Damu: వందే భారత్‌లో అద్భుత ప్రయాణం.. ఎన్ఆర్ఐ దాము గేదెలకు మరుపురాని అనుభవం
విశాఖపట్నం: అమెరికాలో ఉంటూ, దాదాపు 40 సంవత్సరాల తర్వాత స్వదేశానికి వచ్చిన ఒక ప్రవాస భారతీయుడికి (NRI) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణం మధురానుభూతిని మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్ నుండి సికింద్రాబాద్ వరకు చేసిన ఈ ప్రయాణంపై అమెరికాలోని తన స్నేహితులకు తప్పక చెబుతానని, భారతీయులు గర్వపడే రైలు అని దాము గేదెల (ఎడిసన్, న్యూజెర్సీ, యూఎస్) సంతోషం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టేషన్లో ఉదయం 5:45 గంటలకు ప్రారంభమైన ఈ ప్రయాణంలో, రైలు శుభ్రత, సిబ్బంది ఆదరణ, ఆహారం నాణ్యత ఆయన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఎయిర్ ఇండియా కంటే మెరుగైన సీట్లు!
మొదటిసారి వందే భారత్‌లో ప్రయాణించిన దాము తన అనుభవాన్ని వివరిస్తూ, “రైలు లోపలికి చూడగానే, ఎయిర్ ఇండియా విమానంలో కంటే కూడా సీట్లు చాలా బాగున్నాయి అనిపించింది. వెంటనే వందే భారత్ సిబ్బంది వచ్చి అందరికీ పెద్ద వాటర్ బాటిల్, గ్లాస్ ఇచ్చారు” అని తెలిపారు. ఉదయం అందించిన అల్పాహారం గురించి మాట్లాడుతూ, “ట్రేతో సహా మెక్విటైస్ డైజెస్టివ్ బిస్కెట్, గిర్నార్ కార్డమం టీ ప్యాకెట్ ఇచ్చారు. ఆ టీ తాగుతుంటే, ‘ఇంట్లో ఉన్న అనుభూతి’ కలిగింది” అని ఆయన తమ సంతోషాన్ని పంచుకున్నారు.
40 ఏళ్ల తర్వాత తెలుగు పేపర్!
దీని తర్వాత సిబ్బంది తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిని అందించగా, దాము గేదలకు మరింత ఆనందం కలిగింది. “దాదాపు 40 సంవత్సరాల తర్వాత, స్వదేశంలో, అదీ వందే భారత్‌లో ప్రయాణిస్తూ తెలుగు పేపర్ చదవడం ఒక అద్భుతమైన అనుభవం” అని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. మధ్యాహ్నం భోజనం సమయంలో, సిబ్బంది నవ్వుతూ లంచ్ బాక్స్‌ను అందించారు. వందే భారత్ రైలు ఎక్కడా ఆలస్యం లేకుండా సరిగ్గా సమయానికి సికింద్రాబాద్ చేరుకుంది. ప్రతి స్టేషన్ పేరును స్పష్టంగా అనౌన్స్ చేయడం ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడిందని ఆయన కొనియాడారు.
చివరగా…
“నేను అమెరికాలో ఉన్న నా స్నేహితులకు నా అనుభవాన్ని తప్పకుండా చెబుతాను. భారతదేశ రైల్వే రూపురేఖలు మారిపోయాయని, వందే భారత్‌లో ప్రయాణం చేయమని వారందరికీ సూచిస్తాను” అని దాము గేదెల తమ పర్యటనను ముగించారు.






