Kingdom Movie Review: విజయ్ స్టార్ డమ్ ను పెంచిన ‘కింగ్‌డమ్’

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకరా స్టూడియోస్
తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ వైపీ, అయ్యప్ప పీ శర్మ, మహేష్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ కోన, కళా దర్శకుడు: అవినాష్ కొల్లా
కూర్పు: నవీన్ నూలి, నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
విడుదల తేది : 31.07.2025
నిడివి : 2 ఘంటల 30 నిముషాలు
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం… ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ వైపీ, ముఖ్య పాత్రలు పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ ద్వారా భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పటికే విదేశాల్లో ప్రీమియర్ షోస్ చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో? ఈ ఒక్కసారి ఆ వెంకన్నతోడు ఉంటే వెళ్లి టాప్‌లో కూర్చొంటా అని అన్న విజయ్ దేవరకొండ మొర ఆ ఏడుకొండల స్వామికి ఆలకించాడో లేదో సమీక్షలో చూద్దాం.
కథ :
కింగ్‌డమ్(సామ్రాజ్యం) (Kingdom).. గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్‌లో ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ల చుట్టూ జరిగే సంఘర్షణ. మనషుల్ని సైతం రాక్షసులుగా మార్చేసే ప్రాంతంలోకి వెళ్లి.. రాక్షసులందరికీ సూరి ఏవిధంగా రాజయ్యాడు? అన్నదే కింగ్‌డమ్ లో అంతర్లీనమైన కథ. అంకాపూర్ పోలీస్ స్టేషన్‌లో సూరి (విజయ్ దేవరకొండ) (Vijay Devarakonda) కానిస్టేబుల్. అన్యాయాన్ని చూస్తే ఆవేశానికి గురై చిక్కుల్లో పడుతుంటాడు. చిన్నతనంలో పారిపోయిన తన అన్న శివ (సత్యదేవ్) (Satya Dev)కోసం వెతుకుతుంటాడు. ఓ సమస్యలో ఇరుక్కుపోయిన సూరి సస్పెన్షన్ వేటు పడే సమయంలో తన ఉన్నతాధికారి ఓ సీక్రెట్ మిషన్‌ను అప్పగిస్తాడు. ఆ ఆపరేషన్ చేయడానికి ఇష్టం లేకపోయినా.. శ్రీలంకలో ఉన్న తన అన్న శివను కలిసే అవకాశం రావడంతో ఒప్పుకొంటాడు. దాంతో స్పెషల్ ఆపరేషన్ కోసం శ్రీలంకలో అడుగుపెడుతాడు. చిన్నతనంలో తన అన్న శివ ఇంటి నుంచి ఎందుకు పారిపోతాడు? తన తండ్రి మరణానికి శివ ఎందుకు కారణమయ్యాడు? శ్రీలంకలో ఓ జాతికి శివ ఎలా నాయకుడయ్యాడు? శ్రీలంకలో అడుగుపెట్టిన సూరికి ఎదురైన సమస్యలు ఏమిటి? శివను సూరి ఇండియాకు తీసుకు రావాలన్న ప్రయత్నాలు ఎలా కొనసాగాయి? శివకు, మురుగన్ (వెంకటేష్ వైపీ)(Venkatesh YP)కి ఉన్న వైరం ఏమిటి? శ్రీలంక డాక్టర్‌గా పనిచేసే మధు (భాగ్యశ్రీ భోర్సే)(Bhagyasri Borse) సూర్యకు ఎలా సహకరించింది? శ్రీలంకలో తెలుగు జాతిపై వివక్ష ఎందుకు కొనసాగుతుంది? బ్రిటీష్ కాలంలో తెలుగు జాతి ఎందుకు శ్రీలంకకు వలస పోయింది? పోలీస్ ఆపరేషన్‌పై వెళ్లిన సూరి తెలుగు జాతికి నాయకుడు ఎలా అయ్యాడు? అనే ప్రశ్నలకు సమాధానమే కింగ్‌డమ్ సినిమా కథ.
