యూఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు మంచి స్పందన
హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్, యూఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాజ్‌కృష్ణలో నిర్వహించిన యూఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు మంచి స్పందన వచ్చింది. అమెరికాలో ఉన్నతవిద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు అక్కడి వర్సిటీల సమాచారం తెలుసుకొనే అవకాశం లభించింది. ఇందులో అమెరికాకు చెందిన 48 వర్సిటీలు పాల్గొన్నాయి. అందిస్తున్న కోర్సులు, ప్రాధాన్యాలు, భవిష్యత్తు, ఫీజులు, పరీక్షల విధానం, వీసా వంటి సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి రెండువేలమందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మెన్ మాట్లాడుతూ భారతదేశానికి చెందిన రెండులక్షల మంది విద్యార్థులు అమెరికాలోని యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో ఉన్నత విద్య చదువుతున్నారని తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చి, అమెరికాలో చదువుకుంటున్నవారిలో భారత్ రెండోస్థానంలో ఉన్నదని చెప్పారు. అమెరికాలో 4,500 వర్సిటీలలో చదువుతున్న వారిలో 18 శాతం మంది భారతీయులని, వీరిలో ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు ఉన్నారని తెలిపారు.













