Arjun S/O Vyjayanthi: ఆకట్టుకోని ‘అర్జున్ S/O వైజయంతి’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్తలు : అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా….
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సయి మంజ్రేకర్,
శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ : రామ్ ప్రసాద్, ఎడిటర్: తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి, యాక్షన్: రామకృష్ణ, పీటర్ హెయిన్
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా, సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
విడుదల తేది : 18.04.2025
నిడివి : 2 ఘంటల 20 నిముషాలు
నందమూరి కళ్యాణ్ రామ్, (Kalyan Ram) లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijaya Shanthi) తల్లి కొడుకులుగా, యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ S/O వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి(Director Pradeep Chilukuri) దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా,(Producers Ashok Vardhan Muppa and Sunil Balusu) సునీల్ బలుసు నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి అన్ని విధాలా అధ్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా రోజున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే విజయశాంతి కమ్ బ్యాక్ ఇస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. మరి కళ్యాణ్ రామ్‌కు ఆశించిన హిట్టుని, విజయశాంతికి అదిరిపోయే కమ్ బ్యాక్‌ని ఈ అర్జున్ S/O వైజయంతి సినిమా ఇచ్చిందా? లేదా? అన్నది సమీక్షలో చూద్దాం.
కథ :
వైజయంతి ఐపీఎస్ (విజయశాంతి) నిజాయితీ గల అధికారి. అవినీతిని సహించని, నేరాలు చేసే వాడ్ని క్షమించని పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్ పై అటాక్ చేస్తోంది. అలాంటి వైజయంతీ కొడుకు అర్జున్ (కళ్యాణ్ రామ్) అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని చేయాలనేది ఆమె లక్ష్యం. వైజాగ్ సిటీలో క్రైమ్‌ను అడ్డుకుంటున్నా అనే నెపంతో నేరాలు చేస్తూనే ఉంటాడు. అలా హత్యల మీద హత్యలు చేసుకుంటూ వెళ్తున్న అర్జున్ మీద న్యాయపరంగా పోరాడుతుంది వైజయంతి. అమ్మ కోసం ప్రాణం ఇవ్వడానికి అయినా, తీయడానికి అయినా క్షణం ఆలోచించడు అర్జున్. అలాంటి అర్జున్ క్రిమినల్ అయిన మహంకాళిని మట్టు పెట్టేందుకు పేటలో కాపు కాస్తుంటాడు. మరో వైపు వైజయంతీని హత్య చేయాలని పఠాన్ (సోహైల్ ఖాన్)(Sohel Khan) రెడీగా ఉంటాడు. ఐపీఎస్ కావాల్సిన అర్జున్ ఇలా పేటలో ఓ రౌడీలా ఎందుకు మిగిలిపోతాడు? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు ? మహంకాళిని ఎందుకు చంపాలని అనుకుంటాడు? వైజయంతీని పఠాన్ ఎందుకు హత మార్చాలని అనుకుంటాడు? ఇక తల్లిని కాపాడుకునేందుకు అర్జున్ ఏం చేశాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ (శ్రీకాంత్) (Srikanth)పాత్ర ఏమిటి ? అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్ధం చేసుకుందా ? లేదా ? అన్నదే కథ.
నటీనటుల హవాబావాలు:
విజయశాంతి ఎంట్రీ సీన్ మాత్రం అదిరిపోతుంది. నాటి రోజుల్లోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది. అక్కడ ఓ ఐదారు నిమిషాలు కాస్త లేడీ సూపర్ స్టార్‌ను చూసినట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల విజయశాంతి చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తుందంతే. అర్జున్ లాంటి రొటీన్ మాస్ హీరో పాత్రల్ని పోషించడం, భారీ డైలాగ్స్ చెప్పడం, కొడితే పది మంది ఎగిరిపోయే పాత్రలను పోషించడం కళ్యాణ్ రామ్‌కి కొత్తేమీ కాదు. ఇక ఇందులోనూ కళ్యాణ్ రామ్ ఏ మాత్రం కొత్తగా అనిపించడు. ఈ చిత్రంలో సోహైల్ ఖాన్‌కు ఇచ్చిన బిల్డప్‌కి చూపించిన దానికి పొంతన ఉండదు. ఈ చిత్రంలో సయి మంజ్రేకర్ అనే హీరోయిన్ కూడా వుంది. ఆమె వుందంటే వుంది లేదంటే లేదు.. ఆమెకు ఈ చిత్రం లో ఓ నాలుగైదు సీన్లు.. ఓ పాట ఇచ్చారు. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టుగా ఉంటుంది ఆమె పాత్ర. శ్రీకాంత్ పాత్ర కాస్త పర్వాలేదనిపిస్తుంది. బబ్లూ పృథ్వీ కారెక్టర్, మహంకాళి, పైడితల్లి అనే విలన్ పాత్రలు మరింత రొటీన్‌గా ఉంటాయి.
