూడా ఈ రెండు విభాగాల్లో జాతీయ స్థాయిలో విజేతగా నిలిచి అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఇప్పుడు కూడా తానా మహాసభల్లో విజయాన్ని సాధించిన అద్వైత్ ను పలువురు ప్రముఖులు అభినందించడం విశేషం.
గాయకుడిగానే కాక, అద్వైత్ బహుముఖ ప్రతిభ కలిగిన సంగీతకారుడు. శాస్త్రీయ సంగీత వాయిద్యాలైన వయోలిన్, శాక్సోఫోన్ వాయిద్యాల్లో మంచి ప్రావీణ్యం ఉన్న యువకుడు. దేశీయ, ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే అనేక సంగీత కార్యక్రమాల్లో పాల్గొని అనేక అవార్డులు గెలుచుకున్నారు. డెట్రాయిట్‌లో జరిగిన ఈ మహాసభలకు ఉత్తర అమెరికా నలుమూలల నుండి దాదాపు 10,000 మందికిపైగా హాజరయ్యారు. 2025 ధిమ్ తానా విజేతలకు ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకుడు శ్రీ ఆర్.పీ.పట్నాయక్ బహుమతులు ప్రదానం చేశారు. అద్వైత్ మరిన్ని విజయాలు సాధించాలని మరింత పేరు తెచ్చుకోవాలని పలువురు అభినందించి ఆశీస్సులు అందజేశారు.







