26/11 పరిజ్ఞానమే వందల ప్రాణాలు కాపాడింది
2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన పరిజ్ఞానమే అమెరికాలోని లాస్వేగాస్లో గతవారం జరిగిన నరమేధంలో వందల మంది ప్రాణాలు కాపాడింది. ఈ విషయాన్ని అక్కడి పోలీస్ అధికారులే వెల్లడిస్తున్నారు. ఇటీవల స్టీఫెన్ పెడాక్ అనే 64 ఏండ్ల వ్యక్తి ఓ సంగీతకచేరిపై విచక్షణా రహితంగా కాల్పులు జరుపడంతో 58 మంది ప్రాణాలు కోల్పోగ, మరో 500 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే పక్కనే ఉన్న మ్యాండలే బే హోటల్లోకి దూసుకెళ్లిన స్వాట్ బృందం 31వ అంతస్తులో నిందితుడు ఉన్న గదిని చుట్టుముట్టారు. పోలీసు బృందాల రాక విషయం తెలుసుకున్న స్టీఫెన్ పెడాక్ తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సకాలంలో పోలీసులు అక్కడికి చేరడం వల్లే నిందితడు కాల్పులు నిలిపివేశాడని లాస్‌వేగాస్ పోలీసు అధికారి జోసెఫ్ లాంబర్డో చెబుతున్నారు.
2008 నవంబర్ 26న ముంబైలో తాజ్హోటల్పై జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి వెళ్లిన పోలీసు అధికారుల్లో లొంబార్డో కూడా ఉన్నారు. ముంబైలో ఉగ్రవాదుల దాడి తీరును పరిశీలించిన పరిజ్ఞానం వల్లే తనతోపాటు మరికొందరు అధికారులు ఘటన జరుగగానే తాము హోటళ్ల నుంచే దాడి జరిగినట్లు అనుమానించామని, దానివల్లే వీలైనంత వేగంగా హంతకుడు ఉన్నచోటుకు చేరుకోవడం సాధ్యమైందని లాంబార్డో తెలిపారు.













