బాలీవుడ్ ని మించిన టాలీవుడ్
నిన్న సాహో.. నేడు సైరా.. రేపు ఆర్ఆర్ఆర్…
తెలుగు సినిమా స్టేటస్ మారిపోయింది. వ్యాపారపరంగా, నిర్మాణపరంగా సినిమాను ఎన్నికోట్లకైనా నిర్మించి అమ్మవచ్చన్న ధీమా ఇప్పుడు తెలుగు సినిమాల్లో కనిపిస్తోంది. నిన్నటివరకు ఇలాంటి చిత్రాలు నిర్మించడం తమకే సాధ్యమన్న ధీమాలో ఉన్న బాలీవుడ్ సైతం ఇప్పుడు తెలుగు సినిమాలవైపు చూస్తోంది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ ఎంతో టాలీవుడ్ అంతే అన్నట్లుగా సినిమాలు తెలుగులో తయారై వస్తున్నాయి. పనిపరంగానూ, పరపతిపరంగానూ నేడు తెలుగు సినిమా ఖ్యాతి జాతీయ సినిమా స్థాయిని దాటిపోయింది. అంతర్జాతీయ సినీ నిర్మాణ సంస్థలుసైతం టాలీవుడ్‌తో కలిసి పనిచేసే స్థాయిని టాలీవుడ్ నేడు తెచ్చుకుంది. హాలీవుడ్ నిర్మాణ?సంస్థలు నేడు తెలుగు సినిమావాళ్ళతో కలిసి పనిచేసేదానికి ముందుకు రావడం చూస్తుంటే తెలుగు సినిమా కలెక్షన్లలోనే కాదు… నిర్మాణపరంగా తన పరిధిని అంతర్జాతీయ స్థాయికి విస్తరించుకుందని చెప్పవచ్చు.
రాజమౌళి ప్రాజెక్టు బాహుబలితో అమాంతం అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయిన ప్రభాస్ తాజాగా నటించిన ‘సాహో’ చిత్రం 300కోట్ల రూపాయలతో నిర్మితమైంది. భారీగ్యాప్ తరువాత మెగాస్టార్ కూడా తన తాజా చిత్రం సైరాతో మరోసారి తన స్టామీనాను నిరూపించుకునేందుకు భారీగానే వస్తున్నారు. ఈచిత్రం ప్రాజెక్టు 250 నుంచి 300 కోట్ల దాకా ఉండవచ్చని చెబుతున్నారు. రాజమౌళి తన సత్తాను చాటేలా రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం బడ్జెట్టూ 300 కోట్ల రూపాయలంటున్నారు. రానా హీరోగా గుణశేఖర్ నిర్మించనున్న హిరణ్యకశిప బడ్జెట్ కూడా 250 కోట్ల రూపాయలని చెబుతున్నారు. ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలన్నీ తెలుగుకే పరిమితమై నిర్మించడం లేదు. బహుభాషా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నారు. అందుకే ఈ చిత్రాల్లో అద్భుతమైన సాంకేతిక ప్రతిభకు పెద్ద పీట వేస్తున్నారు.
తెలుగు సినిమాకు ఇప్పుడు వ్యాపారం ఎలా చేయాలో బాగా తెలిసింది. దాంతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు తెర లేపింది. పరిమితులను మించిపోయి సినిమాలను నిర్మిస్తోంది. ఇక్కడి భారీ చిత్రాలను రీమేక్ చేయడానికి బాలీవుడ్ రెడీ అయిందంటే తెలుగు సినిమా స్థాయి ఏ రేంజ్‌కి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. కొత్త అనుభూతితో చిత్రాలను తీస్తే కలెక్షన్లు సాధించవచ్చని రాజమౌళి తన బాహుబలి ద్వారా నిరూపించి చూపించారు. దాంతో తెలుగు సినిమా కొత్త కథతో, భారీ సెట్టింగ్‌లతో, ఆత్యాధునిక సాంకేతికతో బాలీవుడ్‌ను మించి ముందుకు దూసుకుపోతోంది.
తెలుగు సినిమారంగం తన చిత్రాల నిర్మాణంతో బాలీవుడ్‌పై ప్రభావం చూపడం ఈ మధ్యే జరిగింది కాదు. గతంలో కూడా కొన్ని చిత్రాలు బాలీవుడ్‌పై ప్రభావం చూపించేలా వచ్చాయి. శివ నుంచి సత్య వరకు రామ్‌గోపాల్ వర్మ తన సినిమాలతో బాలీవుడ్‌పై ప్రభావాన్ని చూపించారు. బాలీవుడ్ సౌత్ సినిమావైపు నేడు ఎక్కువగా చూస్తోంది. ప్రాంతీయ భాషా చిత్రాల హవా పెరగడంతో బాలీవుడ్ హీరోలు సైతం తమ చిత్రాల విజయంకోసం బాగా కష్టపడుతున్నారు.
