Junior Review రివ్యూ: ‘జూనియర్’ గా కిరీటి గ్రాండ్ ఎంట్రీ

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : వారాహీ చలన చిత్రం
నటీనటులు: రవిచంద్రన్, కిరీటీ రెడ్డి, శ్రీలీల, జెనీలియా దేశముఖ్, రావు రమేశ్, సత్య,
వైవా హర్ష, సుమన్ శెట్టి , అచ్యుత్ కుమార్, సుధారాణి తదితరులు..
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్ కుమార్
ఎడిటర్: నిరంజన్ దేవరమానె, సమర్పణ : సాయి కొర్రపాటి
నిర్మాత : రజినీ కొర్రపాటి, దర్శకత్వం: రాధాకృష్ణా రెడ్డి
విడుదల తేది: 18-7-2025
నిడివి : 2 ఘంటల 34 నిముషాలు
‘కిరీటి రెడ్డి’.. నిన్న మొన్నటి వరకూ అయితే ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలీదు. ఎందుకంటే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు.. ఆయన ‘గాలి’ వారసుడు సినిమాల్లోకి వస్తున్నాడని అయితే తెలుసు అంతే! కిరిటీ రెడ్డి హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన చిత్రం ‘జూనియర్’. ఎస్ ఎస్ రాజమౌళి సన్నిహితమైన వారాహీ చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని రాధాకృష్ణ డైరెక్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఓ కొత్త హీరో సినిమాకు ఈ రేంజ్ లో పబ్లిసిటీ రాలేదు. వైరల్ వయ్యారి శ్రీలీల కథానాయికగా.. జెనీలియా మరో ముఖ్యపాత్రలో నటించిన ‘జూనియర్’ చిత్రంపై అంచనాలు పెరిగాయి. పైగా రాజమౌళి కూడా సాయి కొర్రపాటితో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ సినిమాకు తన వంతు ప్రచారం నిర్వహించారు. మరి రాజమౌళి ప్రచారం కొత్త హీరో కిరిటీకి హిట్ తీసుకొచ్చిందా లేదా అనేది ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ:
విజయనగరం అనే ఊరిలో ఉండే ఓ మధ్యతరగతి కి చెందిన కోదండపాణి (వీ రవిచంద్రన్), శ్యామల దంపతులు లేటు వయసులో తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే గుడ్ న్యూస్ వింటారు. అయితే పల్లెటూరు కావడంతో ఊరిలో ఉన్నవాళ్లంతా ఈ వయసులో పిల్లలేంటి అంటూ వెటకారాలు ఆడతారు. రోజురోజుకీ ఆ వెటకారం కాస్తా దెప్పిపొడుపులా మారుతుంది. ఇక ఇవి తట్టుకోలేక పుట్టి పెరిగిన ఊరు వదిలేసి వేరే ఎక్కడికైనా వెళ్లిపోదామని గర్భంతో ఉన్న తన భార్యని తీసుకొని బస్సు ఎక్కుతాడు కోదండపాణి. అయితే అనుకోకుండా అదే బస్సులో ప్రసవం అయి బిడ్డని తన చేతిలో పెట్టి కోదండపాణి భార్య చనిపోతుంది. ఆ రోజు నుంచి తన కొడుకు అభి (కిరీటి రెడ్డి)ని అన్నీ తానై అమ్మలా లాలించి ఎలాంటి లోటు లేకుండా పెంచుతాడు కోదండపాణి. అభి పెద్దయ్యాక మనకంటూ కొన్ని తీపి జ్ఞాపకాలు ఉండాలనేది అతి కోరిక.
ఈ నేపథ్యంలో కాలేజ రోజుల్లో తన తోటి స్నేహితులతో కలిసి జీవితాన్ని ఆస్వాదిస్తాడు. ఈ క్రమంలో తను ప్రేమించిన అమ్మాయి స్పూర్తి (శ్రీలీల) పనిచేసే సంస్థలోనే జాబ్ సంపాదిస్తాడు. కానీ అక్కడ బాస్ అయిన విజయ సౌజన్య (జెనీలియా)కి అభికి కొన్ని విషయాల్లో తేడాలొస్తాయి. అభి అంటే ఆమెకు పడదు. అలాగే ఆమెకు తను పుట్టిన విజయనగరం అంటే కూడా ఇష్టం ఉండదు. ఓ సందర్భంలో తనకు అంత లైక్ చేయని అభితో కలిసి తనకు ఇష్టం లేని విజయనగరానికి రావాల్సి వస్తుంది. అసలు విజయ సౌజన్య కు విజయనగరానికి ఉన్న సంబంధం ఏమిటి.. ? ఆ ఊరిలో అభి తండ్రి అయిన కోదండపాణికి విజయ సౌజన్యకు మధ్య పాత రిలేషన్ ఏమిటి.. ? అభి, విజయ సౌజన్యలు ఒకరికొకరు ఏమవువతారనేదే జూనియర్ మూవీ స్టోరీ.
