కరోనాపై పోరుకు 72 ట్రయల్స్ : ట్రంప్
కరోనా వైరస్‌పై యుద్ధానికి దేశంలో చురుకుగా 72 ట్రయల్స్ కొనసాగుతున్నాయని, మరో 211 రకాల చికిత్సలు ప్రతిపాదనల దశలో ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అలాగే ఇందుకోసం డజన్లకొద్దీ థెరపీలు, చికిత్సా విధానాలపై పరిశోధనలు జరుగుతున్నాయని, వ్యాక్సిన్ల విషయంలో గణనీయమైన అభివృద్ధి సాధించామని ఆయన తెలిపారు. వైరస్‌పై దాడికి, అలాగే కనిపించని వైరస్‌లపై పోరాటానికి, ఇన్ఫెక్షన్ రేట్‌ను తగ్గించేందుకు, కోలుకున్న రోగుల రక్తం నుంచి ప్రాణాధారమైన యాంటిబాడీల బదిలీకి థెరపీలను రూపొందిస్తున్నామని ట్రంప్ కరోనాపై రోజువారీ జరిగే మీడియా సమావేశంలో చెప్పారు. ఈ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచీ అమెరికా దీన్ని శాస్త్రీయంగా ఎదుర్కొనేందుకు భారీ స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. ఏదోకరోజు వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే ఇంతవరకూ ఎవరూ ఇలాంటిది చూడలేదు అన్నారు. మెయిన్ మీడియా కరోనా గురించి సరైన కవరేజ్ ఇవ్వడం లేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.













