మరో 42 మంది భారతీయులు నిర్బంధం
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారని అదుపులోకి తీసుకున్న వారిలో మరో 42 మంది భారతీయులు ఉన్నారు. రెండ్రోజుల క్రితం ఓరెగాన్‌లో 52 మంది భారతీయులను అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరికొంత మంది పోలీసులకు చిక్కారు. వీళ్లలో ఎక్కువ మంది సిక్కులు ఉన్నారు. తాజాగా అదుపులోకి తీసుకున్న 42 మంది భారతీయులు న్యూమెక్సికోలో పట్టుబడ్డారు. భారతీయులను అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న భారత అధికారులు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ)ను సంప్రదించారు. న్యూమెక్సికోలోని ఓటెరో కౌంటీ నిర్బంధ శిబిరంలో దాదాపు 42 మంది భారతీయులు ఉన్నట్లు ఐసీఈ అధికారులు ధ్రువీకరించారు. వీరు మెక్సికో నుంచి ఎల్ పాసో వద్ద సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు.
ఓరెగాన్, న్యూ మెక్సికో డిటెన్షన్ సెంటర్లలో సదుపాయాల గురించి ఆరా తీస్తున్నామని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని భారత రాయబార కార్యలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ అయితే వీరిని అధికారులు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారో తెలియలేదని, వారిని కలవడానికి కూడా అనుమతించట్లేదని, అయితే ఐసీఈ ఈ డిటెన్షన్ సెంటర్లలో ఉన్న భారతీయుల పేర్లు వెల్లడించిందని తెలిపారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఎక్కువ మంది ఒంటరి పురుషులు అని వెల్లడించారు.













