TANA: తానా 24వ మహాసభల్లో భావోద్వేగంతో ఏడ్చేసిన సమంత
తానా (TANA) 24వ మహాసభలు మూడో రోజు కూడా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కూడా హాజరవడం ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపింది. తనకు ఈ వేదికపై నిలబడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిన సమంత.. తను ప్రతి ఏటా తానా గురించి వింటూనే ఉన్నానన్నారు. ‘ఏ మాయ చేశావే’ చిత్రం నుంచే తమలో ఒకరిగా చూసిన తెలుగు వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తాను ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా తెలుగు వారు ఏమనుకుంటారు? అనే ఆలోచిస్తానని చెప్పారు. ‘నాకు ఒక ఐడెంటిటీ, ఒక ఇల్లు.. నేను ఇక్కడే ఉండాలనే ఫీలింగ్ అందించింది మీరే’ అని చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన ‘ఓ బేబీ’ చిత్రం అమెరికాలో మిలియన్ డాలర్లు కలెక్షన్ చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయానని, ఆ సమయంలో ఎంతో దూరంగా ఉన్నా అమెరికాలోని తెలుగు వారంతా తన మనసుకు మాత్రం చాలా దగ్గరగా ఉన్నారని చెప్పారు. అనంతరం తానా బోర్డ్ చైర్మన్ నాగేంద్ర కొడాలి, ఫౌండేషన్ చైర్ శశికాంత్ వల్లేపల్లి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నరేన్ కొడాలి, సెక్రటరీ రాజా కసుకుర్తి, ప్రసాద్ నల్లూరి, సునీల్ పాంత్ర, లోకేష్ కొణిదెల తదితరులు వేదికపైకి వచ్చి సమంతను కలిశారు.
అంతకుముందు ప్రేక్షకులతో యాంకర్ నిఖిల్ సరదాగా ముచ్చటించారు. సీటింగ్ ఏరియాకు వెళ్లి వారికి తానా కాన్ఫరెన్స్‌లో నచ్చిన అంశాలు ఏంటి? ఇంకా దేని కోసం ఎదురు చూస్తున్నారు? అని అడిగారు. ఈ కార్యక్రమంలో జరిగిన పలు డ్యాన్స్ డ్రామాలు (నృత్య రూపకాలు) అద్భుతంగా ఉన్నాయని, క్లాసికల్ డ్యాన్సర్లు అదరగొట్టారని ప్రేక్షకులు చెప్పారు. అదే సమయంలో తామంతా హీరోయిన్ సమంతాను చూసేందుకు, కలిసి ఫొటోలు దిగేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని వెల్లడించారు.







