రివ్యూ : బుద్ధిలేని బస్తీ బాలరాజు కథ ‘చావు కబురు చల్లగా’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : జీఏ2 పిక్చర్స్,
నటీనటులు : కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం తదితరులు
సంగీతం : జాక్స్ బిజోయ్, సినిమాటోగ్రఫీ : కర్మ్ చావ్లా
ఎడిటర్ : జీ సత్య, నిర్మాత : బన్నీవాసు
దర్శకత్వం : కౌశిక్ పెగళ్లపాటి
విడుదల తేది :19.03.2021.
‘RX100’ సినిమాతో టాలీవుడ్లోకి దూసుకొచ్చిన హీరో కార్తికేయ. ఆ ఒక్క సినిమాతో కార్తికేయ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తొలి నుంచి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే ఈ యంగ్ హీరో ఇటీవల చేసిన ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. RX100 తర్వాత చేసిన ‘హిప్పీ’, ‘గుణ 369’, ’90 ఎంఎల్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘చావు కబురు చల్లగా..’ అనే వెరైటీ టైటిల్, సరి కొత్త మాస్ గెటప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గీతా ఆర్ట్స్ సంస్థ నుండి వస్తున్న చిత్రం కాబట్టి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేశాయి. ఇక మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో హైప్ క్రియేట్ అయింది. ఓ కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కార్తికేయను హిట్ ట్రాక్ ఎక్కించిందా? తొలి ప్రయత్నంలో కౌశిక్ పెగళ్లపాటి ఏ మేరకు ఆకట్టుకున్నాడు? రివ్యూలో చూద్దాం.
కథ :
బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాలను మోసికెళ్లే వ్యాన్ డ్రైవర్. అతనికి చావు తప్ప మరోటి తెలియదు. తండ్రి మంచానికి పరిమితమైన లేవలేని పరిస్థితిలో ఉన్నా.. తల్లి గంగమ్మ (ఆమని) ఇంటి బాధ్యతను మోస్తుంది. మార్కెట్లో మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. బాలరాజు మాత్రం తన జల్సాలను తాను చూసుకుంటుంటాడు. అయితే మల్లిక (లావణ్య త్రిపాఠి) చిన్న వయసులో భర్తను కోల్పోయి బాధలో ఉండగా.. శవాన్ని తన వ్యాన్‌లో తీసుకుని రావడానికి వెళ్లి.. తొలిచూపులోనే మల్లిక ప్రేమలో పడతాడు బాలరాజు. ఇతని పోకిరి వేషాలతో మల్లికను ఇబ్బందులు పెడుతూ ఆమె వెంటపడుతుంటాడు బాలరాజు. మల్లిక తన భర్త ఆలోచనల నుంచి బయటకు రాలేక.. తన వెంటపడుతున్న బాలరాజుని అసహ్యించుకుంటుంది. కట్ చేస్తే.. టీవీలు రిపేరు చేసే మోహన్(శ్రీకాంత్ అయ్యంగార్)తో గంగమ్మ చనువుగా ఉండటం చూసి బాలరాజు బాధపడతాడు. ఈ వయసులో తన తల్లి మరో వ్యక్తితో వివాహయేతర సంబంధం కొనసాగించడం నచ్చక తల్లిపై కోపం పెంచుకుంటాడు. తన తల్లి కంటే భర్తను కోల్పోయిన మల్లిక చాలా గొప్పది అని భావిస్తాడు. బ్రతుకు, చావు, పెళ్లి, ప్రేమ నేపథ్యంలో వీరిద్దరి మధ్య దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆ తల్లి వేరే వ్యక్తితో ఎందుకు చనువుగా ఉంటుంది? ఆమె ఏమైంది? బాలరాజు ప్రేమ కథకు ఆమెకు లింక్ ఏంటి? అన్నదే మిగతా కథ.
