అమెరికా ఆర్థికవేత్తలకు నోబెల్ పురస్కారం
హరిత వృద్ధి నిపుణులకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ వరించింది. అమెరికా పరిశోధకులైన నార్డ్హాస్, పాల్ రోమర్లు అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. వాతావరణం, ఆవిష్కరణలను ఆర్థిక వృద్ధితో ఎలా అనుసంధానించాలో వీరి విధానాలు చెబుతున్నాయి. దీర్ఘకాల సుస్థిర వృద్ధి నమోదు విషయంలో నేడు మనల్ని వెంటాడుతున్న ఎన్నో ప్రశ్నలకు వీరిద్దరూ విడివిడిగా సమాధానాలు కనిపెట్టారు అని రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది. వీరు 1990 లోనే ఈ విధానాలను అభివృద్ధి చేశారు. ప్రకృతి, విజ్ఞానంతో ఆర్థిక వ్యవస్థల సంబంధాలను విశ్లేషించే వీటితో, ఆర్థిక విశ్లేషణల పరిధి విస్తృతమైంది అని కమిటీ వివరించింది. వాతావరణ విపత్తుల నుంచి తప్పించుకోవాలంటే సమాజం, ప్రపంచ ఆర్థికవ్యవస్థల్లో మార్పులు అవసరమని ఐరాస చరిత్రాత్మక నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో హరిత వృద్ధి పరిశోధకులకు అవార్డులు రావడం ప్రాధాన్యం సంతరించుకొంది.













