అమెరికాలో అరుదైన ఘటన
ఆమె వయసు 50 ఏళ్లు. ఆమెకు నలుగురు పిల్లలు, ఇద్దరు మనవళ్లు ఉన్నారు. కానీ ఈ వయసులోనూ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఫ్లోరిడాలోని నాప్లెస్కు చెందిన మిషెల్ హాల్ ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా గతంలో ఇద్దరు డాక్టర్లు ఆమె మోనోపాజ్ దశలో ఉందని చెప్పిన తర్వాత ఆమె గర్భం దాల్చడం విశేషం. ఐదు నెలల క్రితం మిషెల్‌కు తరచూ కడుపు నొప్పి వస్తుండేది. అనుమానంతో గర్భనిర్ధారణ పరీక్ష చేయించుకోగా అప్పటికే ఆమె గర్భవతి అని తేలడంతో మిషెల్‌తోపాటు ఆమె భర్త జెర్రీ (47), కుటుంబ సభ్యులు షాకయ్యారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకున్న మిషెల్ ఇటీవలే సిజేరియన్ ద్వారా మగబిడ్డను ప్రసవించింది.













