భారతీయులకు అమెరికా పౌరసత్వం
46,100 మంది భారతీయులకు అమెరికా శాశ్వత పౌరసత్వం లభించినట్లు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) వెల్లడించింది. దీనికి సంబంధించిన నివేదికను డీహెచ్ఎస్ విడుదల చేసింది. అక్టోబర్ 1, 2015 నుంచి సెప్టెంబర్ 30, 2016 వరకు అమెరికా ప్రభుత్వం మొత్తం 7.53 లక్షల మంది వ్యక్తులకు యూఎస్ పౌరసత్వాన్ని కల్పించింది. వారిలో ఆరు శాతం భారతీయులు ఉన్నారు. అత్యధిక సంఖ్యలో యూఎస్ పౌరసత్వాన్ని అందుకున్న వారిలో మెక్సికన్లు అగ్రస్థానంలో నిలిచారు. మెక్సికో నుంచి వచ్చిన వారికి పౌరసత్వం ఇచ్చే సంఖ్య ఏటా తగ్గుతోంది. 2015తో పోల్చుకుంటే గతేడాదిలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 24శాతం పెరిగినట్లు డీహెచ్ఎస్ వెల్లడించింది. 2015లో శాశ్వత పౌరసత్వం కోసం 7.83 లక్షల దరఖాస్తులు రాగా, 2016లో 9.72 లక్షల దరఖాస్తులు వచ్చాయి. సాధారణంగా గ్రీన్ కార్డు ఉన్న వారికి మాత్రమే యూఎస్ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. దీని కింద యూఎస్ లో సుదీర్ఘకాలం పాటు నివసించవచ్చు.













