అద్భుతం, అమోఘం…గ్రాండ్‌గా ముగిసిన 18వ ఆటా కన్వెన్షన్
ఈ ఆటా వాళ్ళు భలే వాళ్ళండీ, సమాజానికి గానీ, ప్రజలకు గానీ చాలా చేస్తారు, కానీ తక్కువ చెప్పుకుంటారు. ఇందుకు జూన్ 7 నుండి 9 వరకు అట్లాంటా లో జరిగిన 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ ఒక పెద్ద నిదర్శనం. వీళ్ళు చెప్పిన దానికంటే చాలా ఎక్కువ కార్యక్రమాలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే, చరిత్ర చూడని విధంగా, వచ్చిన వారందరి అంచనాలను మించి ఈ తెలుగు వారి 3 రోజుల అతి పెద్ద పండుగ ఘనంగా జరిగిందని నొక్కి వక్కాణించి చెప్పవచ్చు. చంటి బిడ్డలు, మహిళామణులు, పెద్దవారు, యువత, ఇలా ఎక్కడ చూసినా జన ప్రభంజనమే. మూడు రోజులలో 18 వేల మంది పైగా విచ్చేసి, తాము నచ్చి, మెచ్చిన కార్యక్రమాలలో పాల్గొంటూ, విభిన్న కళా కృతులతో అందంగా తయారైన జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ ప్రాంగణమంతా సరదా సరదాగా కలియ తిరగడం ఒక మరపురాని దృశ్య కావ్యం. అందరి నోటా ఒకటే మాట, ఇంత ఘనమైన వేడుకలు ఎప్పుడూ చూడలేదని. అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చినప్పటికీ, ఆటా నాయకత్వం సంసిద్ధత వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా త్వరితగతిన పరిష్కారం అయ్యాయి.
ఆటా మహా సభలు అట్లాంటాలో జరగడం ఇది ముచ్చటగా మూడోసారి, మునుపు 2000, 2012లో జరిగాయి. కళాకారులకు, నాయకులకు, విచ్చేసిన వారందరికీ ఏ ఇబ్బందీ లేకుండా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. ప్రారంభదినమైన 7వ తేదీన డోనార్లు మరియూ ముఖ్య అతిథుల కోసం థామస్ మర్ఫీ బాల్ రూమ్ లో జరిగిన బ్యాంకెట్ డిన్నర్ కు పలు దేశాలు, వివిధ పట్టణాల నుండి అతిథులు విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం శ్రీధర్ తిరుపతి, సాయి సూదిని విచ్చేసిన వారందరినీ ఆత్మీయంగా ఆహ్వానించి, బ్యాంకెట్ ను ఆరంభించారు.
బ్యాంకెట్ ఛైర్ డాక్టర్ శ్రీని గంగసాని ఏర్పాట్లను పర్యవేక్షించారు. అందరూ చాలా కలివిడిగా తిరగడం, కొత్త కొత్త పరిచయాలతో సందడి వాతావరణం నెలకొంది. సాంప్రదాయ భోజనాలు శుచిగా, రుచిగా ఉన్నాయని అందరూ అనుకున్నారు. ఆటా అవార్డ్స్ కమిటీ, ఛైర్ రిందా సామ & టీం ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలు చూపించిన 17 మందికి ఆటా వారు అవార్డులు ప్రదానం చేశారు. ఈ ఆటా అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి, ఎన్నో సంవత్సరాల నుండి ఇస్తున్నారు. మాజీ అధ్యక్షులు భువనేష్ బూజాల, హరి ప్రసాద్ రెడ్డి లింగాల, రామకృష్ణారెడ్డి ఆల, సాయినాథ్ బోయపల్లి, విజయ్ కుందూరు, రఘువీరారెడ్డిలకు అవార్డులు, ఆటా లైఫ్‌టైమ్ సర్వీస్ అవార్డును డాక్టర్ రాజేశ్వర్ రావు టేక్మాల్ కు అందజేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనూప్ రూబెన్స్ బృందం చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ వీనుల విందుగా, కనులకింపుగా జరిగింది. అదే సాయంత్రం యూత్ కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ లో యువత ప్రత్యేకంగా కలవడం, కార్యక్రమాలు చేసుకోవడం, విడిగా భోజనాలు చేయడం ఆటా వారు వీరికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేస్తోంది.
