TANA: తానా మహాసభలు 2వ రోజు… ప్రముఖుల ప్రసంగాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 24వ ద్వై వార్షిక మహాసభలు డిట్రాయిట్ (Detroit) సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో 2వ రోజు వైభవంగా ప్రారంభమైంది. తొలుత గణపతి ప్రార్థనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తరువాత అమెరికా, భారత జాతీయ గీతాలను డిట్రాయిట్ లోని చిన్నారుల ఆలపించారు. కాన్ఫరెన్స్ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కన్వీనర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు, గంగాధర్ నాదెళ్ళ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. బోర్డ్ చైర్మన్ నాగేంద్ర కొడాలి, ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లిని, ప్రెసిడెంట్ ఎలక్ట్ నరేన్ కొడాలి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీనివాస్ లావు, మాజీ అధ్యక్షులు హనుమయ్య బండ్ల, ప్రసాద్ తోటకూర, జయరాం కోమటి, లావు అంజయ్య చౌదరితోపాటు కాన్ఫరెన్స్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఎపి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రి పిఠాని సత్యనారాయణ, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, నటుడు మురళీ మోహన్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానించారు. భగవద్గీత ప్రవచన కర్త గంగాధర్ శాస్త్రి, సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ ను కూడా వేదికపైకి ఆహ్వానించారు. 2వ రోజు కార్యక్రమానికి యాంకర్ భార్గవి ఎంసిగా వ్యవహరించి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు.
ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ కో ఆర్డినేటర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు మాట్లాడుతూ, ఈ కాన్ఫరెన్స్ పనులను మేము 8నెలల క్రితం ప్రారంభించాము. అప్పటి నుంచి నేటి వరకు ఏ విఘ్నాలు లేకుండా 350 మందికి పైగా స్వచ్ఛంద సేవకులు, 400 మందికిపైగా దాతలు ఇతరుల సమష్టి కృషి, సంకల్పమే ఈ కాన్ఫరెన్స్ నేడు అంగరంగ వైభవంగా జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ అతిధులు, ఆత్మీయ అతిధులు, ముఖ్య అతిధులకు ఆయన స్వాగతం పలికారు. ఈ కాన్ఫరెన్స్‌లో రాజకీయ, సాంస్కృతీక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మీరు అతిధులు కారు…మీరు మా కుటుంబ సభ్యులు. ఏదైనా చిన్న పెద్ద పొరబాట్లు జరిగినప్పుడు కుటుంబంలోని వారు ఏ విధంగా పరిష్కరించుకుంటారో అలాగే ఈ కాన్ఫరెన్స్ మీ కార్యక్రమంగా భావించి ఈ కాన్ఫరెన్స్ విజయానికి తోడ్పడాలని కోరారు. తానాను ఏర్పాటు చేసిన మహానుభావులను ఈ సందర్భంగా స్మరించుకుని వారి కల సాకారమవుతోందని చెప్పారు.
కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ల మాట్లాడుతూ, దేశ, విదేశాల నుంచి ఎంతోమంది ఈ కాన్ఫరెన్స్‌కు వచ్చారు. తానా ప్రారంభమైనప్పటి నుంచి డెట్రాయిట్ తెలుగువాళ్ళకు ఎంతో అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఉన్నందువల్లనే ఈసారి కాన్ఫరెన్స్ ను డిట్రాయిట్ లోనే జరపాలని నిర్ణయించుకున్నాము. డిట్రాయిట్ లో తానా కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది నాలుగోసారి అని చెప్పారు. అలాగే బాంక్వెట్ కార్యక్రమానికి ఊహించిన దానికన్నా ఎక్కువమంది వచ్చినా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అప్పటికప్పుడు చేసినట్లు చెప్పారు. ఇండియా నుంచి గెస్ట్‌లు బిజీగా ఉన్నప్పటికీ ఇంతదూరం వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్య అతిధిగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ, తానా చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తానా ఎన్నో సేవలు చేసిందన్నారు. తాను తానా మహాసభల్లో పాల్గొనడం ఇది 4వ సారని చెప్పారు. గంగాధర్ నాదెళ్ళ, జయరామ్ కోమటి, అంజయ్య చౌదరి లావు, ఉదయ్ కుమార్ చాపలమడుగు ఈ కాన్ఫరెన్స్‌కు రావాల్సిందిగా కోరారు. ఎన్నారైలు మన భాష, మన సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే తెలుగుభాషను ఎన్నారై పిల్లలు నేర్చుకోవడం సంతోషమని అన్నారు. జన్మభూమి ప్రగతికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కాన్ఫరెన్స్‌లో పలువురు మాట్లాడారు.







