ముందస్తులో ఇప్పటికే 7 కోట్ల ఓటింగ్ పూర్తి
అమెరికా అధ్యక్ష ఎన్నికల సాధారణ ఓటింగ్ నవంబరు 3న జరగనున్నది. కాగా, అక్కడ అమలులో వున్న ముందస్తు ఓటింగ్ అవకాశాన్ని ఓటర్లు వినియోగించుకుంటున్నారు. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24న ఫ్లోరిడాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆన్లైన్ లేదా ప్రత్యక్షంగా వేసే అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పటికే 7 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, గత ఎన్నికల్లో పోలైన ఓట్లతో పోలిస్తే.. ఇది 50 శాతం ఎక్కువకావటం గమనార్హం. అయితే నవంబరు 3 నాటికి ఇది మరింత పెరగవచ్చునని భావిస్తున్నారు.
1908 నుంచి ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ఈసారి ఎక్కువ శాతం ఓట్లు పోలై చరిత్ర సృష్టించవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా. ముందస్తు ఓటింగ్‌పై చైతన్యం పెరగటానికి కరోనానే ప్రధాన కారణం. ఓటింగ్ రోజు భౌతికదూరం పాటించే సమస్యలు రాకుండా ముందస్తు ఓటింగ్‌కే ఓటర్లు మొగ్గుచూపుతున్నారు. నల్లజాతి వారూ మనుషులే పేరుతో సాగుతున్న ఉద్యమ ప్రభావం కూడా ఉన్నదనేది మరో కారణం. ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేలా హాలీవుడ్ తారలు, క్రీడా ప్రముఖులు ప్రోత్సహిస్తున్నారు.