ముందుగా స్పాన్సర్లు మరియూ విశిష్ట ప్రముఖుల గురించి మాట్లాడుకుందాం. స్పాన్సర్లు లేకుండా ఏ కార్యక్రమాలు నడవవు కదా, వారికి శతకోటి వందనాలు. ఏ ఎస్ బి ఎల్ రియాల్టీ, ప్రైమ్ డెవలపర్, సాషా రియాల్టీ డైమండ్ స్పాన్సర్లు గా, అరేటే హాస్పిటల్స్, శూరా ఎల్ పి, సోమిరెడ్డి లా గ్రూప్, టాప్ సిస్ ఐ టి, భవ్య ఇవోరా ఆస్పైర్ స్పేసెస్, డి ఎస్ ఆర్ బిల్డర్స్ – డెవలపర్స్, వన్ డెవలపర్స్, మోప్ా జ్యూయెల్స్ ప్లాటినం స్పాన్సర్లు గా, వరల్డ్ ఫస్ట్ కొరియర్ – కార్గో, సువిధ ఇంటర్నేషనల్ మార్కెట్, స్పేషియాన్ బిజినెస్ సెంటర్, యప్ టీవీ, వజ్ర్ జ్యూయెల్స్, హరి హరా లివింగ్ రీడిఫైన్డ్, ప్లానెట్ గ్రీన్, సత్య ఆర్ రంగరాజు గోల్డ్ స్పాన్సర్లు గా, వెల్త్ హాస్పిటాలిటీ, జి హెచ్ ఆర్ ఇన్ ఫ్రా, పాటూరి లా, టెక్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ, గరుడ వేగా, ఈ ఐ పి ఎల్, ఇన్ఫి మొబైల్, గురు టాక్స్ ప్రో, హెచ్ సి రొబోటిక్స్, బ్లిస్ ఫుల్ రియల్ ఎస్టేట్, తెలుగు ఫుడ్స్ సిల్వర్ స్పాన్సర్లుగా వ్యవహరించారు.
విశిష్ట అతిథుల విషయానికి వస్తే, తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్, ధ్యాన గురు దాజి, సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్, మెహ్రీన్, నేహా షెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్ రెడ్డి వంగా, ఏ యెన్ ఆదిత్య, తనికెళ్ళ భరణి, సత్య మాస్టర్, అంకిత జాదవ్, అంగనా, శ్రీముఖి, రవళి, జర్నలిస్ట్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి విచ్చేశారు. వీరితో పాటు ఎందరో నాయకులు, సినీ మరియూ బుల్లితెర నటులు, టెక్నిషియన్స్, ఆధ్యాత్మిక గురువులు, సాహితీవేత్తలు, శాస్తవేత్తలు, జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చారు. జార్జియా గవర్నర్ బ్రయాన్ కెంప్ ఆటా వారిని ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నందుకు అభినందించి, ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలుగు వారు తోడ్పడుతున్నందుకు కొనియాడారు. అలానే, లోకల్ కాంగ్రెస్ మెన్, సెనేటర్స్, మేయర్లు, కమిషనర్స్, సిటీ కౌన్సిల్ మెంబర్స్ విచ్చేసి, మన ఏర్పాట్లు చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వీరందరినీ ఆటా వారు సముచితంగా, సగౌరవంగా వివిధ సందర్భాలలో సత్కరించారు.
ప్రధాన కార్యక్రమంలో దాజీ శ్రీ కమలేష్ పటేల్ పాల్గొని ప్రేక్షకులకు సందేశాన్ని అందించడం, ఆటా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వారికి ఇవ్వడం ఆటా గౌరవాన్ని పెంచింది. అలానే, కిరణ్ పాశం, అనిల్ బొద్దిరెడ్డి వివిధ జాతీయ సంస్థల నాయకులను పిలిచి, వారి సహకారాన్ని గుర్తు చేసుకుని గౌరవంచడం ఆనందదాయకం. దాదాపు 70 కమిటీల్లో ఛైర్ లను, కో ఛైర్ లను, అడ్వైజర్ లను, మెంబర్లను వేదిక మీదకు ఆహ్వానించి, వారి కృషిని, సేవలను గుర్తించారు. పలువురు గత అధ్యక్షులు హన్మంత్ రెడ్డి, శ్రీనివాస్ పిన్నపురెడ్డి, డాక్టర్ సంధ్య గవ్వ, ఏవీఎన్ రెడ్డి, డాక్టర్ ఆదిశేషారెడ్డి, డాక్టర్ రాజేందర్ జిన్నా, కరుణాకర్ మాధవరం, సుధాకర్ పెర్కరి, కరుణాకర్ ఆసిరెడ్డి, పరమేష్ భీంరెడ్డి, భువనేష్ బుజాల చేసిన సేవలకు ఆటా వారు సముచితంగా సత్కరించారు.
