రివ్యూ: ‘పవర్ ప్లే’ లో స్క్రీన్- ప్లే మైనస్ పవర్

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ 2.5/5
బ్యానర్ : వనమాలి క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్
నటీనటులు: రాజ్ తరుణ్, హేమల్ ఇంగ్లే, పూర్ణ, ప్రిన్స్, మధు నందన్, అజయ్, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర, పూజ రామచంద్రన్, ధన్‌రాజ్ కేదార్ శంకర్, అప్పాజీ, సత్యం రాజేష్, రవి వర్మ, వేణు భూపాల్, డి డి శ్రీనివాస్, గగన్ విహారి తదితరులు నటించారు.
సంగీతం: సురేష్ బొబ్బిలి, ఛాయాగ్రహణం: ఐ. ఆండ్రూ, కూర్పు: ప‌్రవీణ్ పూడి
కథ-మాటలు: నంద్యాల రవి, సమర్పణ: శ్రీమతి పద్మ
నిర్మాతలు: మహిధర్, దేవేష్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
విడుదల తేదీ: 05-03-2021
లవర్ బాయ్ గా కెరీర్ స్టార్ట్ చేసిన హీరో రాజ్ తరుణ్, సరైన సక్సెస్లు లేక మొదటి సారిగా ఓ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ఒరేయ్ బుజ్జిగా తరువాత అదే కొండా విజయ్ కుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మహిదర్, దేవేష్ సంయుక్తంగా నిర్మించారు. మరి ఈ చిత్రం ప్రేక్షుకులను ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
కథ:
విజయ్ కుమార్ కొండా (రాజ్‌తరుణ్) ఓ మధ్య తరగతి కుర్రాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతుంటాడు. కీర్తి (హేమల్ ఇంగ్లే ) అంటే చాలా ప్రేమ. ఆమెకీ తనంటే ఎంతో ఇష్టం. ఇద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కాలనుకుంటారు. కానీ, అబ్బాయికి ఉద్యోగం లేదన్న కారణంతో కీర్తి తండ్రి పెళ్లికి అడ్డు చెబుతాడు. దీంతో విజయ్ తండ్రి తన ప్రభుత్వ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మంట్ ప్రకటించి.. ఆ జాబ్ తన కొడుక్కి వచ్చే ఏర్పాటు చేస్తాడు. దీంతో పెళ్లికి అన్ని అడ్డంకులు తొలగుతాయి. ఇక ప్రేమించిన అమ్మాయితో కొత్త జీవితాన్ని ప్రారంభించడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో….. విజయ్ జీవితం అనుకోని చిక్కుల్లో పడుతుంది. తను చేయని నేరానికి జైలు పాలవుతాడు. ఒక్క రాత్రిలోనే అతని జీవితం తలకిందులై పోతుంది. సమాజం దృష్టిలో ఓ మోసగాడిగా నిలబడాల్సి వస్తుంది. ఓవైపు కుటుంబం రోడ్డున పడగా….. మరోవైపు ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుంది. మరి విజయ్‌ని అన్యాయంగా జైలు పాలు చేసిన ఆ వ్యక్తులెవరు? ఈ సమస్యల వల నుంచి అతనెలా బయటపడ్డాడు? మొత్తంగా ఈ కేసుకు సూత్రధారి ముఖ్యమంత్రి కూతురు పూర్ణ (పూర్ణ)కి ఉన్న లింకేంటి? అన్నది మిగతా కథ.
నటీనటుల హావభావాలు :
రాజ్ తరుణ్ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్నిఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. ఇక కీర్తి గా నటించిన హేమల్ తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. విలన్ గా నటించిన అజయ్ ఎప్పటిలాగే తన గంబీరమైన నటనతో ఆకట్టుకున్నాడు. పూర్ణ నెగెటివ్ రోల్ లో , ఇక మిగతా నటీనటులు తన పాత్రల మేరకు నటించారు.
సాంకేతికవర్గం పనితీరు:
దర్శకుడు కొండా విజయ్ కుమార్ మంచి కథాంశం తీసుకున్నా…. టైటిల్ కి తగా ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే రాసుకోలేదు. టెక్నికల్ పరంగా చూసుకుంటే సినిమాలో బ్యాక్ స్క్రీన్ టెక్నిషేయెన్స్ సెక్షన్ వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ ఆయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం హైలెట్ గా నిలుస్తుంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.
