టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయండి.. ట్రంప్ కు అభ్యర్థన
భారత్ తరహాలోనే టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని అమెరికా చట్టసభలకు చెందిన 25 మంది ప్రతినిధులు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభ్యర్థించారు. భద్రతా కారణాల దృష్ట్యా.. భారత ప్రభుత్వం 59 చైనా యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే రీతిలో చైనా సోషల్ మీడియా వెబ్సైట్లు, యాప్‌లపై చర్యలు తీసుకోవాలని అమెరికా భావిస్తున్నది. దీనిలో భాగంగానే ఆ దేశ చట్టసభ ప్రతినిధులు.. చైనా యాప్‌లను నిషేధించాలని అధ్యక్షుడు ట్రంప్‌ను కోరారు. అమెరికా ప్రజల డేటా, ప్రైవసీ, భద్రత అంశంలో ఈ నిర్ణయం తీసుకోవాలని 25 మంది ప్రతినిధులు తెలిపారు.
జాతీయ భద్రతను కాపాడుకునే క్రమంలో ఈ చర్య తీసుకోవాలని వారు కోరారు. జూన్ నెలలో ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా మెచ్చుకున్నది. చైనా యాప్‌లను బ్యాన్ చేసి భారత్ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా చట్టసభ ప్రతినిధులు తెలిపారు. టిక్‌టాక్‌ను కానీ ఇతర యాప్‌లను అమెరికా నమ్మవద్దు అంటూ వారు అధ్యక్షుడికి సమర్పించిన లేఖలో తెలిపారు. చైనా సైట్లపై ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రతినిధులు సమర్థించారు.













