రివ్యూ : భాగమతి

కేంద్రమంత్రి దగ్గర ఇంతకాలం ఎందుకు పనిచేశావ్? ఏదైనా ఆశించావా? అన్న ప్రశ్న ఎదురైనప్పుడు.. ఆయనలోని నిజాయితీ. మంచితనం అంటుంది చంచల (అనుష్క). పాడుపబడిన బంగ్లాలో సి.బి.ఐ. అధికారిణి ఆశాశరత్ ఆమెను రహస్యంగా విచారిస్తున్న క్రమంలో ‘ఎవడు పడితే వాడు వచ్చి పోవడానికి ఇదేమైనా పశులు దొడ్డా భాగమతి అడ్డా..’ అంటూ రియాక్ట్ అవుతుంది. ఆ బంగ్లాలో ఉన్న భాగమతి ఆమెను పూనినట్లు చిందులేస్తుంది. ఓ మహిళా గౌవరం, నిజాయితీ ఆమె పనిచేసిన చోటును ప్రభావితం చేస్తాయనే అంశంతో ముడిపడిన కథ ఇది. ఈ చిత్ర దర్శకుడు గతంలో ‘పిల్లజమిందార్’ ‘సుకుమారుడు’ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అనుష్కను టైటిల్ రోల్‌గా ఎన్నుకుని ఆమె కోసం చాలాకాలం వేచిచూసి తీసిన సినిమా ఇది. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. ఈ శుక్రవారమే విడుదలైంది.
‘భాగమతి’ సినిమా ఒక మహిళా ఐఎస్ అధికారిణి చతురత్వానికి, వీరత్వానికి గొప్ప ప్రతీక అనీ, ఇది కల్పన చిత్రమేనని ముందుగానే చెప్పాడు దర్శకుడు అశోక్. చివరికి తనను తాను నిజాయితీగా నిరూపించుకునే క్రమంలో చూసిందంతా కల్పనేననీ, ఇదంతా వాస్తవం కాదు అంటూ ముగింపు ఇవ్వడం నిజంగా సాహసమే. భయపెట్టడానికి దెయ్యం ఉందనేలా భ్రమింపజేయవచ్చు. కానీ అదంతా కట్టు కథంటూ ప్రేక్షకుల్ని తెలివిగా మోసం చేయడం విశేషం.
కథ :
ప్రజలకు మంచి జరగాలంటే అందుకోసం జరిగే ఎటువంటి మార్పుకైనా తాను ముందుంటాననీ, అవసరమైతే రాజకీయ సన్యాసం చేస్తాననే కేంద్రమంత్రి ఈశ్వర్ ప్రసాద్ (జయరామ్) అంటాడు. అప్పటికప్పుడు ఓ సాదాసీదా రైతు బిడ్డను తన రాజకీయవారసుడిగా పబ్లిక్‌లో ప్రకటిస్తాడు. ఇలాంటి వ్యక్తి సి.ఎం. పదవికోసమే చేస్తున్నాడనే భావించిన అధిష్టానం.. సిబిఐ సహకారం కోరి అతనిపై మచ్చ వేయాలని ఆజ్ఞాపిస్తుంది. అందుకు అధికారిణి వైష్ణవి నటరాజన్ (ఆశాశరత్) రంగంలోకి దింపుతుంది. అందుకు హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న చంచల (అనుష్క)ను టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఈశ్వర్ ప్రసాద్ ప్రతి కదలికిను తెలిసిన పర్సనల్ సెక్రటరీ చంచల. ఎసీపీ మురళీశర్మ సహకారంతో ఊరికి దూరంగా ఉన్న పాడుపడిన బంగ్లాలో రహస్యంగా విచారణ చేస్తుంది. పగలు తప్ప రాత్రిళ్ళు ఎవ్వరూ ఉండని ఆ చోట చంచలను ఒంటగిరిగా బంగ్లాలో పెట్టి తాళం వేస్తారు. బయట ఇద్దరు పోలీసులు కాపలా ఉంటారు. రాత్రిళ్ళు లోపల ఏవోవే వింతశబ్దాలు వస్తున్నాయనీ, చంచల భయంతో అరుస్తుందని చెప్పినా అధికారులు వినరు. అలాంటి సమయంలో చంచలను ఓ రాత్రి చంపాలను ఎసిపి బంగ్లాలోకి ప్రవేశిస్తాడు. అక్కడ అతను భయంకరమైన అనుభవాన్ని రుచిచూస్తాడు. తనెందుకు చంచలను చంపాలనుకున్నాడు? అనంతరం సిబిఐ అధికారిణి ఏం చేసింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ట్రైలర్ చూస్తే ఇదొక హార్రర్ థ్రిల్లర్ అనే అనుకుంటాం. ఆ విషయంలో అంచనాలు పెట్టుకుని వెళ్తాం. ముఖ్యంగా ‘ఇది భాగమతి అడ్డా..’ అంటూ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన డైలాగ్ అంచానాలు పెంచింది. ఈ సినిమా చూస్తున్నంతసేపూ ఇది అంచనాలకు తగ్గ సినిమానే అనిపిస్తుంది. భయపెడుతుంది.. ఉత్కంఠ రేకెత్తిస్తుంది.. కానీ రెండో సగంలో మాత్రం మనకు భిన్నమైన సినిమా చూపిస్తారు. అనుకున్నదానికి భిన్నంగా ఉంటుంది. చివరికొచ్చేసరికి సినిమాలోని పాత్రల్లాగే మనం కూడా ఫూల్స్ అయిపోయామే అన్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. చివర్లో ఒక ట్విస్టు ఇచ్చి ప్రేక్షకుల్ని ఏమార్చడం కొత్తేమీ కాదు. కానీ ఆ ట్విస్టు ప్రేక్షకులను డిఫెన్స్‌లో పడేస్తుంది. సరిగ్గా ఇలాంటి మోసంతోనే ‘పిజ్జా’ వచ్చింది. ‘భాగమతి’ కొంచెం అలాంటి భావనే కలిగిస్తుంది. కాకపోతే కథాకథనాల విషయంలో దర్శకుడి ప్రయత్నం వల్ల, చక్కటి నిర్మాణ విలువలు, సాంకేతిక హంగులు ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా ఒడుదొడుకులు ఉన్నా ఫర్వాలేదనిపిస్తుంది. కథనంలో వచ్చే ట్విస్టు ఆసక్తికరమే కానీ హార్రర్ థ్రిల్లర్ అనుకున్న ‘భాగమతి కాస్తా.. పొలిటికల్ థ్రిల్లర్ జానర్లోకి వెళ్లిపోతుంది. ఈ కథలో ఫ్లాష్‌బ్యాక్‌లతో కలిపి మూడునాలుగు ఉపకథలుంటాయి. అవేంటో తెలియడానికి దాదాపు రెండు గంటలు ఎదురు చూడాల్సి వస్తుంది.
