కంబ్యాక్ కోసం వైవీఎస్ స్ట్రాంగ్ ప్లాన్
సీతయ్య, లాహిరి లాహిరి లాహిరి, దేవదాసు సినిమాలతో ఒకప్పుడు బ్లాక్ బస్టర్లు అందుకున్న వైవీఎస్ చౌదరికి ఆ తర్వాత తీసిన సినిమాలు ఫ్లాపులవడంతో కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత వైవీఎస్ చౌదరి, నందమూరి జానకిరామ్ కొడుకు తారక రామారావును లాంచ్ చేయడం కోసం మెగా ఫోన్ పడుతున్నాడు.
అయితే ఈ సినిమాను వైవీఎస్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఆస్కార్ విన్నర్స్ కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్ గా, చంద్రబోస్ ను లిరిక్ రైటర్ గా తీసుకున్నాడు. హీరోయిన్ గా తెలుగమ్మాయి, డ్యాన్సర్ అయిన వీణారావును సెలెక్ట్ చేశాడు. సినిమా ఏ జానర్లో రానుందనేది చెప్పలేదు కానీ యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో పాటూ ట్రెండీ లవ్‌స్టోరీ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
ఫామ్ లో లేని వైవీఎస్ చౌదరి తన కంబ్యాక్ సినిమాను ఇంత స్ట్రాంగ్ గా సెట్ చేసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎలాగైనా ఈ సినిమాతో మంచి హిట్ అందుకుని మళ్లీ వరుస సినిమాలు చేయాలని వైవీఎస్ గట్టి ప్లానే వేశాడు. ఇవన్నీ చూస్తుంటే బడ్జెట్ కూడా భారీగా పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ పేరుతో తారక్ ఉండగా ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి ఆ పేరుతో రావడం ఫ్యాన్స్ ను అయోమయానికి గురిచేస్తుంది.