ఇంతకీ రెండో రోజు, మూడో రోజు ఏం జరిగిందో చెప్పలేదనుకుంటున్నారా, అక్కడికే వస్తున్నాం. ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ కన్వెన్షన్ కి సంబంధించి అన్ని విషయాలలో ఎంతో తోడ్పడ్డారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, ముందు ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, బోర్డు అఫ్ ట్రస్టీలు, గురువులు దాజి, కోర్ టీం శనివారం పొద్దున్న పండితుల వేదమంత్రాల మధ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. పిల్లలు అమెరికా మరియూ భారత జాతీయ గీతాలు ఆలపించగా, అందరూ తమ దేశ భక్తిని చాటారు. అనంతరం అధ్యక్షురాలు మధు బొమ్మినేని అందరినీ కన్వెన్షన్ కు ఆహ్వానించి, నవత, యువత, భవిత తమ లక్ష్యాలనీ, వీటికి ఆటా అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. కన్వీనర్ కిరణ్ పాశం కన్వెన్షన్ వల్ల మన ఊరికి, దేశానికి, మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో విపులీకరించి, వీక్షకులను సాదరంగా ఆహ్వానించారు. ఒక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కాగా, ఝమ్మంది నాదం పాటల పోటీలు, సయ్యంది పాదం నృత్య పోటీలు పోటా పోటీగా జరిగాయి. వీటీలో గెలిచిన వారితో పాటు స్పోర్ట్స్, ఫోటోగ్రఫీ %డ% రీల్స్ లో నెగ్గిన వారికి బహుమతి ప్రదానం జరిగింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ అవకాశాలు, ఫిలిం డైరెక్టర్స్ మీట్ & గ్రీట్ ఆకట్టుకుంది.
గీత రచయిత కాసర్ల శ్యామ్ రాసిన పాటకు 200 మంది కళాకారులతో గురు నీలిమ గడ్డమణుగు నృత్య దర్శకత్వం వహించిన ఇనాగరల్ షో అత్యద్భుతంగా వచ్చింది. ప్రముఖ జాతీయ అవార్డు గ్రహీత అర్చన రావు వనమాల పేరుతో చేసిన ఫ్లోరల్ ట్రిబ్యూట్, ఆటా మహిళా నాయకత్వంతో, ప్రస్తుత అధ్యక్షురాలుతో సహా సంధ్య గవ్వ చేసిన ప్రత్యేక ప్రదర్శన హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. ఆటా నవల పోటీలో ఉనుదుర్తి సుధాకర్ రచించిన ‘‘చెదిరిన పాదముద్రలు’’ విజేతగా నిలిచారు. ATA కాన్ఫరెన్స్ సావనీర్ ‘‘సమత’’ ని విడుదల చేశారు. వనమాల – ఫ్లోరల్ ట్రిబ్యూట్ ఆకట్టుకున్నాయి. త్రీఓరీ మ్యూజికల్ కాన్సర్ట్ చాలా విన్నూత్నంగా, యువతను ఆకర్షించే విధంగా సాగింది. అబ్బో, ఆ ఈలల గోలలు మిన్నంటాయంటే ఎలాంటి ఆశ్చర్యమూ లేదు.
మూడవ రోజు, అంటే ఆదివారం భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణం, అచ్చం భద్రాచలంలో జరిగినట్టే జరగడం అట్లాంటా అదృష్టం. స్పిరిట్యుయల్ కమిటీ చైర్ డాక్టర్ ప్రసాద్ గరిమెళ్ళ, ఎండోమెంట్స్ సెక్రటరీ హనుమంత రావు, భద్రాద్రి నుంచి విచ్చేసిన పండితులు రామ స్వరూప్, విష్ణు, భాస్కర శర్మ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవం లో అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని తరించారు. ఎంతో మంది డాక్టర్లు కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో భాగంగా పలు ముఖ్య విషయాలు వివరించారు, వీటివల్ల ఎంతోమందికి లబ్ధి చేకూరింది. ప్రఖ్యాత డాక్టర్ ప్రేమ్ రెడ్డి ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. వివిధ జిల్లాల ఫోరంలు, అల్యూమిని మీటింగులు ఆసక్తికరంగా సాగాయి.
