అమెరికా అతలాకుతలం.. వేలాది విమానాలు రద్దు
అమెరికాను భీకర తుపాను అతలాకుతలం చేసేస్తోంది. భీకర గాలులు, ఉరుములతో కూడిన వర్షం, వడగళ్లతో అగ్రరాజ్యం వణికిపోతోంది. ఈ తుపాను ధాటికి ఉత్తర అమెరికా అతలాకుతలమైంది. ఈ తుపాను తీవ్రతతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. పలు రాష్ట్రాల్లో పవర్ కట్ అయింది. దీంతో లక్షల మంది ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. తుపాను కారణంగా వాషింగ్టన్ డీసీ లో అన్ని కార్యాలయాలను ముందుగానే మూసివేశారు. టేనస్సీ నుంచి న్యూయార్క్ వరకు 10 రాష్ట్రాలు సుడిగాలుల్లో చిక్కుకున్నాయి. సుమారు 29.5 మిలియన్లకు పైగా ప్రజలు ఈ తుపాను ప్రభావితులైనట్లు తెలిసింది.
మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వేలాది విమానాలు సర్వీసులు రద్దయ్యాయి. న్యూయార్క్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా, అట్లాంటా విమానాశ్రయాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీసెస్ ఫ్లైట్ అవేర్ ప్రకారం సోమవారం రాత్రి నాటికి 2,600 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి. అలాగే 7,900 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరోవైపు మేరీల్యాండ్, వర్జీనియా సహా దక్షిణ , మధ్య అట్లాంటిక్ రాష్ట్రాల్లో దాదాపు 11 లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు.













