అమెరికాలో బీజేపీకి నిరసన సెగ
బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోనే కాకుండా అమెరికాలోని యూనివర్సిటీల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలైన హార్వర్డ్, యేల్, స్టాన్ ఫర్డ్, కొలంబియా వర్సిటీలతో సహా 19 యూనివర్సిటీల నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు. ఢిల్లీలోని జామియామిలియా ఇస్లామియా (జేఎంఐయూ), ఆలీఘడ్ యూనివర్సిటీ (ఏఏంయూ)ల్లోకి పోలీసులు చొరబడి విద్యార్థులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తూ..యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో భారీ ఎత్తున విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్దంగా ఉందని విమర్శించారు.
భారత్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదనీ, నిరసనకారులకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు ఈ మేరకు ఆన్లైన్లో బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనపై ప్రముఖ కెర్నెల్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ, బర్కిలీ యూనివర్సిటీ, ఇల్లినాయిస్ యూనివర్సిటీల విద్యార్థులు సంతకాలు చేశారు. యూనివర్సిటీల్లో మోహరించిన భద్రత బలగాలను ఉపసంహరించుకోవాలనీ, చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.