శని, ఆది రెండు రోజులూ జరిగిన కార్యక్రమాలను పరిశీలిద్దాం. ముందుగా యూత్ కమిటీ చూద్దాం. ఏ ఐ సెమినార్, సెలబ్రిటీలతో క్యూ & ఏ, వివిధ విషయాలపై డిబేట్స్, గేమ్స్ ఇలా చాలా కార్యక్రమాలు ఉపయోగకరంగా, వినోదాత్మకంగా సాగాయి. ఆటా వారు యువతే భవిత స్లోగన్ కు కట్టుబడి ఉంటారని చెప్పడానికి ఇదే తార్కాణం. ఉమెన్స్ ఫోరమ్ లో మహిళలు ఏ విషయంలోనైనా తగ్గేదేలే అన్నట్టుగా, మహిళా సాధికారత, గృహ హింస, ఆర్థిక, మానసిక మరియు శారీరక ఆరోగ్యం వంటి వివిధ అంశాలు చర్చించారు. మెహ్రీన్, దేవరకొండ బ్రదర్స్ తో ముఖాముఖీ వంటి ఆకర్షణీయ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. 800 మందికి పైగా హాజరైన ఫోరమ్ కు మంచి స్పందన లభించింది. రితీష లింగంపల్లి యువత కోణంలో మానసిక ఆరోగ్య అవగాహన గురించి చెప్పిన సంగతులు ఆకట్టుకున్నాయి. ఆటాలో మహిళలకు ఎప్పుడూ ప్రథమ స్థానం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
బిజినెస్ ఫోరమ్ లో రాష్ట్ర మంత్రులు, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు, తెలంగాణ ఐటీ అడ్వైజర్ రవి తంగిరాల తదితరులు పాల్గొనగా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా మోడరేటర్ గా వ్యవహరించారు. ఎప్పుడూ లేని విధంగా బిజినెస్ పిచ్చింగ్ జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. టెక్నాలజీ మరియూ ట్రేడ్ ఫోరమ్ లో ఏ ఐ వంటి అత్యాధునిక విషయాల గురించి చర్చ జరిగింది. యెన్ ఆర్ ఐ కమిటీ ఇమ్మిగ్రేషన్, టాక్స్, యెన్ ఆర్ ఐ ఇష్యూస్ సెమినార్లు, ఆంధ్రా, తెలంగాణా, అమెరికా పొలిటికల్ ఫోరంలలో వివిధ విషయాలపై చర్చలు వీక్షకుల ఆసక్తిని పెంచాయి. సురవరం ప్రతాప రెడ్డి వేదికగా సాహిత్య ఫోరమ్ లో కథా సాహిత్యం, సమకాలీన నవల, పుస్తక ఆవిష్కరణలు జరిగాయి. అలానే, అష్టావధానం రకరకాల చిక్కుముడులతో రసవత్తరంగా సాగింది. తనికెళ్ళ భరణి, గంగాధర శాస్త్రి ప్రవచనాలు అద్భుతంగా సాగాయి.
కళాత్మకమైన ఆర్ట్స్-క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ లో ఎంతో మంది ఆర్టిస్టులు వేసిన పలు కళాఖండాలు ఆకర్షణీయంగా నిలిచాయి. బ్యూటీ పెజెంట్ వేరే లెవెల్లో పాష్ గా జరిగింది, గెలిచిన వారికి దేవరకొండ బ్రదర్స్ క్రవునింగ్ చేయడం విశేషం. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ తరగతులకు కొన్ని వేల మంది హాజరయ్యారు. దాదాపు 200లకు పైగా ఏర్పాటు చేసిన వెండర్ స్టాల్స్ లో నగలు, రియల్ ఎస్టేట్, బోటిక్ వంటి పలు అంగళ్లకు అందరూ వెళ్లడం, ముఖ్యంగా ఆడవాళ్లు, పిల్లలు కొనుక్కోవడం, కలియ తిరగడం ఆకట్టుకుంది. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు పరంపర, శ్రీదేవి ట్రిబ్యూట్, మెగా ఫ్యాషన్ షో, పెళ్లి సందడి, టాలీవుడ్ తారల డ్యాన్సులు లాంటి ఎన్నో షోలు అత్యద్భుతంగా ఉన్నాయి, కల్చరల్ టీం పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. జీవిత భాగస్వాములను కోరుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆటా మ్యాట్రిమోనీకి అధిక సంఖ్యలో హాజరయ్యారు.
