రివ్యూ : ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ తక్కువ ప్యాసెంజర్ కి ఎక్కువ
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ 2.5/5
బ్యానెర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వేంకటాద్రి టాకీస్,
నటీనటులు : సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి, అభిజిత్ పూండ్ల, రఘు బాబు, శ్రీ రంజని, సత్యా, రాహుల్ రామకృష్ణ, ఉప్పాడ పార్వతీశం, మహేష్ విట్ల, ఖయ్యుమ్, భూపాల్ రాజు తదితరులు నటించారు.
సంగీతం : హిప్ హాప్ తమిళ
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
సినిమాటోగ్రఫీ : కెవిన్ రాజ్
నిర్మాతలు : టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్
దర్శకత్వం : డెన్నిస్ జీవన్ కనుకొలను
విడుదల తేది : 05.03.2021
యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కొద్ది కాలంగా కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. చాలా కాలం తర్వాత ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో ఓ హిట్ అందుకున్నసందీప్ , ఆ తర్వాత తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ సినిమాతో మళ్లీ ఫ్లాప్ చవిచూశాడు. అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి తో ఉన్న సందీప్.. 2019 లో విడుదలైన సుందర్ సి కుష్బూ నిర్మించిన చిత్రం ‘నట్ పే తుణై’ తమిళ్ చిత్రాన్ని రీమేక్ చేస్తూ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా తో నిర్మాత గా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ ట్రై చేయడం, సౌత్ ఇండియాలోనే హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ మూవీపై పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్, ఆడియో కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున చేయడంతో హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? లావణ్య త్రిపాఠి గ్లామర్ ఈ సినిమాకు ఎంత వరకు తోడైంది? సందీప్ కిషన్ కెరీర్ లో 25వ చిత్రంగా వచ్చిన ఏ1 ఎక్స్‌ప్రెస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథ:
యానాం షాట్స్‌తో సినిమా మొదలవుతుంది. అక్కడ ఉన్న ‘చిట్టిబాబు హాకీ గ్రౌండ్’కి ఒక చరిత్ర ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి ఏడాది కనీసం ఇద్దరైనా జాతీయ జట్టుకు ఎంపికవుతుంటారు. హాకీ కోచ్ మురళీ (మురళీ శర్మ) అక్కడి పేద క్రీడాకారులకు ఉచితంగా కోచింగ్ ఇస్తుంటారు. చిట్టిబాబు గ్రౌండ్ అంటే కోచ్ మురళితో పాటు అక్కడి ప్రజలకు కూడా గుడితో సమానం. అలాంటి గ్రౌండ్‌పై ఓ కంపెనీ కన్ను పడుతుంది. ఆ స్థలంలో మెడికల్ ల్యాబ్‌ని కట్టాలనుకుంటారు. ఇందుకోసం క్రీడాశాఖ మంత్రి రావు రమేశ్(రావు రమేశ్)కి లంచం ఇస్తారు కంపెనీ యజమానులు. దీంతో తన అధికారాన్ని ఉపయోగించిన మంత్రి ఆ క్లబ్‌ని అండర్ ఫర్ఫార్మింగ్ లిస్ట్‌లో వేస్తాడు. మరోవైపు.. నేషనల్ లెవల్ టోర్నమెంట్ గెలిస్తే.. తమ గ్రౌండ్ దక్కించుకోవచ్చని భావించిన కోచ్ మురళి.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు. కట్ చేస్తే… హైదరాబాద్ నుంచి యానాం బంధువుల ఇంటికి వచ్చిన సందీప్ నాయుడు (సందీప్ కిషన్) తొలి చూపులోనే హాకీ ప్లేయర్ లావణ్య(లావణ్య త్రిపాఠి)తో ప్రేమలో పడిపోతాడు. ఆమెకు సహాయం చేసే క్రమంలో హాకీ ఆడతాడు. ఎలాంటి కోచింగ్ లేకుండా హాకీ గేమ్‌ని అద్భుతంగా ఆడిన సందీప్‌ని చూసి అందరూ ఆశ్చర్యపడతారు. అతని ప్లాష్‌బ్యాక్ విని షాకవుతారు. అసలు సందీప్ ఎవరు? అతను హాకీ గేమ్‌ని అంత అద్భుతంగా ఎలా ఆడాడు? చిట్టిబాబు గ్రౌండ్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న కోచ్ మరళికి సందీప్ ఎలా సహాయపడ్డాడు? చివరకి చిట్టిబాబు గ్రౌండ్ ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ.
