Kuberaa: ‘కుబేర’ మూవీ ఎలా వుందంటే?

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్
నటీనటులు: కింగ్ నాగార్జున అక్కినేని, ధనుష్, రష్మిక మందన్న, జిమ్ సర్బ్, దలీప్ తాహిల్,
సాయాజీ షిండే, సునైనా, హరీష్ పెరడీ తదితరులు
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫి: నికేత్ బొమ్మిరెడ్డి
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, రచన: శేఖర్ కమ్ముల, చైతన్య పింగిలి
నిర్మాతలు : సునీల్ నారంగ్, పుస్కర్ రాంమోహన్ రావు
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
విడుదల తేది : 20.06.2025
నిడివి : 3 ఘంటల 14 నిముషాలు
కింగ్ నాగార్జున అక్కినేని (King Nagarjuna Akkineni), ధనుష్ (Dhanush), రష్మిక మందన్న(Rashmika Mandanna), శేఖర్ కమ్ముల (Sekhar Kammula) కాంబినేషన్ లో వచ్చిన ‘కుబేర’ (Kuberaa) అద్భుతమైన తారాగణంతో జూన్ 20 న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ,మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఆనంద్ నుండి నిన్నటి లవ్ స్టొరీ వంటి ఫీల్ గుడ్ సినిమాలతో ప్రేమరాగాలు పలికించినా.. ఏం చేసినా అది శేఖర్ కమ్ములకే దక్కింది. ఎందుకంటే ఇలాంటి చిత్రాలు తీయాలంటే ఆయనలో ఎంత సెన్సుబిలిటీ ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువంటి డైరెక్టర్ శేఖర్ కమ్ములకి ధనుష్ లాంటి యాక్టర్, నాగార్జున లాంటి స్టార్ దొరికితే.. రష్మిక లాంటి హీరోయిన్ దొరికితే.. ‘కుబేర’ అంటూ బిచ్చగాడి సినిమా తీస్తున్నారేంటబ్బా అని చాలా మందికి మొదట్లో చిన్నచిన్న సందేహాలు వచ్చాయి. కాని ప్రమోషన్స్ లో బాగంగా సాంగ్స్, ట్రైలర్స్, చూసాక ఒక అధ్బుతమైన సినిమా వస్తోంది అన్న బావన ఏర్పడింది. మరి ఈ రోజు విడుదలైన కుభేర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
కథ:
దేశంలోని బిజినెస్ రంగాన్ని శాసించే పారిశ్రామిక వేత్త, బిలియనీర్ నీరజ్ (జిమ్ సర్బ్)(Jhim Sarabh) తాను అక్రమంగా సంపాదించిన డబ్బును చట్ట వ్యతిరేకంగా తన ఖాతాలోకి మళ్లించాలని అనుకొంటాడు. అందుకు జైలులో ఉన్న దీపక్ (నాగార్జున అక్కినేని) సహాయం కోరుతాడు. జైలు నుంచి విడిపించిన నల్ల ధనాన్ని తన ఖాతాలోకి మళ్లించే ప్లాన్ వేస్తారు. అందుకు బిచ్చగాళ్లైన దేవా (ధనుష్), ఖేలూ, దివ్య, కుష్బూ (Kushboo)ను ఉపయోగించుకొంటారు. బిచ్చగాళ్లను బిజినెస్ మ్యాన్స్‌గా మార్చి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తుంటారు. ఈ క్రమంలో నీరజ్, దీపక్ గ్రూప్ నుంచి దేవా తప్పించుకొంటాడు. అప్పుడే సమీరా (రష్మిక మందన్న) కలుస్తాడు. అయితే నీరజ్ మనషులు వెంటాతుండటంతో వారికి దేవా ఎదురు తిరుగుతాడు. నీరజ్ చేసే దందాలు ఎలాంటివి? వ్యాపార రంగంలో దేశాన్ని ఎలా శాసించాలని ప్లాన్ వేస్తాడు? దీపక్ ఎవరు? ఎందుకు జైలులో ఉన్నాడు? ఏ కండిషన్స్ మీద దీపక్‌ను జైలు నుంచి నీరజ్ విడిపిస్తాడు? ఏ రకంగా డబ్బును హవాలా మార్గంలో మళ్లిస్తారు? నీరజ్ ముఠాను దేవా ఎందుకు ఎదురిస్తాడు? ఏ పరిస్థితుల్లో సమీరాను దేవా కలుస్తాడు? దేవా, సమీరా ప్రయాణం ఎలా సాగింది? చివరకు దేవా, నీరజ్ మధ్య వైరానికి ఎలాంటి ముగింపు లభించింది? ఈ వ్యవహారంలో దీపక్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అలా బయటికి వచ్చిన దీపక్ ఈ డీల్‌ని పూర్తి చేసేందుకు నీరజ్‌కి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని వెతికి పట్టుకుంటాడా? అనే ప్రశ్నలకు సమాధానమే కుబేరా సినిమా కథ.
