Sarangapani Jathakam: రాజ పూజ్యం :10, అవమానం :0 గా ‘సారంగపాణి జాతకం’ బేషుగ్గా వుంది

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3.25/5
నిర్మాణ సంస్థ : శ్రీ దేవి మూవీస్
నటీనటులు : ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో
నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష,
శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర,
రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ తదితరులు నటించారు.
కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ – వెంకటేష్,
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా,
సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణా రెడ్డి,
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్,, రచన – దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
విడుదల తేది :25.04.2025
నిడివి :2 ఘంటల 15 నిముషాలు
బలగం, 35, కోర్ట్ అంటూ హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు ప్రియదర్శి.(Priyadarshi) ఇక ఇప్పుడు సారంగపాణి జాతకం అంటూ ఈ రోజు ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లు ప్రియ దర్శి ఇంటర్వ్యూ వగైరాలు ఆద్యంతం అందరినీ నవ్వించాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సారంగపాణి జాతకంతో ప్రియదర్శి, ఇటు ఇంద్రగంటి మోహనకృష్ణ, (Mohan Indraganti)శ్రీ దేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్(Sivalenka Krishna Prasad) ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. అసలు ఈ మూవీ ఎలా ఉందో, కథ ఏంటో ఓ సారి సమీక్షలో చూద్దాం.
కథ:
సారంగపాణి (ప్రియదర్శి) జాతకాల్ని ఎక్కువగా నమ్ముతాడు. చేతిలో ఉన్నవి గీతలు కాదు మన తలరాతలు అనే టైపులో బతుకుతుంటాడు. సారంగపాణి ఓ కారు కంపెనీలో సేల్స్ మెన్‌గా పని చేస్తుంటాడు. అదే కంపెనీలో మైథిలీ (రూపా కొడవయూర్) (Rupa Kodavayur)మేనేజర్‌గా పని చేస్తుంటుంది. ఇక ఈ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఇద్దరూ పెళ్లికి సిద్దపడటంతో ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. ఆ టైంలోనే సారంగపాణి జాతకం చూసిన జిగ్గేశ్వర్ (శ్రీనివాస్ అవసరాల)(Avasarala Srinivas) ఓ షాకింగ్ విషయం చెబుతాడు. నీ జాతకంలో ఒక హత్య చేస్తావు అని ఉందని చెప్పడంతో సారంగపాణికి ఏం చేయాలో పాలుపోదు. ఒక వేళ పెళ్లి తరువాత ఆ హత్య చేస్తే మైథిలీ జీవితం ఏం అయిపోద్దో అని సారంగపాణి కంగారు పడతాడు. పెళ్లికి ముందే తన జాతకంలో ఉన్న ఆ హత్యను చేసేయాలని తన ఫ్రెండ్ చందు (వెన్నెల కిషోర్)తో (Vennela Kishore)సారంగ రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో సారంగకు ఎదురైన పరిస్థితులు ఏంటి? చందు, సారంగ కలిసి చేసిన పనులు ఏంటి? చివరకు అహోబిల రావు (తణికెళ్ల భరణి)ని (Tanikella Bharani)చంపాలని సారంగ ఎందుకు ఫిక్స్ అవుతాడు? చిరవకు సారంగ ఏం చేశాడు? అతని జాతకంలో చెప్పినట్టుగానే అంతా జరిగింది? చివరకు తన ప్రేమను సాధించుకున్నాడా? అన్నదే కథ.
నటీనటుల హవబవాలు:
స్వతహాగా ప్రియదర్శి తన కామెడీతో మెప్పిస్తాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకుంటాడు.ఈ చిత్రంలో తన రేంజ్ కొద్ది చిన్నపాటి యాక్షన్స్ కూడా చేశాడు. ఇక వెన్నెల కిషోర్, వైవా హర్ష ద్వయం చేసిన కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే. ఈ ఇద్దరూ తమ తమ పాత్రల్లో నవ్వించేశారు. రూపా కొడవయూర్ తెరపై అందంగా కనిపిస్తుంది. ఇక నరేష్,(Sr Naressh) వడ్లమాని శ్రీనివాస్,(Vadlamani Srinivas) తణికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల ఇలా అందరూ కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ చిత్రం కాన్సెప్ట్ తోనే పాస్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇంద్రగంటి మ్యాజిక్ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తరానికి తగ్గట్టుగా ట్రెండీ డైలాగ్స్ రాశాడు. పంచ్‌లు మాత్రం వర్షం కురిసినట్టుగా అలా కురుస్తూనే ఉంటాయి. డైలాగ్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు. సంగీతం అంత గొప్పగా ఏమీ అనిపించదు. పాటలు ఎక్కువగా గుర్తుండకపోవచ్చు. కెమెరా వర్క్ బాగుంటుంది. ఎడిటింగ్ టీం పనితీరు కూడా బాగుంటుంది. ముఖ్యంగా శ్రీదేవీ మూవీస్ బ్యానర్ బ్రాండ్ వ్యాల్యూ కనిపిస్తుంది. నిర్మాత శివలెంక మరోసారి తన అభిరుచిని చాటుకున్నారు.
విశ్లేషణ :
సారంగపాణి జాతకంలో కొన్ని లోపాలున్నా కూడా ఈ సారి ఇంద్రగంటి, ప్రియదర్శి పంట పండినట్టే అనిపిస్తుంది. టేకాఫ్ కాస్త స్లోగా, బోరింగ్‌గా అనిపించినా కూడా ఆ తరువాత కథలోకి లీనం అవుతారంతా. స్టార్టింగ్ ఓ ఇరవై నిమిషాలు అంతగా ఎక్కకపోయినా.. మర్డర్ ఆలోచనలు రావడం, హత్య చేయడం గురించి వెన్నెల కిషోర్, ప్రియదర్శి మాట్లాడుకునే మాటలు.. ఎవరిని టార్గెట్ చేద్దామని ఆ ఇద్దరూ చేసే ప్రయత్నాలు నవ్విస్తాయి. అలా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా సాగుతుంది. ఏం చేసినా తిరిగి బెడిసి కొట్టడంతో చివరకు తన బాస్‌ను పైకి పంపించాలని అనుకుంటారు. ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా చాలా ఫన్నీగానే ఉంటుంది. అలా ఫస్ట్ హాఫ్ మొత్తానికి ఆడియెన్స్‌ను నవ్వించడంలో సఫలం అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక సెకండాఫ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడో అని అందరికీ అనుమానం రావొచ్చు.
కానీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ మరింత హిలేరియస్‌గా ప్లాన్ చేసుకున్నారు. సెకండాఫ్ మొత్తం ఒకే చోట జరుగుతుంది. అయినా ఎక్కడా బోర్ కొట్టించలేదు. వైవా హర్ష, వెన్నెల కిషోర్, ప్రియదర్శి త్రయం నవ్విస్తూనే ఉంటారు. వైవా హర్ష అయితే తన ఎక్స్‌ప్రెషన్స్‌తోనే కడుపుబ్బా నవ్వించేస్తాడు. అలా ప్రీ క్లైమాక్స్ వరకు హర్ష నవ్విస్తూనే ఉంటాడు. ద్వితీయార్దం మొత్తం ఒకే హోటల్, ఒకే చోట జరిగినా కూడా పలు ట్రాకులు పెట్టడంతో ఎక్కడా బోరింగ్ అనిపించదు. సెకండాఫ్‌లో కొన్ని సీక్వెన్సులకు పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా.. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా.. అసభ్యకర సీన్లను ఇరికించకుండా.. తీసిన ఫుల్ క్లీన్ చిత్రమే సారంగపాణి జాతకం. ఈ వీకెండ్‌కు మంచి ఫన్, ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్ ఇలా అందరూ ఈ సినిమాను ఓ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చనిపిస్తుంది. చివరగా ఈ సారంగపాణి జాతకం గురించి జాతకాల భాషలోనే చెప్పాలంటే.. బేషుగ్గా ఉందని అనొచ్చు.