ఏఏపీఐ ఆధ్వర్యంలో అగ్రరాజ్యంలో వైభవంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’
అగ్రరాజ్యం అమెరికాలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి కాపిటోల్ హిల్‌లో సెప్టెంబరు 21న ఏఏపీఐ (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) ఆధ్వర్యంలో 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు యూఎస్ సెనేటర్లు, కాంగ్రెస్‌మెన్లు హాజరయ్యారు. అమెరికాలో భారత సంతతి ఫిజీషియన్లు, ఇండో అమెరికన్ కమ్యూనిటీ సాధించిన విజయాలను కొనియాడారు. ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ సమయంలో భారత్, అమెరికా బంధం మరింత బలంగా తయారవ్వాలని ఈ నేతలు అభిప్రాయపడ్డారు. కాపిటోల్ హిల్‌లో ఇలా భారత స్వతంత్ర వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా అమెరికాలో భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధు మాట్లాడుతూ.. అమెరికాలో భారతీయ అమెరికన్ కమ్యూనిటీ చాలా బలంగా ఉందని, అందుకే రెండు దేశాల మధ్య బంధం కూడా బలంగా ఉందని కొనియాడారు. అమెరికా, భారత్ రెండు దేశాల్లో ప్రభావవంతమైన వైద్యసదుపాయాలు అందించేందుకు ఏఏపీఐ కృషి చేస్తోందని ఏఏపీఐ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ అంజనా సమాదర్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏఏపీఐ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సంపత్ శివంగి మాట్లాడుతూ.. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ప్రపంచం నలుమూలల్లో ఉంటూ భారతదేశం సాధించిన ప్రగతిని చూడగలగడం ఎంతో గర్వించదగ్గ క్షణాలని చెప్పారు. ఐకమత్యం, చరిత్రను కాపాడుకుంటూ ఇంత ప్రగతి సాధించి, 75 వసంతాల మైలురాయిని భారతదేశం చేరుకోవడం అందరూ గర్వపడే క్షణమని ఏఏఫీఐ ప్రెసిడెంట్ డాక్టర్ రవి కళ్ల అన్నారు. ఈ కార్యక్రమంలో సెనేటర్లు జో మంచిన్, సండీ హైడ్ స్మిత్, షెల్లీ కాపిటో, భారత సంతతి కాంగ్రెస్‌మ్యాన్ రో ఖన్నా, మరో కాంగ్రెస్ సభ్యుడు జో విల్సన్, యూఎస్ కాంగ్రెస్‌లోని తొలి భారతీయ అమెరికన్ మహిళ ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.