నటీ నటుల హవబవాలు :
ఇలాంటి కథకు ధనుష్ లాంటి స్టార్ హీరో ఓకే చెప్పడం చాలా గొప్ప విషయం. నిజానికి తెలుగు దర్శకుడైన శేఖర్ కమ్ముల.. మన హీరోలని కాదని కోలీవుడ్ హీరో దగ్గరికి ఎందుకు వెళ్లారా అనే ప్రశ్న సినిమా చూసేవరకూ అందరికీ ఎక్కడో ఒక చోట రావచ్చు. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం ఎవరికీ ఆ సందేహం కలగదు. ఎందుకంటే బిచ్చగాడి పాత్రలో నటించడం కాదు ధనుష్ జీవించేశారు. ఆయన చూపు, తినే విధానం, మాట్లాడే మాట, నడిచే తీరు, హృదయంలో శాశ్వతంగా ఉండే ఆ ప్రశాంతతని.. తన కళ్లల్లో ఇట్టే కనిపించేలా చేశారు ధనుష్. సినిమా చూసిన తర్వాత ఈ పాత్రలో ధనుష్‌ని తప్ప వేరే ఎవరినీ ఊహించలేరు. అంతలా తన నటనతో కట్టిపడేశారు. మరోవైపు నాగార్జున లాంటి స్టార్ ఈ సినిమాలో చేసిన పాత్ర నిజంగా ప్రశంసనీయం. ఎందుకంటే కథని మలుపు తిప్పే పాత్రలు చాలానే ఉంటాయి. నిజాయతీపరుడి పాత్రలో నాగార్జున నటించారు.
దేశానికి ఏదో చేసేయాలని సీబీఐ ఆఫీసర్ అయిన ఓ వ్యక్తిని.. అదే వ్యవ్యస్థలు, సంస్థలు అక్రమ కేసులు పెట్టి జైలులో తోసెస్తే పడే మానసిక క్షోభ.. దేశానికి ఇంత చేస్తే ఆ దేశం నాకు ఇదా ఇచ్చింది అని పడిన వేదనని.. నాగార్జున చాలా బాగా పలికించారు. నిజాయతీపరుడు అవినీతి చేయాలన్నా.. తప్పులు చేయాలన్నా కూడా చేయలేరు.. ఎందుకంటే నిజాయితీ వారి నరనరాల్లోనూ కలిసిపోయిన ఓ సత్యం. కానీ దేశమా.. ద్రోహమా అనే మధ్యలో నలిగిపోయే పాత్రలో నాగార్జున తన అనుభవాన్ని ఉపయోగించుకొని అద్భుతంగా నటించారు. ఈ మధ్య కాలంలో నాగార్జునకి వచ్చిన మంచి పాత్ర ఇది. ఇక హీరోయిన్ రష్మిక మందన ఇందులో కథానాయిక అని ఎక్కడా చెప్పలేం. ఎందుకంటే కథకి ఉపయోగపడే పాత్రనే మాత్రమే శేఖర్ కమ్ముల ఆమెకి రాశారు. దాన్ని ఉన్నది ఉన్నంట్లుగా నటించారు రష్మిక. చివరిగా విలన్‌గా చేసిన జిమ్ సర్బ్ అటు బిజినెస్‌మ్యాన్‌గా ఇటు క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ఒక అవతారంలో చాలా బాగా నటించారు. మిగిలిన వారంతా తమ తమ పాత్రలకి న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు :
అసలు కథలోకి వెళ్లడానికి శేఖర్ కమ్ముల టైమ్ ఎక్కువగానే తీసుకొన్నాడు. ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కటే సినిమాకు ప్లస్ పాయింట్ అనిపిస్తుంది. పేలవమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ.. నాగార్జున క్లాస్‌గా, ధనుష్ మాస్ అప్పీల్‌తో సినిమాను తమ పెర్ఫార్మెన్స్‌తో నిలబెట్టే ప్రయత్నం చేశారనిపిస్తుంది. జిమ్ సర్బ్ క్యారెక్టర్‌ను మలిచిన తీరు బాగుంది. ఫస్టాఫ్‌లో రష్మిక ఎంట్రీ సీన్ కూడా బాగుందనిపిస్తుంది. ఇలాంటి అంశాలతో ఓ మంచి ట్విస్టుతో ప్రథమార్థాని ముగించి సెకండాఫ్‌పై ఆసక్తిని దర్శకుడు కలిగించాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ అయింది. ముఖ్యంగా పోయిరా పోయిరా మావా, తల్లి మీద వచ్చిన సాంగ్ చూడటానికి కూడా చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఇక సినిమాకి దేవిశ్రీ ఇచ్చిన బీజీఎమ్ కూడా బాగా సూట్ అయింది. సినిమాటోగ్రఫి నికేత్ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం.. ఆర్ట్ విభాగం పనితీరును చక్కగా తెరపైకి తీసుకొచ్చారు. కలర్ ప్యాటర్న్ డిఫరెంట్ ఫీల్‌ను కలిగించింది. ఇక ఈ సినిమాను నిడివి కొంత మేరకు దెబ్బ తీసిందని చెప్పాలి మూడుమ్పావు ఘంటలు పాటు సినిమా వుంటుంది. ఫస్టాఫ్‌లో కనీసం 10 నిమిషాలు నిడివిని ట్రిమ్ చేయొచ్చు. ఇక సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్‌లో చాలా ల్యాగ్ ఉంది. సునీల్ నారంగ్, రాంమోహన్ రావు అనుసరించిన నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
విశ్లేషణ :
ఓవరాల్‌గా సినిమా విషయానికి వస్తే.. సంపన్న వర్గాలకు, అణగారిన వర్గానికి మధ్య జరిగే రివేంజ్ డ్రామాయే కుబేర. సింపుల్ పాయింట్ చుట్టూ రకరకాల పాత్రలను అల్లిన తీరు బాగుంది. కానీ సన్నివేశాల్లో బలం లేకపోవడం, ఎమోషన్స్ భారీగా పండకపోవడంతో మూవీ సాదా సీదాగా సాగుతుంది. ఫస్టాఫ్‌లోనే కథకు ముగింపు ఏమిటో అర్ధమవ్వడంతో, చివరి వరకు ఎలాంటి ఎలా తీసుకెళ్తాడనే ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్ కూడా ఆసక్తికరంగా సాగపోవడం మైనస్‌గా అనిపిస్తుంది. కేవలం నటీనటుల పెర్ఫార్మెన్స్ ముఖ్యంగా ధనుష్, రష్మిక యాక్టింగ్ సినిమాకు బలంగా మారిందని చెప్పవచ్చు. మంచి స్టార్ వాల్యూ, యాక్టర్ల పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమాను ఈ వారాంతంలో చూసే సినిమాల్లో ఒకటిగా నిస్సందేహంగా చేర్చుకోవచ్చు. మరీ గొప్పగా ఊహించుకోకుండా సినిమకేల్తే పరవాలేదు అనిపిస్తుంది.