HIT:3rd Case: మితిమీరిన హింసతో ‘హిట్ – థర్డ్ కేస్’

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నటినటులు :నాని, శ్రీనిధి శెట్టి, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ తదితరులు
నిర్మాణ సంస్థ : వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్
సినిమాటోగ్రఫీ : సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె మేయర్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
చీఫ్ కో-డైరెక్టర్: వెంకట్ మద్దిరాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
లైన్ ప్రొడ్యూసర్: అభిలాష్ మాంధదపు, నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను
నిడివి : 2 ఘంటల 37 నిముషాలు
విడుదల తేది:01.05.2025
నేచురల్ స్టార్ నాని(Nani) సొంత నిర్మాణంలో వచ్చిన ‘హిట్’ ఫ్రాంచైజీలోని గత చిత్రాలు ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఒక హత్య కేసును చాలా తెలివిగా ఛేదించగలిగే పోలీస్ ఆఫీసర్స్‌గా హిట్, హిట్ 2 చిత్రాల్లోని అడవి శేష్, విశ్వక్ సేన్‌లు కనిపించారు. అయితే హిట్ 3తో నిర్మాతగా కాకుండా ఈసారి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని.. ఈ మూడోకేసు మాత్రం గత చిత్రాల మాదిరిగా ఉండదని, కోర్ట్ సినిమా బాలేకపోతే నా ‘హిట్ 3’ సినిమా చూడొద్దని, ‘హిట్ 3’ సినిమా బాలేకపోతే SSMB మూవీ చూడొద్దు. రాజమౌళిని పక్కన పెట్టుకుని మరీ.. నాని ఈ మాట అనే ధైర్యం చేశారంటే ‘హిట్’3 పై ఎంత నమ్మకం లేకపోతే ఆ స్టేట్‌మెంట్ ఇచ్చాడో? మరి నేడు ఆ నమ్మకం నిజం అయ్యిందో లేదో ఈ విడుదలైన ‘హిట్ – థర్డ్ కేస్’ సినిమా సమీక్షలో చూద్దాం.
కథ:
అర్జున్ సర్కార్ (నాని) స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. కానీ కిరాతకంగా మర్డర్స్ చేసి వాటిని వీడియోలు తీస్తుంటాడు. అలాంటి ఆఫీసర్ ప్రవర్తనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, అతడి పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. అయితే పోలీసులు, ప్రజల ఎరేమీ అనుకొన్నా తన దారిలో తాను ముందుకెళ్తుంటాడు. ఇలాంటి హిస్టరీ ఉన్న ఆఫీసర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ ఆపరేషన్ కోసం సిద్దమవుతాడు. నిబద్దత, అంకితభావం ఉన్న అర్జున్ సర్కార్ ఎందుకు మర్డర్స్ చేస్తుంటాడు? కశ్మీర్‌లో ఎలాంటి ఆపరేషన్స్ చేశాడు? సీటీకే అనే డార్క్ వెబ్ టార్గెట్ ఏంటి? సీటీకేలో అర్జున్ సర్కార్ ఎందుకు చేరాలనుకొంటాడు? సీటీకే అర్జున్ సర్కార్ చేరిన తర్వాత ఏం జరిగింది? డార్క్ వెబ్‌లో భాగమైన అర్జున్ సర్కార్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు. మృదులతో ఎలా ప్రేమలో పడ్డాడు? అసలు మృదుల బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే హిట్3 సినిమా కథ.
నటీనటుల హవాబావాలు:
హీరో నాని క్యారెక్టరైజేషన్. అర్జున్ సర్కార్‌గా నిజంగానే సర్కార్ అనేట్టుగా నటించాడు. జెర్సీ, దసరా, హాయ్ నాన్న, హిట్ 3 ఇలా సినిమా సినిమాకి డిఫరెంట్ కథల్ని ఎంచుకుంటూ.. కథకి తగ్గ కథానాయకుడిగా మారిపోతున్నారు నేచురల్ స్టార్ నాని అర్జున్ సర్కార్ పాత్ర కోసం ప్రాణం పెట్టేశాడు. ఏయ్.. అని అతను అరిచే అరుపు నిజంగానే భయపెట్టింది. అర్జున్ సర్కార్‌గా తనలోని మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్‌కి గట్టిగానే పదునుపెట్టాడు నాని. దెం** .. దెం **.. అంటూ నాని చాలాసార్లు బూతుల్ని మింగేసినా.. ఆ సౌండ్ మాత్రం థియేటర్స్‌లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అర్జున్ సర్కార్‌గా తన క్యారెక్టర్‌కి లిమిటేషన్ ఉండదు అనేట్టుగానే జీవించేశాడు నాని. హీరోయిన్‌తో సహా.. కథలో కనిపించే ప్రతి పాత్రకి ప్రత్యేకించిన పర్పస్ ఉంటుంది. స్క్రీన్‌పై అలంకార ప్రాయమైన పాత్రల్ని కాకుండా.. కథని అవసరం అయ్యే పాత్రలతో ఇంపార్టెన్స్ కల్పించారు.
కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఇంపార్టెన్స్ రోల్ పోలీస్ ఆఫీసర్‌గా కీ రోల్ పోషించింది. యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ భాగం అయ్యింది. నాని-శ్రీనిధిల (Nani and Srinidhi Hero Heroines) మధ్య లవ్ అండ్ ఎమోషన్స్ సీన్స్ బాగా పండాయి. ట్రైన్‌లో వీళ్లిద్దర్నీ కలిపే లిప్ లాక్ సీన్‌కి యూత్ బాగా కనెక్ట్ అవుతుంది. హిట్ 2 హీరో అడవి శేష్.. ఎంట్రీ సర్ ప్రైజ్‌గా అనిపిస్తుంది కానీ..అతనికి కథలో పెద్దగా ప్రాధాన్యత లేదు. క్లైమాక్స్‌లో వచ్చి విలన్ల ఏరివేత కార్యక్రమంలో భాగం అయ్యాడంతే. ఇక హిట్ సీక్వెన్స్‌లో నాలుగో కేసు ఉండబోతుందని ఏసీపీ వీరప్పన్‌గా కార్తిని చూపించారు. ఈ హిట్ 3కి కార్తీకి ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ కామియో రోల్‌కి మాత్రమే పరిమితం అయ్యారు కార్తి. పోలీస్ అధికారులుగా.. రావు రమేష్, చైతన్య జొన్నలగడ్డ, కోమలి ప్రసాద్(Rao Ramesh, Chaitanya Jonnalagadda, Komali Prasad) ఇంపార్టెన్స్ రోల్స్‌లో కనిపించారు. క్యారెక్టర్‌కి పెద్దగా ప్రాధాన్యత నానికి తండ్రిగా సముద్రఖని(Samudra Khani) నటించారు.
సాంకేతికవర్గం పనితీరు:
అన్యాయంపై హీరో తిరుగుబాటు.. వృత్తిపరమైన ఆధిపత్యం.. ప్రతి రివేంజ్ కథలోని కామన్ పాయింటే. దర్శకుడు శైలేష్ కొలను(Director Sailesh Kolanu) హిట్ ఫ్రాంచైజీలో గత రెండు చిత్రాలను ఇదే తరహాలో రూపొందించి.. హిట్ 3కి అగ్ర స్తాయి వయొలెన్స్‌ని డిఫరెంట్ ట్రీట్‌మెంట్ జోడించారు. ‘ఆపదలో ఉన్న వాళ్లను రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు’ అంటూ చాగంటితో ప్రవచనాలు చెప్పిస్తూ.. హీరోతో ఊచకోత కోయించాడు. సాన్ జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి, మిక్కి జే మేయర్ బీజీఎం, రెండు పాటలు హైలెట్. కశ్మీర్, రాజస్థాన్‌లో చిత్రీకరించిన ఛేజింగ్ సీన్లు బాగున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లో కొన్ని సన్నివేశాలకు ఉపయోగించిన లైటింగ్‌తో విజువల్స్ వండర్‌పుల్‌గా అనిపిస్తాయి. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ పనితనం బాగుంది. కానీ సెకండాఫ్‌లో ఇంకా కొన్ని కత్తెర్లు పడి ఉంటే.. సినిమా మరింతగా ఫీల్ గుడ్‌గా మారే అవకాశం ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. హిట్ ఫ్రాంచైజీలో మిగితా రెండింటితో పోల్చుకొంటే.. హిట్ 3 ప్రొడక్షన్ వైజ్‌గా గ్రాండ్‌గా ఉంది.
విశ్లేషణ :
అర్జున్ సర్కార్ చేసిన నేరంతో కథ మొదలౌతుంది. అది నేరమా? లేదంటే నేరం చేసిన వాళ్లకి విధించే శిక్షా? అన్న కథాగమనంలో ట్విస్ట్‌లు.. ట్రిగ్గర్ పాయింట్‌లు చాలానే ఉన్నాయి. అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నానిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు దర్శకుడు. మితిమీరిన హింసతో కూడిన రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్. చైల్డ్ ఎమోషన్స్‌తో సాగే మర్డర్స్ మిస్టరీ. అయితే నానికి తన కెరీర్‌లో డిఫరెంట్ మూవీ చెప్పవచ్చు.జాన్ విక్, మార్కో లాంటి యాక్షన్,క్రైమ్ థ్రిల్లర్ చూసిన వారికి అంతగా కిక్ ఉండదు. కానీ తెలుగు ఆడియెన్స్‌కు డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. ఫస్టాఫ్ బెటర్‌గా తీర్చిదిద్దిన శైలేష్ సెకండాఫ్‌ను పూర్తి స్థాయిలో రాసుకోలేకపోయాడు. అతిథి పాత్రల వల్ల ఆ లోపం మరుగున పడిపోయింది. ఓవరాల్‌గా యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్, సున్నిత మనస్కులు, చిన్న పిల్లలు ఈ చిత్రాన్ని ఏ మాత్రం ఇష్టపడరు.