ప్రపంచ మార్కెట్లో…
టాలీవుడ్ ప్రతిభ నేడు ప్రపంచ మార్కెట్‌కు విస్తరించింది. నిన్న బాహుబలి పార్ట్1, పార్ట్ 2తో కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన టాలీవుడ్ నేడు సాహోతో మరోసారి ప్రపంచమార్కెట్‌ను ఆకర్షించింది. రేపు సైరా చిత్రంపై కూడా ప్రపంచ మార్కెట్ దృష్టిని సారించిందంటే తెలుగు చిత్రాలకు ప్రపంచ మార్కెట్లో ఎంతటి స్టామినా ఉందో తెలుస్తోంది. ఈ చిత్రాలు నిర్మాణం నుంచే అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాయి. అదే ఈ చిత్రాల గొప్పదనం. ఈ చిత్రం ఎలా వసూలు చేస్తుందో అన్న విషయాన్ని పక్కనబెట్టి నిర్మాణం నుంచి విడుదలయ్యేవరకు ఎంత మార్కెట్‌ను, క్రేజీని కొల్లగొట్టిందో చూసినప్పుడు దేశీయ చిత్రాల్లో తెలుగు చిత్రాలకు కూడా పెద్ద మార్కెట్ ఉందనే విషయం తెలుస్తోంది.
ప్రాంతీయ చిత్రాల వైపు ప్రేక్షకులంతా తలతిప్పి చూడడం అంటే మామూలు విషయం కాదు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రాలు ప్రపంచ సినీ మార్కెట్‌ను, విదేశాల్లోని ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. ఈ రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులకే కాదు భారతీయ ప్రేక్షకులు అందరూ గర్వించదగింది. సినిమా కోసం వెచ్చించిన ఖర్చును చూసినప్పుడు అదీ ఓ సంచలనమైతే ఆ చిత్రాలకోసం మార్కెట్లో వచ్చిన పోటీ మరో రికార్డుగా చెప్పవచ్చు. అటు బాలీవుడ్ కావచ్చు, ఇటు హాలీవుడ్ కావచ్చు. వాటిల్లో కూడా భారీ బడ్జెట్ చిత్రాలు ఉంటాయి. కానీ ఓ ప్రాంతీయ భాషకు చిత్రాన్ని అన్నీ భాషల వాళ్ళు ఆసక్తితో చూస్తున్నారంటే అదీ గొప్ప విషయంగానే పేర్కొనవచ్చు.
గతంలో ప్రాంతీయ భాషా సినిమాలు కేవలం పొరుగు రాష్ట్రాల వరకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ దీన్ని బాహుబలి బ్రేక్ చేసింది. బాహుబలి చిత్రాలు ప్రపంచ మార్కెట్‌ను కొల్లగొట్టింది. దేశంలో ఐదు భాషల్లో అనువాదమై ఆదరణ పొందాయి. ఇంతటి ఖ్యాతిని ఓ ప్రాంతీయ సినిమాకు తెచ్చి పెట్టిన ఘనత బాహుబలి చిత్రాలదే. ఈ సినిమా ప్రేరణతో తమిళం, కన్నడ, మలయాళ భాషా చిత్రాలు సైతం తమ సత్తాను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రాంతీయ సినిమా అంటే సొంత రాష్ట్రానికే పరిమితం కాదని, కథ విషయంలో ఖర్చు విషయంలో కొంత వైవిధ్యంగా ఆలోచిస్తే ప్రపంచ సినీ మార్కెట్లో అవలీలగా కాలు పెట్టవచ్చని బాహుబలి తర్వాత కేజీఎఫ్ (కన్నడ) చిత్రం నిరూపించింది. తాజాగా సాహో చిత్రం సైతం దీనినే కొనసాగించింది. ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మేనియా మామూలుగా లేదు. రజనీ నటించిన కబాలి చిత్రానికి వచ్చిన క్రేజ్ సాహోకు వచ్చింది. ఈ చిత్రానికి జరిగిన బిజినెస్ కూడా భారీగానే ఉంది. మార్కెట్ వర్గాల సమాచారం మేరకు 330 కోట్ల బిజినెస్ జరిగిందని తెలిసింది. ఇంత పెట్టుబడి ఓ సినిమాపై పెట్టడం సాహసమే అయినప్పటికీ, సినిమా మేకింగ్‌పై ఉన్న నమ్మకం వల్ల ఇది సాధ్యమైంది.
