TANA: 24వ తానా సదస్సు సర్వ కమిటీ సమావేశం
ఫార్మింగ్టన్ హిల్స్ నగరంలో 24వ తానా సదస్సు (24th TANA Conference) కు సంబంధించి సర్వ కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. కోర్ కమిటీలతో పాటు, మొత్తం 45కి పైగా కమిటీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. 1983-1985 సంవత్సరాలలో తానా (TANA) అధ్యక్షుడిగా సేవలందించిన శ్రీ కాకరాల చంద్రశేఖర రావు గారు సదస్సు యొక్క లోగోను ఆవిష్కరించారు. ఈ లోగో ‘‘తర తరాల తెలుగుదనం తరలి వచ్చే యువతరం’’ అనే థీమ్‌ను ప్రతిబింబిస్తోంది. 20 నుండి 70 సంవత్సరాల వయస్సుల మధ్య సభ్యులు ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై, థీమ్‌ను మరియు దానిని ప్రతిబింభిస్తూ రూపొందించిన లోగోను హర్షధ్వానాలతో అభినందించారు.
ఈ సమావేశంలో ప్రతి కమిటీ తన కార్యక్రమాలను, ప్రణాళికలను ప్రదర్శించింది. యువత కమిటీ తమ ప్రచారం ద్వారా అమెరికా అంతటా 10,000కు పైగా తెలుగు యువతకు చేరుకున్నట్లు తెలియజేసింది. యువత కమిటీ సభ్యత్వానికి అనేక దరఖాస్తులు అందాయని వారు పేర్కొన్నారు. 21 ఏళ్లు పైబడిన యువత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘‘యూత్ కన్వెన్షన్’’లో యువత బాన్కెట్, యువత ప్రదర్శనలు, ఫోరమ్‌లు, యూత్ నైట్, అవుట్డోర్ డే వంటి కార్యక్రమాలు ఉంటాయని ప్రకటించారు. ఈ కన్వెన్షన్‌కు 1,000 మందికి పైగా యువత హాజరయ్యే అవకాశం ఉందని కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే, అమెరికాలోనే ‘‘తెలుగు ఇండియన్ ఐడల్ / తెలుగు సూపర్ సింగర్’’ తరహాలో జాతీయ స్థాయి గాన పోటీలను నిర్వహించి, రెండో తరం తెలుగు గాయకులను ప్రోత్సహించే కార్యక్రమాలను యువత కమిటీ ప్రణాళికలో పెట్టింది. అంతేకాక, సదస్సు ప్రారంభ గీతానికి సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. క్లాసికల్, సెమి క్లాసికల్, ఫోక్ మరియు ఫిల్మీ డాన్స్ శైలితో కూడిన నృత్యనాటికలో అమెరికా నలుమూలల నుండి ప్రతిభావంతులు పాల్గొనబోతున్నారు. ఈ ప్రారంభ నాటికను రెండో తరం యువ ప్రతిభావంతులు సమన్వయం చేస్తున్నారు.
ఇటీవల తానా కోర్ కమిటీ సభ్యులు రెండు తెలుగు రాష్ట్రాలకు వెళ్లి, ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులను ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘‘కర్టన్ రైజర్’’ కార్యక్రమం తానా 24వ సదస్సుపై భారీ అంచనాలను పెంచింది. ఈ సర్వ కమిటీ సమావేశంలో వివిధ కమిటీలు తమ పురోగతిని నివేదించాయి. ఈ సానుకూల వాతావరణంలో తానా టీమ్, అమెరికా మరియు భారత్ నుండి ప్రముఖ కళాకారులతో కూడిన స్టార్ ప్రోగ్రామ్‌ను ఏప్రిల్ చివరి నాటికి ప్రకటించనున్నట్లు తెలియజేసింది. కమిటీ సభ్యుల నమోదు కోసం ప్రత్యేక డిస్కౌంట్ ధరలను మంగళవారం, ఏప్రిల్ 9 వరకు పొడిగించినట్లు కోర్ కమిటీ ప్రకటించింది. ఆర్థిక కమిటీ పారదర్శకతను, బాధ్యతాయుత విధానాలను ప్రకటించింది. మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశం చివర్లో, కోర్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరినీ ఉత్సాహంగా ముందుకు సాగాలని కోరుతూ, తానా చరిత్రలో అతిపెద్ద సదస్సు కోసం రెడీ కావాలని పిలుపునిచ్చారు. ప్రతి రెండు వారాలకోమారు కలుస్తూ తానా మహాసభల ఏర్పాట్లను పరిశీలించాలని నిర్ణయించి ఈ సమావేశాన్ని ముగించారు.







