డైరెక్టర్ గా హిట్ కొట్టేందుకు మరో ప్రయత్నం
కథా రచయితగా సక్సెస్ అయినంత మాత్రాన డైరెక్టర్‌గా కూడా సక్సెస్ అవ్వాలని లేదు. అద్భుతమైన కథలను అందించిన ఎంతో మంది రచయితలు డైరెక్టర్స్‌గా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ట్రై చేసి చేతులు కాల్చుకున్నారు. డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్నే తీసుకుంటే ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలన్నింటికీ ఆయనే రచయిత. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రౌద్రం రణం రుధిరం`(ఆర్ ఆర్ ఆర్) చిత్రానికి కూడా కథ అందించారు విజయేంద్రప్రసాద్. అంతేకాదు హిందీలో సూపర్‌హిట్ సినిమాగా నిలిచిన `భజరంగీ భాయ్‌జాన్` చిత్రానికి కూడా కథ, స్క్రీన్‌ప్లే అందించింది విజయేంద్రప్రసాదే.
ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించే సినిమాలకు కథలు అందించే ఆయనకు దర్శకుడిగా ఒక్క హిట్ కూడా లేదు. విజయేంద్రప్రసాద్ ఇప్పటివరకు అర్థాంగి, శ్రీకృష్ణ 2006, రాజన్న, శ్రీవల్లీ సినిమాలను డైరెక్ట్ చేశారు. వీటిల్లో ఏదీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు. అయితే ఉత్తమ చిత్రంగా `రాజన్న` నంది అవార్డు గెలుచుకుంది. ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలన్నీ రాజమౌళి పర్యవేక్షణలో చిత్రీకరించడం విశేషం. సినిమాలో ఎక్కువ భాగం రాజమౌళి డైరెక్షన్లో తీసారని కూడా అప్పట్లో రూమర్ వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇప్పుడు విజయేంద్రప్రసాద్ మరోసారి మెగా ఫోన్ పట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఒక యంగ్ హీరో కోసం ఒక అద్భుతమైన కథను రెడీ చేశారట. అయితే ఆ యంగ్ హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.













