ఆ డైరక్టర్ తో విజయ్ సినిమా చేస్తాడా..?
మున్నా సినిమాతో డైరక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వంశీ పైడిపల్లి, ఆ తర్వాత బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి సినిమాలు తీశాడు. 13 ఏళ్ల కెరీర్ లో కేవలం ఐదు సినిమాలే డైరక్ట్ చేసిన వంశీ, మహర్షి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా తన తర్వాతి సినిమా పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమా ఉంటుందనుకున్నారు కానీ అది వర్కవుట్ అవలేదు. స్టార్ డైరక్టర్స్ అందరూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న తరుణంలో వంశీ తర్వాతి సినిమా ఏంటనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది.
ఈ నేపథ్యంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో వంశీ పైడిపల్లి ఒక సినిమా చేయనున్నాడనే వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వంశీ నాలుగు సినిమాలు చేసిన దిల్ రాజు బ్యానర్ లోనే ఈ సినిమా ఉంటుందని, ప్రస్తుతం పూరీ డైరక్షన్ లో చేస్తన్న లైగర్ తర్వాత సుకుమార్, శివ నిర్వాణలతో సినిమాలు ఇప్పటికే కమిట్ అయ్యాడు విజయ్. కానీ లైగర్ ఫినిష్ అయి, సుకుమార్ సినిమా స్టార్ట్ అయ్యే గ్యాప్ లోనే వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందనే టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. మహర్షికి నేషనల్ అవార్డ్ రావడంతో ఇన్నాళ్లూ వంశీని ట్రోల్ చేసిన వాళ్లే ఇప్పుడు ఆయన్ని పొగుడుతున్నారు. ఇదే ఊపులో తదుపరి సినిమా స్టార్ట్ చేస్తే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. మరి పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్న విజయ్, వంశీతో సినిమా చేస్తాడనే వార్తల్లో వాస్తవమెంత అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.













