తమిళనాట ‘జగన్‌ని’నాదం… హీరో విజయ్ సరసన చోటు…
తమ అభిమానం చూపడంలో వైవిధ్యం ద్వారా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు తమిళ హీరోల అభిమానులు. అంత తేలికగా పరభాషా హీరోని కాని పక్క రాష్ట్రంలోని ప్రముఖులను గానీ పొగడరు కూడా. అలాంటి తమిళనాడులో మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోస్టర్లు వెలిశాయి.
తమిళనాడులో రజనీకాంత్ తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న స్టార్‌గా వెలుగొందుతున్న విజయ్… బర్త్‌డే పోస్టర్లలో వైఎస్ జగన్ ప్రత్యక్షమయ్యారు. ఈ నెల 22తో 45ఏళ్ల వయసులో అడుగుపెడుతున్న సందర్భంగా తమ అభిమాన హీరోకి శుభాకాంక్షలు చెబుతూ తమిళనాట పోస్టర్లు అంటించారు విజయ్ ఫ్యాన్స్. ఈ పోస్టర్ల ద్వారా రాజకీయాల్లోకి రావాలంటూ మరోసారి విజయ్‌ని కోరారు.
అంతేకాదు… ఆంధ్ర సిఎం వైఎస్ జగన్లాగా ప్రజలకు మేలు చేసే పాలన ఇవ్వాలని ఆకాంక్షించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌లాగా అవినీతి రహిత పాలన చేయాలని కూడా ఆ పోస్టర్ల ద్వారా కోరుకున్నారు. అయితే వైఎస్ జగన్‌ని విజయ్‌తో కలిపి పోస్టర్లు వేయడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ఇదే తరహాలో వీరిద్దరినీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కలిపి పోస్టర్ అంటించి విజయ్ అభిమానులు సంచలనం సృష్టించారు. గత కొంత కాలంగా వెండితెరపై బాక్సాఫీస్ విజయాలు సాధిస్తున్న విజయ్.. సర్కార్ వంటి చిత్రాల ద్వారా తన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు, అభిమానుల్లో ఆశలు పెంచాడు.













