వీసా ఎఫెక్ట్ : 200 మంది ఇండియన్స్ అరెస్ట్
వీసా గడువు ముగిసినా లండన్‌లో ఉన్న భారతీయుల్ని అరెస్టు చేసినట్లు ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ నుంచి ఏటా సుమారు వెయ్యి మంది ఎలాంటి వీసా లేకుండా లండన్‌లో ప్రవేశిస్తున్నారంటూ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య వీసా గడుపు పూర్తి అయినా తిరిగి స్వదేశానికి వెళ్లకుండా అక్కడే కొనసాగుతన్న 200మంది భారతీయుల్ని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
భారత్‌తో పాటు పాకిస్థాన్, అప్గనిస్థాన్, చైనా, ఆల్బానియా చెందిన పలువుర్ని అదుపులోకి తీసుకున్నట్లు వారు చెప్పారు. వీరిందరి వద్ద ఉన్న పాస్‌పోర్టులను తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు.. వారికి జరిమానా విధించారు. వెస్ట్ లండన్‌లోని సౌత్ఆల్ ఏరియాలో సుమారు ఏడుగురు భారతీయులను అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. గడువు ముగిసినా ఇక్కడే ఉండి డబ్బులు సంపాదించుకుని.. ట్యాక్స్ కట్టడంలేదని వారు తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి యువతను ఆకర్షిస్తోన్న ఏజెన్సీలపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.













