TANA: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ను సత్కరించుకున్న తానా
డెట్రాయిట్ (Detroit) వేదికగా జరుగుతున్న తానా 24వ కాన్ఫరెన్స్ (TANA 24th Conference) రెండో రోజున ప్రముఖ నటుడు ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ గారిని తానా సత్కరించింది. అహనా పెళ్లంట, లేడీస్ టైలర్, మేడమ్, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, శ్రీమంతుడు, కల్కి వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన మార్కు నటనతో రాజేంద్ర ప్రసాద్ మెప్పించారు. ఆయన్ను సత్కరించుకునే అవకాశం తమకు దక్కినందుకు తానా సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తానా 24వ కాన్ఫరెన్స్ స్పాన్సర్ ఏరో విల్లాస్ సత్యమూర్తి, తెనాలి డబుల్ హార్స్ అధినేత శ్యామ్, తానా బోర్డ్ చైర్మన్ నాగేంద్ర కొడాలి, ఫౌండేషన్ చైర్ శశికాంత్ వల్లేపల్లి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నరేన్ కొడాలి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీనివాస్ లావు, సెక్రటరీ రాజా విస్కుర్తి, ట్రెజరర్ భరత్, తానా ఈసీ సభ్యులు, రవి పొట్లూరి, తానా మాజీ ప్రెసిడెంట్లు హనుమయ్య బండ్ల, తోటకూర ప్రసాద్, కోమటి జయరాం, అంజయ్యచౌదరి లావుతో పాటు కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఉదయకుమార్, చైర్మన్ గంగాధర్ నాదెండ్ల, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ నటులు మురళీ మోహన్, హీరో నిఖిల్, ఐశ్వర్యా రాజేష్ తదితరులంతా కలిసి వేదికపై రాజేంద్ర ప్రసాద్‌ను సన్మానించారు.
ఈ సందర్భంగా తన హాస్య చతురతను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను నవ్వించారు. తను ఎన్టీ రామారావు ఇంట్లోనే పుట్టానని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశీస్సులతోనే ఇంత ఎదిగానని చెప్పారు. తనకు గురువు, దైవం రెండూ ఆయనే అన్నారు. ఇంతమందిని నవ్వించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని, భగవంతుడు అవకాశం ఇచ్చినంత కాలం మంచి సినిమాల్లో నటిస్తూనే ఉంటానని చెప్పారు. తానా ఒక అద్భుతమైన సంస్థ అని, తను 1977లో తొలి సినిమా చేశానని, అదే సంవత్సరం తానా కూడా ఏర్పాటైందని వెల్లడించారు. తనను ఇలా సత్కరించిన తానాకు, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి నటుడితో ‘స్వయంభు’ చిత్రంలో కలిసి నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని హీరో నిఖిల్ పేర్కొన్నారు.