సాంకేతిక వర్గం పనితీరు:
ప్రదీప్ చిలుకూరి అసలు ఇలాంటి కథతో ఇప్పుడున్న ఆడియెన్స్‌ను ఎలా ఎంగేజ్ చేద్ధమనుకున్నడో ఏమో కాని…..అమ్మ కోసం ఏదైనా చేసే కొడుకు అనే పాయింట్ బాగానే ఉంది. అలా అని ఈ పాయింట్ ఏమీ కొత్తది కాదు. ఈ కాన్సెప్ట్ తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ చిత్రానికి ప్రదీప్ ఎంచుకున్న ఈ పాయింట్ వరకు ఓకే అనిపిస్తుంది. కానీ దాని కోసం అల్లుకున్న కథని, దాని చుట్టూ రాసుకున్న నేపథ్యం చూస్తుంటే.. ఇది ఓ ఇరవై ఏళ్ల క్రితం రావాల్సిన సినిమా అనిపిస్తుంది. మరీ అవుట్ డేటెడ్ కథ. అంతేకాకుండా విజువల్స్, కెమెరా వర్క్ చూస్తే ఓ మూస మూవీ గా అనిపిస్తుంది. ఇక అజనీష్ లోక్‌నాథ్ కొట్టుడే కొట్టుడు బాధుడే బాదుడు సౌండ్ బాగానే ఉంటుంది కానీ ఏదో మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. డైలాగ్స్ కొన్ని చోట్ల ఓవర్ అనిపిస్తుంది. పాటలు మాత్రం బోరింగ్‌గా అనిపిస్తాయి. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
విశ్లేషణ:
ఈ చిత్రానికి క్లైమాక్స్ ఆయువు పట్టు అని, ఇంత వరకు ఇలాంటి క్లైమాక్స్‌తో ఏ సినిమా రాలేదని చాలా చెప్పారు. కానీ అక్కడ అంత ఏమీ ఉండదు. ఇలాంటి మాస్ కమర్షియల్ చిత్రాలకు కథ, లాజిక్స్ ఏమీ లేకపోయినా ఓ ఎమోషన్ అయినా ఉండాలి. అసలు అంత హింస ఎందుకు? అన్ని చిత్రవధలు చేయడం ఎందుకు? అంత పైశాచికం ఎందుకు? అని చాలా చోట్ల అనిపిస్తుంది. అనవసరపు హింసాత్మక సీన్లను చూపించినట్టుగా అనిపిస్తుంది. సినిమా యవతూ వయలెన్స్, యాక్షన్ సీక్వెన్స్ మాత్రం కనిపిస్తాయి.. వాటికి తగ్గ బలమైన సీన్లు, ఎమోషనల్ కనెక్టివిటీ మాత్రం ఏ కోశాన కూడా కనిపించదు. తల్లీకొడుకుల సెంటిమెంట్ కూడా అంతగా మెప్పించదు. ఆ ఇద్దరి మధ్య బలమైన బంధాన్ని చాటే ఒక్క సీన్ కూడా ఉండదు. కొడుకు అలా ఎందుకు మారాడో? అక్కడ జరిగే దారుణ ఘటనల గురించి తల్లి తెలుసుకోలేదా? అన్న చిన్న లాజిక్‌ల గురించి రచయిత ఆలోచించలేదా? ఆలోచించరు ఎందుకంటే ఇది మాస్ మసాలా కమర్షియల్ యాక్షన్ మూవీ. ఇందులో లాజిక్స్ పక్కన పెట్టాలంతే! కొంతలో కొంత వైజయంతీ కాస్త కాపాడే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. పాత కథలు, పాత ఫార్మాట్‌లోనే తీస్తే మరి అభిమానులకైనా నచ్చుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.