Bhairavam Review: మాస్ మసాలా ‘భైరవం’

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్త : శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నటినటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై
సినిమాటోగ్రాఫర్: హరి కె వేదాంతం, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, సంగీతం: శ్రీ చరణ్ పాకాల
మాటలు : సత్యర్షి, తూమ్ వెంకట్
పాటలు : భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి
ఫైట్ మాస్టర్స్: రామకృష్ణ, నటరాజ్ మాడిగొండ
సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గడ (పెన్ స్టూడియోస్)
నిర్మాత: కె కె రాధామోహన్
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: విజయ్ కనకమేడల
విడుదల తేది :30.05.2025
నిడివి : 2 ఘంటల 30 నిముషాలు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్,(Bellamkonda Sai Srinivas, Manchu Manoj, and Nara Rohith Combi) మంచు మనోజ్, నారా రోహిత్ వీరు ముగ్గురి చిత్రాలు వచ్చి చాల కాలం అయ్యింది అలాంటిది ఈ ముగ్గురు కలిసిన కాంబినేషన్ లో మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల (Vijay Kanakamedala)దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ (KK Radha Mohan)నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పించారు. ఈ సమ్మర్ లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ఈ రోజు విడుదల అయ్యింది. మరి ఈ మూవీతో ముగ్గురు హీరోలు మళ్లీ ట్రాక్ ఎక్కుతారా? లేదా? అన్నది ఈ సినిమా సమీక్షలో చూద్దాం.
కథ :
తూర్పు గోదావరి జిల్లా లోని దేవీ పురంలో వారాహి అమ్మవారి దేవాలయానికి ధర్మకర్త నాగరత్నమ్మ (జయసుధ) ఉంటారు. ఆమె మనవడు గజపతి వర్మ (మంచు మనోజ్), అతని స్నేహితుడు వరద(నారా రోహిత్) కలిసి మెలిసి ఉంటాడు. గజపతి వర్మకు నమ్మిన బంటు శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్). వీరు ముగ్గురినీ సమానంగా పెంచుతుంది. మంత్రి విదురపల్లి (శరత్ లోహితశ్వ)కి వారాహి అమ్మవారి ఆలయ భూముల మీద కన్ను పడుతుంది. వెయ్యి కోట్ల విలువైన ఆ భూమిని కాజేయాలని ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత నాగరత్నమ్మ మరణం తర్వాత ఆ దేవాలయం ట్రస్టీగా శ్రీనుని ట్రస్టీగా నిలబెట్టి గెలిపిస్తారు. ఈ క్రమంలో మంత్రి నాగరాజు (అజయ్) సాయం తీసుకుంటాడు. ఈ స్కాంలోకి సీఐ పార్థ సారథి (సంపత్)ని లాగుతారు. ఇక వీరి కుట్రతో గజపతి, వరద మధ్య దూరం ఎలా పెరుగుతుంది? గజపతి భార్య నీలిమ (ఆనంది), వరద భార్య పూర్ణిమ (దివ్యా పిళ్లై), శ్రీనుని ప్రేమించే వెన్నెల (అదితీ శంకర్) పాత్రల ప్రాముఖ్యం ఏంటి?చివరకు శ్రీను ఎవరి వైపు నిలబడతాడు? నమ్మిన బంటుగానే ఉంటాడా? ధర్మం వైపు నిలబడతాడా? అన్నదే కథ.
నటీనటుల హవబావాలు:
నటన పరంగా చెప్పుకోవాల్సి వస్తే ముందుగా మంచు మనోజ్ గురించి చెప్పుకోవాలి. మంచు మనోజ్‌లోని మరో కోణాన్ని ఇందులో ఆవిష్కరించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న గజపతి పాత్రను మంచు మనోజ్ అవలీలగా పోషించేశాడు. నారా రోహిత్ పాత్ర హుందాగా ఉంటుంది. బెల్లంకొండ శ్రీను తన నట విశ్వరూపాన్ని చూపించేస్తాడు. హీరోయిన్లలో ఆనంది, దివ్యా పిళ్లై పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక అదితీ శంకర్ పాత్ర అయితే రొటీన్ కమర్షియల్ హీరోయిన్‌లా అనిపిస్తుంది. అజయ్ కారెక్టర్, సందీప్ రాజ్ పాత్రలు బాగుంటాయి. జయసుధ, గోపరాజు రమణ, ఇనయ సుల్తానా, టెంపర్ వంశీ, సంపత్, శరత్, వెన్నెల కిషోర్ ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి.
సాంకేతికవర్గం పనితీరు :
సాంకేతికంగా భైరవం మూవీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. విజువల్స్ గ్రాండియర్‌గా ఉంటాయి. ముగ్గురు హీరోలకు మూడు రకాల థీమ్స్‌ను అదరగొట్టేశాడు. సాంగ్స్ వినడానికి, చూడటానికి బాగుంటాయి. కానీ కథలో మాత్రం అడ్డు పడినట్టుగా అనిపిస్తుంది. ఇక మాటలు కొన్ని చోట్ల మెప్పిస్తాయి. వరదను దాటి చేయడు.. దాచి మాట్లాడడు.. మనలో మనకే జరిగే కురుక్షేత్రం అంటూ రాసిన కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ బాగుంటుంది. నిర్మాణ పరంగా భైరవం చాలా రిచ్‌గా ఉంటుంది. ఎక్కడా కూడా రీమేక్ మూవీ అన్నట్టుగా కనిపించదు. దర్శకుడు విజయ్ కనకమేడల కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అందించిన పాటలు ఓకే ఆర్ఆర్ అదిరిపోతుంది. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది.
విశ్లేషణ :
భైరవం సినిమా తమిళ చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. సూరి, శశి కుమార్, ఉన్ని ముకుందన్ కలిసి చేసిన ‘గరుడాన్’ మూవీని తెలుగులోకి విజయ్ కనకమేడల రీమేక్ చేశాడు. అక్కడ సూరి పోషించిన పాత్రను ఇక్కడ బెల్లంకొండ శ్రీను, శశి కుమార్ పోషించిన పాత్రను నారా రోహిత్, ఉన్ని ముకుందన్ వేసిన పాత్రను ఇక్కడ మనోజ్ పోషించారు. విజయ్ కనకమేడల చాలా వరకు చిన్న చిన్న మార్పుల్ని చేశారు. అలా చివరకు ఈ భైరవం ముగ్గురు హీరోల కథ అన్నట్టుగా మారింది. కానీ గరుడాన్ మాత్రం మూడు పాత్రల చుట్టూ తిరిగే కథగా అనిపిస్తుంది. మాస్ ఆడియెన్స్‌కు నచ్చేలా హీరోల ఎంట్రీని పెట్టాడు విజయ్ కనకమేడల. తమిళంలో ఒరిజినల్ సినిమా చూడని వారు కనుక ఈ భైరవం మూవీని చూస్తే కాస్త బెటర్‌గా ఫీల్ అవుతారు. ఓవర్అల్ గా ‘మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్’ ల నటన, యాక్షన్ సీన్స్ మరియు వారాహి అమ్మవారి ట్రాక్ బాగున్నాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోకపోయినా, ఇందులోని పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ మరియు ఎమోషన్స్ యాక్షన్ ప్రియులను మాత్రం ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి.