ఆపి కొత్త కార్యవర్గం ఇదే.. ప్రెసిడెంట్‌గా ఐదోసారి మహిళ
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఆపి) ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన కొత్త బృందానికి ఆపి ప్రస్తుత ప్రెసిడెంట్ రవి కొల్లి అభినందనలు తెలియజేశారు. ఆయన ఈ ఏడాది జులై వరకు ఆపి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అనంతరం ఈ బాధ్యతలను డాక్టర్ అంజన సమాదర్ తీసుకుంటారు. గతేడాది ఆమె ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా ఉన్న కారణంగా.. నిబంధనల ఈసారి ఆమె ఎన్నికల్లో పోటీ పడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా ఆపి అధ్యక్షురాలి బాధ్యతలు అందుకుంటారు. అలాగే 2023-24 ఏడాదిలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉండే డాక్టర్ సతీశ్ కత్తుల.. వచ్చే ఏడాది ఆపి ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.
ఈ నేపథ్యంలో కొత్త ఆపి టీంకు ప్రెసిడెంట్ రవి కొల్లి కంగ్రాట్స్ చెప్పారు. ఆయనతోపాటు ఆపి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మాజీ చైర్మన్, చీఫ్ ఎలెక్షన్ ఆఫీసర్ డాక్టర్ కుసుం పంజాబీ కూడా ఈ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎలక్షన్ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ అశోక్ జైన్, డాక్టర్ సునీత కనుమూరి, డాక్టర్ శరత్ లఖన్‌పాల్, డాక్టర్ శశి షాలకు ధన్యవాదాలు తెలియజేశారు. వచ్చే ఏడాది కాలానికి, అంటే 2023-24 సంవత్సరానికి ఈ ఎన్నికలు నిర్వహించారు.
ఈ ఎన్నికలు, లెక్కింపు ప్రక్రియను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ్ పంజాబీ దగ్గరుండి చూసుకున్నారు. అనంతరం ఈ ఫలితాలను ఆపి ప్రెసిడెంట్‌కు తెలియజేశారు. ఆయన వీటిని ఆపి సభ్యులందరి ముందు ప్రకటించారు. ఈ ఎలక్షన్లలో ఆపి వైస్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ అమిత్ చక్రవర్తి, సెక్రటరీగా డాక్టర్ సుముల్ రావల్, ట్రెజరర్‌గా డాక్టర్ శ్రీని గంగసాని ఎన్నికైనట్లు వెల్లడించారు. అలాగే డాక్టర్ శ్యామల ఎర్రమిల్లి, డాక్టర్ హెటల్ గోర్, డాక్టర్ మహేంద్ర మహేశ్వరి ముగ్గురూ కూడా ఆపి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌గా ఎన్నికయ్యారు. వీరి పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. అలాగే ఆపి సౌత్ వెస్ట్ సెంట్రల్ రీజనల్ డైరెక్టర్‌గా డాక్టర్ విజయ్ గునుగంటి, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రీజనల్ డైరెక్టర్‌గా డాక్టర్ అనురాధ మన్ ఎన్నికైనట్లు ప్రకటించారు.
నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆపి అధ్యక్షురాలిగా సేవ చేసే అదృష్టం తనకు దక్కినందుకు డాక్టర్ అంజన సమాదర్ చాలా సంతోషిస్తున్నట్లు చెప్పారు. తనతోపాటు బాధ్యతలు స్వీకరించే కొత్త టీం అందరికీ అభినందనలు తెలియజేశారు. ఫిలడెల్ఫియాలో ఈ ఏడాది జులైలో జరిగే 41వ ఆపి కన్వెన్షన్‌లో ఆమె ఈ సంస్థ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆపి 40 ఏళ్ల ప్రస్థానంలో ప్రెసిడెంట్ అయ్యే ఐదో మహిళగా డాక్టర్ అంజన రికార్డు సృష్టించనున్నారు. ఆపిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.













