రూ.1.5 లక్షలతో పెళ్లి చేసుకున్న మహేష్ హీరోయిన్
ఇవాళ రేపు పెళ్లి అంటే ఓ భారీ వేడుకగా నిర్వహిస్తున్నారు. జీవితంలో ఒకసారి చేసుకునే వేడుక అంటూ అందరూ డబ్బుని మంచినీళ్లు ఖర్చు పెట్టినట్లు ఖర్చు పెట్టి మరీ గ్రాండ్ గా చేసుకుంటున్నారు. ఎంత మిడిల్ క్లాస్ వాళ్లైనా సరే ఈ రోజుల్లో పెళ్లి చేయాలంటే లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. అలాంటిది ఇక కాస్త రిచ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ల గురించైతే చెప్పనక్కర్లేదు.
ఇలాంటి నేపథ్యంలో ఓ బాలీవుడ్ హీరోయిన్ కేవలం లక్షా యాభై వేల రూపాయల్లో తన పెళ్లి కార్యక్రమం మొత్తాన్ని పూర్తి చేసుకుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, అతిథి సినిమాలో మహేష్ సరసన నటించిన బాలీవుడ్ భామ అమృతా రావు. 2016లో ఆర్జే గా పనిచేసే అన్మోల్ను అమృతా రావు పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లిని ఆమె అందరిలా కాకుండా చాలా సింపుల్ గా చేసుకుంది.
తమ పెళ్లికి అయిన ఖర్చు జస్ట్ రూ.1.5 లక్షలేనని అమృత రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యలో పెళ్లి చేసుకున్న అమృత- అన్మోల్ ఆ లక్షన్నరలోనే పెళ్లి బట్టలు, ఛార్జీలు, ఫంక్షన్ హాలు, భోజనాలు కూడా అరేంజ్ చేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాదు పెళ్లికి ఆమె కట్టుకున్న చీర ఖరీదు కేవలం రూ.3000 అని, మిగిలిన వాటికి కూడా తాము ఎక్కువగా ఖర్చు పెట్టలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఏదైనా సరే ఓ సినీ సెలెబ్రిటీ అయ్యుండి ఇంత సింపుల్గా, ఇంత తక్కువ ఖర్చులో పెళ్లి చేసుకుందంటే ఆశ్చర్యమే మరి.