అడ్వైజరీ కమిటీ గౌతమ్ గోలి, కరుణాకర్ ఆసిరెడ్డి, మహేందర్ ముసుకు, కే కే రెడ్డి, నరేందర్ చేమరాల, వెంకట్ వీరనేని అడుగడుగునా సలహాలిస్తూ దిక్సూచిగా నిలబడ్డారు. ఎంతో మంది తాము 15000 స్టెప్స్ నడిచామనీ, కొందరు 20000 దాటాయని అనుకోవడాన్ని బట్టి ఎన్ని కార్యక్రమలు ఉన్నాయో, అందరూ ఎంత ఇంట్రెస్ట్ తో తిరిగారో తెలియజేస్తోంది. భోజనాలు గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఇన్ని వేల మందికి సమయానికి అందజేయడానికి ఎంతో సమన్వయం కావాలి. ఈ విషయంలో ఆటా వారు సఫలీకృతులయ్యారు, సహకరించిన బిర్యానీ పాట్ రెస్టారెంట్ వారు ప్రశంసార్హులు.
రిజిస్ట్రేషన్ డెస్క్ ఎప్పుడూ కిట కిట లాడటం ఈ పండుగ ఎంతలా విజయవంతం అయ్యిందో తెలియజేస్తుంది. ట్రాన్స్‌పోర్టేషన్ కమిటీ విచ్చేసిన అతిథులు ఇబ్బంది పడకుండా చూసుకుంది. బైట్ గ్రాఫ్ వారి ఆడియో వీడియో కావచ్చు, ఏ వి కమిటీ వారి అనిమేషన్, వి ఎఫ్ ఎక్స్ వర్క్స్ కావచ్చు, ఇదివరకెప్పుడూ చూడని విధంగా క్రొత్త పుంతలు తొక్కాయి. వివిధ మీడియా సంస్థల ఇంటర్వ్యూలు, పత్రికలకు ఆర్టికల్స్ వంటివి మీడియా కమిటీ ఛైర్ సాయిరామ్ కారుమంచి సమన్వయ పరిచారు. శూరా ఎల్ పి వారి రాఫుల్ డ్రా లో శ్రీనివాస్ యెన్ ని టెస్లా కార్ వరించింది. ఇంత పెద్ద కన్వెన్షన్ చేయడం అంత తేలిక కాదనీ, ఈ ప్రభను ముందుకు తీసుకువెళ్తామని ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా అన్నారు. అనితర సాధ్యం అనుకున్నది సాధ్యమయ్యిందని చెప్తూ, చరిత్రను తిరగరాసిన ఈ కన్వెన్షన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు కన్వీనర్ కిరణ్ పాశం. ప్రెసిడెంట్ మధు బొమ్మినేని వోట్ అఫ్ థ్యాంక్స్ లో భాగంగా ఈ కన్వెన్షన్ ఇంత దిగ్విజయంగా సాగడానికి కారణమైన కోర్ టీం, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు అఫ్ ట్రస్టీస్, స్పాన్సర్లు, కన్వెన్షన్ కమిటీలు, మెంబర్లు, ప్రేక్షకులు, అన్ని రకాల వెండర్ల కృషిని కొనియాడి, అందరికీ కృతజ్ఞతాభినందనలు తెలిపారు.
ఇక గ్రాండ్ ఫినాలే గురించి మాట్లాడి, ముగిద్దాం. థమన్ మ్యూజికల్ కాన్సర్ట్ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఉర్రూతలూగించింది. చాలా మంది తమ సీట్ల నుండి లేచి, స్టేజి దగ్గరకు వచ్చి, ఒక ఎలెక్ట్రిఫయింగ్ హై ఓల్టేజ్ ఎన్విరాన్మెంట్ ని తలపిస్తూ, 40 పాటలకు పైగా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ, పాటలు రిపీట్ లో పాడుతూ ఎంజాయ్ చేశారు. 3 రోజుల పండుగకు శుభం కార్డు పడ్డాక, అందరూ తమకు సౌకర్యాల విషయంలో పెద్ద పీట వేసిన ఆటా వారిని అభినందిస్తూ సంతోషంగా రాత్రి ఒంటి గంటకు పైన ఇళ్లకు, బస చేసిన హోటళ్లకు బయలుదేరారు. న భూతొ అన్న చందాన జరిగిన ఈ కన్వెన్షన్ జ్ఞాపకాలు చాలా కాలం మన మదిలో ఉంటాయని తలుస్తూ సెలవు తీసుకుంటున్నాము.







