NATS: నాట్స్ కాన్ఫరెన్స్‌లో ‘డైలాగ్ కింగ్’ సాయికుమార్‌కు ఘనసత్కారం
టంపా బే ఏరియాలో జరుగుతున్న నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాల్లో ప్రముఖ నటుడు సాయి కుమార్ (Sai Kumar) ను ఘనంగా సత్కరించారు. నటునిగా, వాయిస్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినిమాకు ఆయన ఎంతో సేవ చేశారు. డబ్బింగ్ కళకు స్టార్ తెచ్చిన ఆయన వెయ్యికిపైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ‘పోలీస్ స్టోరీ’ వంటి చిత్రాలతో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా మెప్పించిన ఆయన.. ‘అంతఃపురం’ వంటి చిత్రాలతో తనలోని రొమాన్స్ యాంగిల్‌ను కూడా చూపించారు. సినీ పరిశ్రమలో ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని నాట్స్ పేర్కొంది. ఈ సందర్భంగా నాట్స్ కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, మాజీ ప్రెసిడెంట్ మదన్ పామలపాటి, ప్రెసిడెంట్ శ్రీహర్ మందాటి, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి సాయి కుమార్‌ను నాట్స్ వేదికపై సత్కరించారు.
ప్రత్యేక అవార్డుతో ఆయన్ను గౌరవించారు. అనంతరం మాట్లాడిన సాయి కుమార్.. ‘జన్మభూమిని, కన్నతల్లిని మర్చిపోకుండా.. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు పట్టాభిషేకం చేస్తూ.. మానవసేవే మాధవసేవగా భావిస్తూ, ఉత్తమ విలువలు, ఉత్తమ అభిరుచులు, ఉత్తమ భావాలతో నాట్స్ 8వ తెలుగు సంబరాలు జరుపుకుంటోంది. 1975లో నా మొదటి చిత్రం రిలీజ్ అయింది. ఈ ఏడాది నేను నటించిన సంక్రాంతికి వస్తున్నాం కూడా వందరోజులు ఆడింది. నా కెరీర్లో 50వ సంవత్సరం ఇది. అలాంటి ముఖ్యమైన ఏడాదిలో నాకు ఈ గౌరవం దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు.







