బాల్‌థాకరే మనవడి సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్న విజయేంద్రపసాద్?
వారసత్వం అనేది అన్ని రంగాల్లో ఉంది. ఒక రంగంలో అభివృద్ధిలోకి వచ్చిన ఎన్నో విజయాలు సాధించిన వారు తమ వారసులు కూడా అదే రంగంలో రాణించాలని, మంచి పేరు తెచ్చుకోవాలని అనుకోవడం సహజం. కానీ, కొంతమంది వారసులు తమ పెద్దవారు పేరు తెచ్చుకున్న రంగంలో కాకుండా ఇతర రంగాలపై ఆసక్తి చూపించడం విశేషం. ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. రాజకీయాల్లో ఆరితేరిన కొంతమంది ముఖ్యమంత్రులు తమ కుమారులను మనవళ్ళను సినిమా రంగంలోకి ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఎన్.టి.రామారావు తనయులు బాలకృష్ణ, హరికృష్ణ హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు.
అయితే ఎన్.టి.ఆర్. మొదటి నుంచి నటుడే కాబట్టి రాజకీయ రంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చి హీరోలైన వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణలను అనలేము. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ `ఓకే ఓకే’ సినిమాతో తమిళ్లోనే కాదు తెలుగులోనూ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ `జాగ్వార్` చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. అయితే ఆ సినిమా పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు తెలుగు దర్శకుడు కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు నిఖిల్ రెడీ అయ్యాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు ప్రధాన పాత్రధారిగా అందరూ పిల్లలతో ‘మాయా బజార్’ సినిమా చెయ్యాలనుకున్నారు. అయితే అది సెట్స్ వరకు వెళ్ళలేదు. ఇక మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ తనయుడు రితేష్ దేశ్‌ముఖ్ 2003లో హీరోగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా, టెలివిజన్ హోస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. శివసేన అధ్యక్షుడు దివంగత బాల్‌థాకరే మనవడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా విశేషం ఏమిటంటే ఒక తెలుగు రచయితతో మంచి స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నారట. అతనెవరో కాదు విజయేంద్రప్రసాద్ అని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలేవీ అధికారికంగా ప్రకటించకపోయినా ఫిలింనగర్లో మాత్రం ఈ వార్త హల్చల్ చేస్తోంది.