ఈ క్రమంలో కొంత అసహనం కూడా కలుగుతుంది. ప్రేక్షకుల్ని చివరిదాకా సస్పెన్స్‌లోనే ఉంచాలన్న ఉద్దేశం దర్శకుడు ఆ ఉపకథలను వేటినీ ఒకేసారి చెప్పేయడు. గతాన్ని.. వర్తమానాన్ని మార్చి మార్చి చూపిస్తూ కొంచెం కొంచెంగా విషయం వెల్లడయ్యేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. సినిమా మొదలైన 20 నిమిషాలకే వ్యవహారం భాగమతి బంగ్లాకు మళ్లుతుంది. అక్కడ ప్రతి హార్రర్ సినిమాలో మాదిరే.. విచిత్రమైన శబ్దాలు.. ఉలిక్కి పడేలా చేసే దృశ్యాలు…అనుమానాలతో సన్నివేశాలు నడుస్తాయి. జయరాం పోషించిన మంత్రి పాత్ర.. ఆయన నటన భిన్నంగా ఉండి ఆసక్తి రేకెత్తిస్తాయి. ‘భాగమతి’లోని మలుపులు కొత్తగా అనిపిస్తాయి. ఆ మలుపులే ఈ సినిమాకు బలం, బలహీనత. భాగమతి అనే పాత్రకు ఒక ఫ్లాష్ బ్యాక్ అదీ పెట్టి ప్రేక్షకుడి అంచనాకు తగ్గట్లుగా నడిపించి ఉంటే సినిమా రొటీన్ అయ్యేదేమో. కానీ అంచనాలకు భిన్నంగా మరో రకంగా ఈ కథను నడిపించారు. అదే ఇందులో కొత్తదనం. కానీ ఆ మలుపు తర్వాత నడిచే వ్యవహారం మాత్రం రొటీన్ అనిపిస్తుంది.
‘అరుంధతి’.. ‘రుద్రమదేవి’ తరహాలోనే ‘భాగమతి’ కూడా అనుష్కకు ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇలాంటి పాత్రలకు అనుష్కే చేయగలదనిపించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటుంది. రౌద్రం చూపించే సన్నివేశంలో మెప్పించింది. కథలో కీలకమైన పాత్రలో మలయాళ నటుడు జయరాం తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఉన్ని ముకుందన్ పాత్ర చిన్నదే అయినా చక్కటి నటనతో తన పాత్రను గుర్తుంచుకునేలా చేశాడు. ఆశా శరత్ నటన కూడా బాగుంది. మురళీ శర్మ పాత్రకు తగ్గట్లు నటించాడు. విద్యుల్లేఖ, ప్రభాస్ శీను, ధన్ రాజ్ కొంత మేర నవ్వించారు.
సాంకేతిక విలువలు కథకు జీవంపోశాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌కు తగ్గట్టుగా సినిమా రిచ్‌గా తెరకెక్కింది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ భాగమతి బంగ్లాను తీర్చిదిద్దిన తీరు అమోఘం. సగానికి పైగా కథ ఈ బంగ్లాలోనే నడిచినా.. మొనాటనీ రాకుండా చేయడంలో ఆర్ట్ డైరెక్టర్.. సినిమాటోగ్రాఫర్ పనితనం కనిపిస్తుంది. ఛాయాగ్రాహకుడు మది హార్రర్ సినిమాల్లో ఇంతకుముందు చూడని లైటింగ్స్.. థీమ్స్‌తో సినిమాకు డిఫరెంట్ లుక్ తీసుకొచ్చాడు. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. దర్శకుడు జి.అశోక్ ఇప్పటిదాకా తీసిన మూడు సినిమాలతో పోలిస్తే పూర్తి భిన్నంగా చేశాడు. చాలా లేయర్స్ ఉన్న కథను ఎంచుకుని భిన్నమైన స్క్రీన్ ప్లేతో చెప్పే ప్రయత్నం చేశాడు. ఐతే కథనంలో ఉండాల్సింతన బిగి లేదు. నిజంగా భాగమతి ఉందన్నట్లు ముగింపిస్తే సినిమా మరో ఎత్తుకు వెళ్లేది.
రిపోర్టరు : సుబ్రహ్మణ్యం