నటి నటుల హావభావాలు :
ఈ చిత్రంలో అవుట్ అండ్ అవుట్ కార్తికేయ రోల్ గుర్తుండి పోతుంది. బస్తీ యువకుడిలా సూపర్బ్ మాస్ పెర్ఫామెన్స్ ను కనబరిచాడు. పూర్తిగా అలాంటి రోల్ కు ఏం కావాలో అందులో లీనమయ్యి సాలిడ్ లుక్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే ముందు సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో అతని నటన మరింత బెటర్ చేసే స్కోప్ వచ్చింది దీనితో దాన్ని బాగా వినియోగించుకొని ది బెస్ట్ ఇచ్చాడు. ముఖ్యంగా అతని డైలాగ్ డెలివరీ, మురళీ శర్మ తో కామెడీ టైమింగ్ కానీ ఎమోషన్స్ వీటితో పాటు క్లైమాక్స్ లో కనబరిచిన నటనలతో ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్ గా నిలిచాడు. మరి లావణ్య త్రిపాఠి పాత్ర విషయానికొస్తే… కార్తికేయ వలె ఆమెకు కూడా ఇది ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని లాంటి డీ గ్లామ్ రోల్ అటెంప్ట్ చెయ్యడం గొప్ప విషయం. చాలా సింపుల్ లుక్స్ తో కనిపించడం వలన ఆమె నటనలో కూడా మరింత సహజత్వం కనిపిస్తుంది. ఎమోషన్స్, తన బాడీ లాంగ్వేజ్ మరియు కొన్ని కీలక సన్నివేశాల్లో తన పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకుంది. వీరితో పాటుగా ఈ చిత్రంతో చాలా కాలం అనంతరం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమని మంచి రోల్ లో కనిపించారు. కార్తికేయ తల్లిగా తనకు తగ్గ పాత్రను ఎంచుకొని నీట్ అండ్ క్లీన్ పెర్ఫామెన్స్ ను చూపించారు. మురళీ శర్మ.. హీరోయిన్ మామ పాత్రలో ఆకట్టుకున్నారు. ఇంకా ఇతర పాత్రల్లో కనిపించిన భద్రం, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు తమ నటన కనబరిచారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ముఖ్యంగా టెక్నీకల్ టీం విషయానికొస్తే…. సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ఇచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి వాటి వల్ల సినిమా మరింత ఇంపాక్ట్ గా అనిపిస్తుంది. అలాగే డైలాగ్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. కర్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ ఈ సినిమా నేపథ్యానికి కావాల్సిన సహజత్వాన్ని చూపిస్తుంది. ఎడిటింగ్ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇక యువ దర్శకుడు కౌశిక్ విషయానికి వస్తే.. తన మొదటి ప్రయత్నాన్ని మెచ్చుకొవాలి. ఓ డిఫరెంట్ పాయింట్ వున్న కథను ఎంచుకోడమే కాకుండా ఆర్టిస్టుల నుండి ఎమోషన్స్ రాబట్టడంలో అనుభవమున్న దర్శకుడిగా అనిపించాడు. ఆల్రెడీ పెళ్లి ఏజ్ ఉన్న కొడుకు ఉన్న తల్లికి మళ్ళీ పెళ్లి చెయ్యడం అనే సున్నితమైన అంశాన్ని బాగా హ్యాండిల్ చెయ్యడం చాలా బాగా డీల్ చేసాడు. కాకపోతే మెయిన్ లీడ్ మీద రాసుకున్న లవ్ స్టోరీని ఇంకా బెటర్ గా తీసి ఉంటే బాగుండేది. ఈ విషయంలో కథనం బాగా రాసుకొని ఉంటే బాగుండేది. అలాగే కొన్ని రొటీన్ సన్నివేశాలను తగ్గించి ఉండాల్సింది. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కానీ సాంకేతిక వర్గ పనితనం కానీ చాలా నీట్ గా ఉంటాయి.
విశ్లేషణ:
చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి రోజు బాధపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భర్తను కోల్పోయిన మహిళలు అయితే ఇక తమ జీవితం ఇంతే అనుకుంటూ అదే బాధలో ఉంటారు. కానీ అదే జీవితం కాదు. పోయినవారిని ఎలాగో తీసుకురాలేము. ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలి. ఇదే విషయాన్ని ‘చావు కబురు చల్లగా’సినిమాతో చెప్పాలనుకున్నాడు దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి. “నీ రంకు నాకు నచ్చడం లేదని” కొడుకు తల్లిని నిలదీయడం ద్వారా హీరోయిజంలో పసలేకుండా పోయింది. ఇక “కొడుకు ప్రేమను ఇవ్వగలను తప్పితే.. మొగుడు ప్రేమను ఇవ్వలేనుగా” అని తల్లి కొడుకుతో చెప్పే డైలాగ్ లాంటివి ప్రేక్షకుకు జీర్ణించుకోలేక పోతాడు. ఇలాంటి డైలాగ్‌లు సినిమాలో చాలానే ఉన్నాయి. ఇక సినిమా కథలో బలమున్నా..స్క్రీన్‌ప్లేను శక్తివంతంగా రాసుకోలేకపోయాడు దర్శకుడు. స్ర్కీన్‌ప్లే రొటీన్‌గా సాగుతుంది. స్క్రీన్‌ప్లే బలంగా రాసుకుని ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. ఫస్టాఫ్ అంతా రోటీన్ కామెడీతో నడిపించి ప్రేక్షకుడికి సహనానికి పరీక్ష పెట్టాడు. బాలరాజు మల్లిక వెనుకపడే సన్నివేశాలు కూడా నత్తనడకగా, రొటీన్‌గా అనిపిస్తాయి. ఇక సెకండాఫ్ మాత్రం పర్వాలేదనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్లు బాగా పండించారు. అలాగే భర్తను కోల్పోయిన యువతని హీరో ప్రేమించడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. మరి ఈ చిత్రంపై ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే బాగుంది అనిపిస్తుంది.