సాహో.. సైరా…
కాగా మరోవైపు సాహో చిత్ర ఫలితం నెలరోజుల వ్యవధిలో వస్తున్న మరో భారీ చిత్రం సైరాపై ఉంటుందా? అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సాహోకు సుమారు 300 కోట్లు ఖర్చు చేశారు. సైరా కూడా అంతే 300 కోట్ల బడ్జెట్ సినిమా ఇది. పైగా మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ కావడంతో చర్చనీయాంశం అయింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఆయన కెరీర్లోనే అత్యంత భారీ చిత్రం. అన్ని భాషల్లో విడుదల చేసేలా అన్ని భాషలకు చెందిన నటీనటులను సినిమాలో తీసుకున్నారు. అక్టోబర్ 2వ తేదీని విడుదల తేదీగా నిర్ణయించారు. బ్రాండ్‌తో వస్తున్న సైరా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. చిరంజీవికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్ ఎంతనేది కూడా ఈ సినిమాతో స్పష్టం అవుతుంది.
సాహో, సైరా సినిమా నిర్మాణం నుంచే చిత్రం నిర్మాతలు, దర్శకులు ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళి బిజినెస్ చేసుకున్నారు. సాహో ఫలితం ఎలా ఉన్నా సైరాపై దాని ప్రభావం ఉండదని అంటున్నారు.
సైరా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా. పైగా మెగాస్టార్ నటించారు. అమితాబ్ మొదలు వివిధ భాషలకు చెందిన నటీనటులు ఉన్నారు. కథ విషయంలో చిరంజీవి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది అందరికీ తెలుసు. అందుకే ఆయన సినిమాలకు సక్సెస్ శాతం ఎక్కువ. పైగా సైరా చిత్రం భారతీయ భాషలన్నింటిలో రికార్డ్ స్థాయి కలెక్షన్లు సాధిస్తుందని చిత్ర సంబంధికులు ఆశిస్తున్నారు. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు కల్పించకుండా ప్రేక్షకుల ముందుకు తేవడం వల్ల సాధారణ అంచనాలతో థియేటర్లో చూసే ప్రేక్షకులు మెచ్చుతారని ట్రేడ్ వర్గాలు అంటుంటాయి. ఈ పద్దతి గతంలో అనేక చిత్రాల విషయంలో రుజువైంది.
ఆర్ఆర్ఆర్ మరో సంచలనం!
బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి’ క్రియేట్ చేసిన స్ట్రోమ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి వచ్చే వరకు ఇండియన్ సినిమా చరిత్రలో రూ. 1000 కోట్ల వసూల్లు అనేవి లేవు. బాహుబలి 2 ఫుల్ రన్లో దాదాపు రూ. 1800 కోట్ల విధ్వంసకర వసూళ్లతో రికార్డులన్నీ బద్దలు కొడుతూ సంచలనం క్రియేట్ చేసింది. బాహుబలి తరువాత ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రాజమౌళి ఎఫెక్ట్ బాక్సాఫీస్‌పై వచ్చే ఏడాది ఎలా ఉంటుందో ఇప్పడే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ది మ్యాన్ బిఫోర్ ది స్ట్రోమ్’ అంటూ రాజమౌళిపై ఎన్టీఆర్ పెట్టిన కామెంట్ అందరినీ ఆకర్షిస్తోంది.
దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ నందమూరి తారకరామారావు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. టైటిల్ ఇదే అని స్పష్టంగా చెప్పకపోయినా ప్రస్తుతానికి ఇదే టైటిల్‌గా చెలామణీ అవుతోంది. ఈ చిత్రం కథపై అనేక రూమర్స్ వినిపించినప్పటికీ చివరకు రాజమౌళి ఈ చిత్రం కథను వివరించారు.
ఇది 1920 నాటి ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ మూవీ అని ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరంభీలు కలిసి పోరాడితే ఎలా ఉంటుంది అనే కోణంలో అల్లిన కథే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ అని ఆర్ ఆర్ ఆర్ కథ స్టోరీ లైన్‌ను మీడియాకి వివరించారు రాజమౌళి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈచిత్రం 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే పవర్ ఫుల్ క్యారెక్టర్లో ఆయన నటిస్తున్నారు. రామ్‌చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. తారక్ సరసన డేజీ అడ్గారియన్స్ నటిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. అయితే ఇదే టైటిల్‌గా బావుందని అంటున్నారు. అన్ని భాషల్లో ఇది కామన్‌గా ఉంటుంది. కానీ ఒక్కో భాషలో ఒక్కో టైటిల్ ఉంటుంది. నా సినిమాలో యంగ్ అల్లూరి సీతారామరాజుగా చరణ్, యంగ్ కొమరం భీంగా తారక్ కనిపించబోతున్నారు” అని రాజమౌళి చెప్పారు
ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా జూలై 30, 2020న 10 భారతీయ భాషల్లో విడుదల కానుంది. డి పార్వతి సమర్పణలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల బడ్జెట్ అంచనాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.













