అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడ గ్రామానికి చెందిన ఆచంట రేవంత్ (22) మృతి చెందారు. బోడవాడకు చెందిన ఆచంట రఘు, వరలక్ష్మిల కుమారుడు రేవంత్ చెన్నైలో బీటెక్ పూర్తి చేసుకొని గత సంవత్సరం డిసెంబర్లో ఎంఎస్ కోసం అమెరికా వెళ్లారు. వాషింగ్టన్ డకోట స్టేట్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారు వేకువజామున కారులో స్నేహితులతో వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. మైనస్ డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో రోడ్డుపై గడ్డకట్టిన మంచుకారణంగా కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రేవంత్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అయితే రేవంత్ మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. ఆయన మృతితో స్వగ్రామమైన బోడవాడ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కాగా, రేవంత్ తల్లి కొన్నేళ్ల క్రితం మరణించగా, తండ్రి రఘుబాబు ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన కుమారుడు ఇలా అర్థాంతరంగా మరణించడంతో తండ్రి గుండెలవిసెలా రోదిస్తున్నాడు.







