రూపాయి బిజినెస్ చేయని సినిమాకు కోట్లు కురిపించా
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అరంగేట్రం చేసిన సినిమా దేవదాసు. ఆ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 17 సెంటర్స్ లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఒక కొత్త హీరో ఈ ఫీట్ సాధించడమంటే మాటలు కాదు. ఇప్పటివరకు మళ్లీ అది ఎవరికీ కుదరలేదు.
అయితే దేవదాసు సినిమాకు ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ రాలేదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా సక్సెస్ వెనుక చాలా పెద్ద కథే ఉంది. రీసెంట్ గా నందమూరి జానకిరామ్ కొడుకు తారక రామారావు ను లాంచ్ చేసే ఈవెంట్ లో డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించాడు. 2006 జనవరి 11న దేవదాసు రిలీజైంది. సంక్రాంతి టైమ్ కు లవ్ స్టోరీలు ఆడవని తెలిసి కూడా చౌదరి రిస్క్ చేశాడు.
దానికి తోడు సంక్రాంతి పోటీ ఉండటం వల్ల ఈ సినిమా విపరీతంగా నలిగిపోయింది. ఎంత నలిగినా తన సినిమాను హిట్ చేయాల్సిందే అని కంకణం కట్టుకున్న వైవీఎస్ చౌదరి ప్రమోషన్స్ ఆపకుండా థియేటర్లకు వెళ్లి దేవదాసును ప్రమోషన్ చేశాడు. 4 వారాల తర్వాత ఎంతో కష్టం మీద దేవదాసుకు జనం రావడం మొదలుపెట్టారు. ఇక అప్పటినుంచి కలెక్షన్ల వర్షం కురిపించింది ఆ సినిమా. 100 రోజులు దాటినా సరే సినిమా రన్ అవుతూనే ఉంది. ఎన్నో చోట్ల రికార్డులు బ్రేక్ అయాయి. దేవదాసు సినిమా టైమ్ లో రామ్ ఎవరో తెలియకపోవడంతో రూపాయి కూడా బిజినెస్ జరగలేదని, అలాంటి సినిమాకు కోట్ల వసూళ్లు తెచ్చానని చౌదరి తెలిపాడు.