విశ్లేషణ:
ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర రాజ్ తరుణ్ పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. వాళ్లు చేసే తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి అధికారంలో ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులు.. చట్టాల్ని, పోలీసు వ్యవస్థని ఎలా పావుగా వాడుకుంటారు? ఈ క్రమంలో సామాన్యుల్ని అన్యాయంగా ఎలా బలిచేస్తుంటారు? ఒకవేళ అలాంటి సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటుంది? అన్నది ఈ చిత్రంతో థ్రిల్లింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు విజయ్ కుమార్. అయితే ఆలోచన బాగున్నా.. దాని చుట్టూ ఆకట్టుకునేలా కథ, కథనాలను అల్లుకోవడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డారు. ఆరంభంలో ఒక కారు యాక్సిడెంట్ జరగడం.. దాని వల్ల డ్రగ్స్ మాఫియాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి రావడం వంటి సన్నివేశాలతో సినిమాని ఆసక్తికరంగా మొదలుపెట్టారు దర్శకుడు. తర్వాత విజయ్ పాత్ర పరిచయం.. కీర్తి తో అతని ప్రేమ.. ఇంట్లో వాళ్లని పెళ్లికి ఒప్పించేందుకు తను చేసే ప్రయత్నాలతో నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే విజయ్, కీర్తిల మధ్య ఉన్న ప్రేమ అంత భావోద్వేగభరితంగా తీర్చిదిద్దినట్లు కనిపించదు. అదే సమయంలో విజయ్ అనుకోని విధంగా ఓ కేసులో జైలుకు వెళ్లడంతో కథ వేగం పుంజుకుంటుంది. తర్వాత అతను బెయిల్‌పై బయటకు రావడం.. కేసు నుంచి బయట పడేందుకు రకరకాలుగా ప్రయత్నించడం.. మరోవైపు విజయ్‌ని చంపడానికి ఓ వ్యక్తి ప్రయత్నిస్తుండటం.. వంటి సన్నివేశాలతో ప్రథమార్ధమంతా సాగిపోతుంటుంది. అయితే దీంట్లో థ్రిల్లర్ చిత్రంలో ఉండాల్సినన్ని చిక్కుముళ్లు, ఆసక్తి రేకెత్తించే మలుపులు ఎక్కడా కనిపించవు. దీంతో ప్రేక్షకులకు ఓ మామూలు కమర్షియల్ సినిమా చూస్తున్న అనుభూతే కలుగుతుంది తప్ప.. ఏమాత్రం థ్రిల్లింగ్ దొరకదు. ఇక విరామ సమయానికి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, అక్కడ ఇచ్చే ట్విస్ట్ ఆసక్తిగా అనిపించదు. ద్వితీయార్ధంలో ముఖ్యమంత్రి కూతురిగా పూర్ణ పాత్ర రంగంలోకి దిగడంతో కథలో కాస్త స్పీడ్ అందుకున్నట్లు ఉంటుంది. కానీ, ఇక్కడి నుంచే కథ పూర్తిగా గాడి తప్పింది. పూర్ణ పాత్రలో ప్రతినాయిక ఛాయలను చూపించడానికి దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు మరీ పేలవంగా అనిపిస్తాయి. ముఖ్యంగా విజయ్ కేసుకు, ఆమె నేపథ్యానికి లింక్ పెడుతూ దర్శకుడు రాసుకున్న విధానం లాజిక్‌గా అనిపించదు. ఇక కేసు నుంచి బయట పడేందుకు విజయ్ చేసే ప్రయత్నాలు.. దాని వెనకున్న వ్యక్తుల్ని బయటకు లాగేందుకు అతనేసే ఎత్తుగడలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంటాయి. మధ్యలో ప్రిన్స్, పూర్ణల మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ కాస్త కనులవిందుగా అనిపిస్తుంది. ఇక దర్శకుడు సినిమాని ముగించిన తీరు ఒకే అనిపిస్తుంది.