నటీనటుల హావబావాలు :
హీరో గా పరిచయం అయిన కిరీటీ రెడ్డి కొత్తవాడైన ఎంతో అనుభవం ఉన్న నటుడిగా తెరపై కనిపించాడు. హీరో కావాలనే కసి అతనిలో కనిపించింది. ముఖ్యంగా డాన్సరుల్లో ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేసినట్టు కనిపించింది. స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని చెప్పుకున్న కిరిటీకి మంచి లాంఛింగ్ చిత్రంగా నిలిచింది. అన్నప్రాసన రోజునే ఆవకాయ అన్నం అన్నట్టు తొలి సినిమాలోనే తన మెయిన్ ప్లస్ పాయింట్స్ అయిన డాన్స్, ఫైట్స్ అన్నింట్లో ఇరగదీసాడు. ఈ సినిమా కోసం కిరీటి కష్టపడిన తీరు.. స్క్రీన్‌పై ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించింది. ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో మాత్రం కిరీటి అదరగొట్టేశాడు. ప్రతి సాంగ్‌లోనూ కిరీటి స్టెప్పులకి థియేటర్లో గట్టిగానే రెస్పాన్స్ వస్తుంది. మరీ ముఖ్యంగా వైరల్ వయ్యారి సాంగ్‌లో శ్రీలీలకి గట్టి పోటీ ఇచ్చాడు హీరో. నార్మల్‌గా శ్రీలీల స్టెప్పులేస్తుంటే పక్కనున్న వాళ్లని చూడటం చాలా కష్టమంటూ ఫ్యాన్స్ అంటారు.. కానీ వైరల్ వయ్యారి పాటలో మాత్రం ఎవరిని చూడాలిరా అన్నట్లుగా డ్యాన్స్ చేశాడు కిరీటి. ఇపుడొస్తోన్న కథానాయకులందరూ డాన్సులు, ఫైట్స్ లో ట్రెయిన్ వస్తున్నారు.
రాబోయే రోజుల్లో హీరోగా నిలదొక్కుకోవాలంటే నటన, వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ప్రాధాన్యత ఇస్తే ఇండస్ట్రీకి మరో మంచి హీరో దొరికినట్టే అని చెప్పాలి. హీరోగా కిరిటీకి మంచి భవిష్యత్ వుంది. నటన విషయంలో అక్కడక్కడ తేలిపోయినా.. కొత్త నటుడు చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేసాడు. ఈ సినిమాలో కిస్సిక్ పాప శ్రీలీల నటించడంతో ప్రాజెక్ట్ కి హైప్ పెరిగింది. కేవలం గ్లామర్ పాటలకు తప్ప పెద్దగా నటించిందేమి లేదు. 13 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇచ్చింది జెనీలియా. ఆమె పాత్ర గురించి చెప్పాలంటే ..అల్లరి హాసినిలో ఈ రేంజ్ నటి ఉందా అని చెప్పక తప్పదు. రవిచంద్రన్ నటన గురించి చెప్పాలంటే..ఓ స్టార్ హీరోగా ఇలాంటి పాత్రను అంగీకరించడం గొప్ప విషయమే. రావు రమేశ్ ఉన్నంతలో పర్వాలేదనిపించారు. మిగిలిన ఇక వైవా హర్ష, సత్య, సుమన్ శెట్టి వాళ్ల పాత్రలకి న్యాయం చేశారు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు ఓ సాదాసీదా ఫ్యామిలీ స్టోరీని యాక్షన్ కమ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నాడు. ముఖ్యంగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ సీన్స్ ఇప్పటికే వచ్చిన కొన్ని సూపర్ హిట్ చిత్రాల మాదిరిగానే రొటిన్ గా సాగిపోతుంది. కానీ హీరోతో ఈ సన్నివేశాలను రక్తి కట్టించాడు. ముఖ్యంగా కిరీటీలో మంచి డాన్సర్, ఫైటర్ ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసాడు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే బీజీఎమ్‌తో ప్రేక్షుకుల కళ్లల్లో నీళ్లు తెప్పించగల మ్యాజిక్ డీఎస్పీ సొంతం. జూనియర్‌లో పాటలు అంత ఇంపాక్ట్ (వైరల్ వయ్యారి, క్లైమాక్స్‌లో వచ్చే సాంగ్ మినహా) చూపించకపోయినా బీజీఎం విషయంలో మాత్రం డీఎస్పీ ఇరగదీశారు. ఎమోషనల్ సీన్లకి ఆయన ఇచ్చిన బీజీఎం సినిమాకి మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. ఎడిటర్ ఫస్ట్ ఫ్ తో పాటు సెకండాఫ్ లో ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ పనితనం గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఫ్రేమ్‌లో ఆయన వర్క్ కనిపించింది.