నటీనటుల హవబవాలు :
నేను నటుడు అనుకునే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా గౌతమ్ తిన్నానూరితో డైరెక్ట్ చేయించుకోవాలి. నాలో ఇంత నటన ఉందా? అని మనకే అనిపిస్తుంది. అంత గొప్ప డైరెక్టర్’ అంటూ ఈ సినిమాలో నటించిన సత్యదేవ్ తన ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఈ సినిమా చూశాక అక్షరాల ఆ మాట నిజమ్ అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ కానీ, సత్యదేవ్, కానీ చాలా సినిమాలు చేశారు. వాళ్లని వాళ్లు పరిపూర్ణ నటులు అని అనిపించుకోవడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఈ సినిమాతో ఆ ఇద్దరికీ ఆ లోటు తీర్చేశాడు గౌతమ్ తిన్నానూరి. ఈ సినిమాలో విజయ్ ఒక్కడే హీరో కాదు.. సత్యదేవ్‌ని కూడా హీరో స్థాయిలో ప్రాధాన్యత కల్పించడాన్ని బట్టి చూస్తే.. దర్శకుడు కథే హీరో అని గట్టిగా నమ్మారు. ఆ నమ్మకమే నిజం అయ్యింది. సూరిగా విజయ్ దేవరకొండ తన ఫెర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోయాడు. కీలక సన్నివేశాల్లో హై ఎన్జరీతో సన్నివేశాలకు ప్రాణం పోశాడు. కొన్ని సీన్లలో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఓ మ్యాజిక్ అని చెప్పాలి. భాగ్యశ్రీ భోర్సే డాక్టర్‌గా సపోర్టింగ్ రోల్‌కే పరిమితమయ్యారు. తన పాత్రకు స్కోప్ ఉన్నా.. నటించడానికి అవకాశం లేకపోయింది. గ్లామర్‌పరంగా కూడా వెనకబడింది. సత్యదేవ్ ఎప్పటిలానే పవర్ ప్యాక్డ్‌గా కనిపించడమే కాకుండా విజయ్ దేవరకొండతో పోటాపోటీగా నటించాడు. విలన్ పాత్రలో వెంకటేష్ వైపీ స్పెషల్ ఎట్రాక్షన్. కసిరెడ్డి డిఫరెంట్ రోల్‌లో మెప్పించే ప్రయత్నం చేశారు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
గౌతమ్ తిన్నానూరి కూడా కింగ్‌డమ్ కథ మొత్తాన్ని ట్రైలర్‌లోనే రివీల్ చేశారు. కథ అలా ఉంటుంది. తన ప్రధాన అస్త్రం అయిన ఎమోషన్‌ని ఎక్కుపెట్టి కింగ్‌డమ్ గా వదిలారు. గౌతమ్ తిన్నానూరి కథల్లో కీలకం బలమైన భావోద్వేగాలే. ఈ కథలో యాక్షన్‌ని జతచేసి, కింగ్‌డమ్ ని ఎమోషనల్ డ్రామాగా మలిచారు. గౌతమ్ తిన్నానూరి ఎమోషన్స్‌ని హ్యాండిల్ చేయడంలో దిట్ట. చిన్న సంభాషణలతోనే బరువైన భావోద్వేగాలను పలికిస్తారు. మళ్లీ రావా, జెర్సీ సినిమాల్లో ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. ఇప్పుడు ఈ గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్ కథలో కూడా.. భావోద్వేగాలకు అగ్రపీఠం వేశారు. బ్రదర్ సెంటిమెంట్‌ని ఎమోషనల్ రైడ్‌గా చూపించారు. జాత్యహంకారం, అధిపత్య పోరాటం అంశాలను బేస్ చేసుకొని రాసుకొన్న ఎమోషనల్ స్టోరి. అన్నదమ్ముల సెంటిమెంట్ ఈ సినిమాను ముందుకు నడిపించేలా చేసింది. ఈ సినిమా అత్యంత బలం అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అనిరుధ్ ఇచ్చిన బీజీఎం వల్లనే చాలా సన్నివేశాలు తెర మీద సజీవంగా కనిపించాయి. ఇక సినిమాటోగ్రఫి ఈ సినిమాకు మరో అదనపు బలం. ఎడిటింగ్ విభాగానికి ఇంకా చాలానే పని ఉందనే విధంగా వారి పనితీరు కనిపించింది. ఆర్ట్ వర్క్ ఫెంటాస్టిక్. సినిమా మూడ్‌ను బాగా క్రియేట్ చేసింది. నాగవంశీ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్‌గా ఉన్నాయి. సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్‌గా ఉంది.
విశ్లేషణ :
శ్రీలంకలో కథను మొదలుపెట్టి.. 70 ఏళ్ల తరువాత ఆ కథకి కొనసాగింపుగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని చూపించడానికి పెద్ద కింగ్‌డమ్ నే స్థాపించాడు దర్శకుడు. రాజు ఎవరు అనే ప్రశ్న? నాకెలా తెలుస్తుంది అనే సమాధానంతో కథలోకి తీసుకుని వెళ్లాడు. సూరిగా విజయ్ దేవరకొండ ఓ సాధారణ మధ్యతరగతి కానిస్టేబుల్‌గా ఫస్ట్ సీన్‌తోనే పెర్ఫామెన్స్ పీక్స్ అనిపించాడు. కథలో కన్ఫ్యూజన్ లేకుండా తన అన్నని వెతుక్కుంటూ వెళ్లడంతోనే సూరి పాత్ర ద్వారా కథని మొదలుపెట్టారు. ఎప్పుడెప్పుడు తన అన్నని కలుస్తాడా అనే ఆతృత సూరిలోనే కాకుండా చూసే ప్రేక్షకుల్లో కలిగించడంతో ఫస్టాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఎప్పుడైతే జైలులో ఉన్న తన అన్న శివని కలుస్తాడో, అక్కడ నుంచి కథ వేగం పుంజుకుంది. ఆ అన్నదమ్ములిద్దరూ ఎదురుపడే జైలు సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాను హిట్‌గా మార్చిందని చెప్పాలి. ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లు,సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. డిఫరెంట్ సినిమాలు చూడాలనుకొనే వారికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న చిత్రం. థియేటర్‌లోనే ఈ సినిమాను ఎంజాయ్ చేయాలి.