నటి నటుల హావభావాలు:
ఇక హీరో సందీప్ కిషన్.. హాకీ ప్లేయర్, రోమియోగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కొత్తగా కనిపించాడు. సిక్స్ ప్యాక్‌తో ఫుల్ మేకోవర్‌లో కనిపించాడు. లాంగ్ హెయిర్.. కట్స్ బాడీతో రియల్ హాకీ ప్లేయర్‌గా కనిపించాడు. స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేసేటప్పుడు కచ్చితంగా ఆ ఆ క్రీడలో ప్రావీణ్యం ఉంటే నటించడం ఈజీ అవుతుంది. సందీప్ కిషన్‌కి హాకీ టచ్ ఉండటంతో ఈజీగానే డీల్ చేయగలిగాడు. నేషనల్ హాకీ ప్లేయర్ సందీప్ పాత్రలో సందీప్ కిషన్ ఒదిగిపోయాడు. ఇక హాకీ క్రీడాకారిణిగా త్రిపాఠి తన పరిధి మేరకు ఆకట్టుకుంది. టామ్ బాయ్ రోల్లో మెప్పించారు. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ తర్వాత బాగా పండిన పాత్ర మురళీ శర్మది. హాకీ కోచ్ పాత్రలొ ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. ఒక నిజాయతీగల కోచ్‌కు గేమ్‌పై, గ్రౌండ్‌పై ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమాలో మరళీ శర్మ పాత్ర తెలియజేస్తుంది. ఇక క్రీడాశాఖ మంత్రిగా రావు రమేశ్ జీవించేశాడు. ఒక అవినీతి రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో, స్వార్థం కోసం ప్రజల మధ్య ఎలా చిచ్చు పెట్టిస్తారో కళ్లకుగట్టారు. హీరో స్నేహితులుగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఆకట్టుకున్నారురు. నిడివి తక్కువే అయినా.. వీరిద్దరి పాత్రే సినిమాకు కీలకం. హీరో స్నేహితుడిగా సత్య తనదైన శైలిలో నవ్వించేశాడు. మహేశ్ విట్టా, పొసాని కృష్ణమురళి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక ఈ చిత్రంలో అన్ని పాత్రలూ ఒరిజినల్ పేర్లతోనే ఉంటాయి. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, మురళి శర్మ, పోసాని, రఘుబాబు, ప్రియదర్శి, రాహుల్ రామక్రిష్ణ, మహేష్ విట్టా, సత్య, బిగ్ బాస్ దివి (దివ్య) వీళ్లంతా ఒరిజినల్ పేర్లతోనే కనిపించడం విశేషం.
సాంకేతిక వర్గం పనితీరు:
తొలి సినిమాతోనే ఈ ప్రయోగం చేశాడు దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను. ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్ నుంచి అసలు కథని చూపించాడు. మన దేశంలో ఒక క్రీడాకారుడికి జరుగుతున్న అన్యాయంతో పాటు స్నేహం గొప్పతనాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో దర్శకుడు కొంతవరకే సఫలం అయ్యాడని చెప్పొచ్చు. కాకపోతే ఈ సినిమాలో ఒరిజినల్ వెర్షన్లో కనిపించే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మిస్ అయ్యింది. ఇక సినిమాలో ప్రధాన హైలైట్ కెవిన్ రాజ్ సినిమటోగ్రాఫీ హాకీ గ్రౌండ్ విజివల్స్ బాగా వచ్చాయి. స్టేడియంలో బాల్ని ఫాలో అవుతూ తీసిన ఛేజింగ్ షాట్స్ ఆకట్టుకుంటాయి. చివరి 20 నిమిషాలు తన కెమెరా పనితనాన్ని అద్భుతంగా చూపించాడు కెవిన్. సంగీత దర్శకుడు హిప్హాప్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. లాస్ట్ 20 నిమిషాలు ఆర్ ఆర్ అదిరిపోతుంది. యాంకర్ సుమ, వైవా హర్ష క్లైమాక్స్ మ్యాచ్‌కి కామెంట్రీ ఇచ్చి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. వాళ్లు తెరపై కనిపించకపోయినా.. చివరి 20 నిమిషాలు వారి మాటలు వినిపిస్తూనే ఉంటాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
విశ్లేషణ:
‘చెక్ దే’ సినిమా తర్వాత హాకీ గురించి.. ‘ఒక్కడు’ సినిమా తర్వాత కబడ్డీ గురించి.. ‘సై’ సినిమా తరువాత రగ్బీ గురించి చెప్పుకున్నారు. కానీ.. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా ద్వారా కొందరిలోనైనా ఓ ఆలోచన కలుగుతుందనే నమ్మకం ఉందని అందుకే హాకీ నేపథ్యంలో ఈ ప్రయోగాత్మక చిత్రం నిర్మించడం ఓ సాహసం లాంటిదే! సినిమా స్పోర్ట్స్ బేస్డ్ అయినప్పటికీ కథలో ఎమోషన్ని క్యారీ చేయగలిగారు. హాకీ నేపథ్యంలో.. సీరియస్ మెసేజ్‌తో పాటు లవ్ ట్రాక్, కామెడీ, ఎమోషన్స్ సమపాళ్లలోనే వడ్డించారు కానీ.. ఈ సినిమా చూస్తున్నంత సేపూ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’ సినిమా ఛాయలు వెంటాడుతూ ఉంటాయి. ఆ సినిమా కూడా ఇదే నేపథ్యం కావడంతో కొత్త పాయింట్ చూస్తున్నాం అనే ఫీల్ కలుగకపోవడం మైనస్ అయ్యింది. గేమ్ కంటే లోకల్ పాలిటిక్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టిన భావన కలుగుతుంది. ఇక ప్రత్యర్థి హాకీ టీం కోచ్ రోల్ కూడా అంత స్ట్రాంగ్‌గా ఉండదు. మొత్తంగా A1 ఎక్స్ ప్రెస్ సందీప్ కిషన్ కెరియర్లో మైల్ స్టోన్ మూవీ కాలేకపోవచ్చు కానీ.. .. ఓ మంచి చిత్రంగా అయితే నిలుస్తుంది. స్పోర్ట్ నేపథ్యంలో సినిమాలను ఇష్టపడే వారికి తప్పక నచ్చుతుంది. అయితే సందీప్ కిషన్ కెరియర్లోనే ఇది హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ కావడంతో ఆ బడ్జెట్ రికవరీ అవుతుందనేది ప్రశ్నార్ధకమే! ఎందుకంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు చేస్తారనేది అనుమానమే. ప్యాసెంజర్ కి ఎక్కువ, ఎక్స్ ప్రెస్‌కి తక్కువ అనేట్టుగా ఉంది ఈ సినిమా.