విశ్లేషణ :
ఫస్టాఫ్ మొత్తం హీరోతో పాటు స్నేహితులతో సరదా, సరదా సీన్స్..శ్రీలీలతో లవ్ ట్రాక్ వంటివి రొటిన్ గా అనిపిస్తాయి. స్టూడెంట్ నెంబర్ 1, ఆర్య, దిల్ వంటి సినిమాల తాలూఖ ఛాయలు కనిపిస్తాయి. కానీ ఇంటర్వెల్ బ్లాక్‌తో సినిమా సెకండాఫ్‌కి మంచి అంచనాలతో ప్రేక్షకుడికి స్వాగతం పలికారు. ఆ అంచనాల్ని ఎక్కడా తగ్గించకుండా సెకండాఫ్ ఉంది. ఈ సినిమాకి ప్రధాన బలం ఎమోషన్‌యే. తండ్రి-కొడుకు, తండ్రి-కూతురు మధ్య రాసుకున్న ప్రతి సీన్ చాలా బలంగా స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశారు. ఈ విషయంలో డైరెక్టర్ పనితీరు స్క్రీన్‌పై క్లియర్‌గా కనిపించింది. సెకాండాఫ్ లో హీరో .. విజయ సౌజన్య కంపెనీలో చేరడం.. అక్కడ నుంచి కథను వేరే మలుపు తీసుకున్నాడు దర్శకుడు. సెకండాఫ్ మొత్తం కుటుంబ బంధాలు, అనుబంధాలను ఆవిష్కరించే ప్రయత్నం చేసినా..భావోద్వేగాలు అనుకున్నంత రేంజ్ లో పండలేదు. ఎప్పుడైతే కథ బ్యాక్ డ్రాప్ విలేజ్‌కి వెళ్తుందో అక్కడి నుంచి సినిమా గ్రాఫ్ పెరిగింది.
అయితే అక్కడ జరిగే అభివృద్ధి, టెక్నాలజీ గురించి చెప్పే సీన్లు కొన్ని ‘మహర్షి’ సినిమా రిఫరెన్స్‌ల్లా అనిపించొచ్చు. కానీ ఎక్కడా ఆ ఛాయలు కనిపించకుండా కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. అప్పటివరకూ ఒకరంటే ఒకరికి పడని అభి-విజయల మధ్య దూరం తగ్గడం.. ఇద్దరూ కలిసి ఆ గ్రామ అభివృద్ధి కోసం పని చేయడం.. ఈ సీన్లు అన్నీ థియేటర్లో బాగా వర్కవుట్ అయ్యాయి. తండ్రి తనపై చూపించే అతి ప్రేమ వెనుక ఉన్న అసలు సంగతి తెలిశాక హీరోలో కలిగే ఛేంజ్ కూడా బావుంది. అయితే క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని విధంగా ఇచ్చిన చిన్న ట్విస్ట్ సినిమాకి ప్లస్ అయింది. దర్శకుడు తాను ఎంచుకున్న కథకు ఇంకాస్త మెరుగ్గా తీస్తే ఫలితం ఇంకోలా ఉండేది. సెకండాఫ్ మహర్షి, శ్రీమంతుడు సినిమాలు గుర్తుకు వస్తాయి. కానీ కొత్త హీరోతో ఇలాంటి భావోద్వేగాలతో కూడిన సినిమాను తెరకెక్కించడం దర్శకుడు గట్స్ ను సూచిస్తాయి. ‘జూనియర్’ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కిరీటి రెడ్డి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఓ ప్రామిసింగ్ హీరో అవ్వడం ఖాయం.